MP Avinash Reddy: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం కడప జిల్లాలో పర్యటించిన సీబీఐ .. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. మంగళవారం హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. కానీ హాజరుకాలేనని అనినాష్ రెడ్డి సమాధానం ఇచ్చారు. దీంతో సీబీఐ అరెస్టుకు రంగం సిద్ధం చేసింది.

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సమాధానంతో సీబీఐ సంతృప్తి చెందలేదు. ఐదు రోజుల తర్వాత హాజరవుతానని అవినాష్ రెడ్డి చెప్పడంతో సీబీఐ ఏకీభవించలేదు. దీంతో హైదరాబాద్ నుంచి పులివెందులకు సీబీఐ బృందం బయలుదేరింది. ఏ క్షణమైనా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే స్థానిక పోలీసులకు సీబీఐ బృందం సమాచారం ఇచ్చిందని తెలుస్తోంది. సీబీఐ ప్రత్యేక బృందం చేతిలో అరెస్టు వారెంట్ కూడా ఉందని సమాచారం. దీంతో అవినాష్ రెడ్డి ఏ క్షణమైనా సీబీఐ కస్టడీలోకి వెళ్లే అవకాశం ఉంది.
తన పై అభియోగాల పై అవినాష్ రెడ్డి కూడా స్పందించారు. తన పై అభియోగాలు రావడం బాధాకరమని అన్నారు. ప్రజలకు నిజం తెలియాలని, ఐదు రోజుల తర్వాత సీబీఐ విచారణకు హాజరవుతానని చెప్పారు. కానీ అవినాష్ సమాధానంతో సీబీఐ సంతృప్తి చెందలేదు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని మాత్రమే అరెస్టు చేస్తారా ? లేదా .. ఇంకా ఎవరినైనా అరెస్టు చేసే అవకాశం ఉందా ? అన్న ఉత్కంఠ నెలకొంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో పెద్దతలకాయలు ఉన్నాయని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఆరోపించారు.

వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ అధికారులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టు తర్వాత మరికొంత మందిని అరెస్టు చేసే అవకాశం ఉంటుంది. సీబీఐ చేతిలో అనుమానితుల లిస్టు ఉందని తెలుస్తోంది. కేసు విచారణ వేగవంతం అయితే మరిన్ని పెద్దతలకాయలు బయటపడే అవకాశం ఉందని తెలుస్తోంది. వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టుకు సహకరిస్తారా ? లేదా అన్న ప్రశ్నలు కూడ తలెత్తుతున్నాయి.