Pawan Kalyan Kondagattu: తెలంగాణలో మరో రాజకీయ కూటమి ఆవిర్భవించబోతోందా అంటే అవుననే సమాధానం వస్తోంది పొలటికల్ సర్కిల్స్ నుంచి. ఆంధ్రప్రదేశ్‌లోని విపక్ష పార్టీలు టీడీపీ, జనసేన రెండు కలిసి తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని ఆయా పార్టీలే పేర్కొంటున్నారు. అధికారికంగా పొత్త ప్రకటన రాకపోయినా.. ఆంధ్రప్రదేశ్‌కంటే ముందే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంతో కలిసి పోటీచేస్తాయని వస్తున్న వార్తలను రెండు పార్టీల నేతలు కొట్టిపారేయడం లేదు.

తెలంగాణ బరిలో జనసేన..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని విజయవాడలో జరిగిన పార్టీ సమావేశంలో జనసేన అధికనేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తెలంగాణలో 30 నుంచి 35 స్థానాల్లో పోటీచేస్తామని తెలిపారు. ఈ క్రమంలో బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్న ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయకుడు, తెలంగాణలో బీజేపీకి తమ బలం తోడవ్వాలని ఆలోచన చేశారు. ఈమేరకు ఇటీవల ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించి తెలంగాణలో తమ బలం తగ్గలేదని చూపే ప్రయత్నం చేశారు. దీంతో బీజేపీ తమను దగ్గరకు తీస్తుందని భావించారు. కానీ బాబుకు నిరాశే ఎదురైంది. బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ టీడీపీతో పొత్తు వార్తలను కొట్టిపారేశారు. సింగిల్‌గానే పోటీ చేస్తామని ప్రకటించారు.
జనసేనతో దోస్తీ..
బీజేపీతో కలిసే ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో టీడీపీ అధినేత జనసేనతో దోస్తీకి ప్రయత్నాలు ప్రారంభించారు. గత ఎన్నికల్లో జనసేనకు 6 శాతం ఓట్లు వచ్చాయి. ఈసారి జనసేన మరింత బలపడింది. ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేస్తే గెలిచే పరిస్థితి లేదని టీడీపీ అధినేతకు అర్థమైంది. దీంతో బలం పుంజుకున్న జనసేనతో కలిసి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే త్యాగాలకు సిద్ధం కావాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చి.. పరోక్షంగా పొత్త సంకేతాలు ఇచ్చారు.

తెలంగాణలో కూటమిగా..
తెలంగాణలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఏపీలో వచ్చే ఏడాది మేలో ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీచేసి మంచి ఫలితాలు సాధిస్తే ఏపీ ఎన్నికల్లో తమకు లాభిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో 30 నుంచి 35 సీట్లకు పోటీ చేస్తామన్న జనసేనతో కలిసి టీడీపీ కూడా మరో 30 నుంచి 35 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందన్న అభిప్రాయం టీడీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.. ఇందుకు పవన్ కళ్యాణ్ కూడా సుముఖంగా ఉన్నట్లు జనసేన నేతలు చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనతోపాటు బీఎస్పీ కలిసి పోటీచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.