Pawan Kalyan- Gaddar: భూమి కోసం, భుక్తి కోసం పీడిత∙ప్రజల విముక్తి కోసం పోరాడిన విప్లవవీరుడు… అణగారిన వర్గాల్లో తన పాటతో చైతన్యం తీసుకువచ్చి ప్రజా గాయకుడు, ప్రజాయుద్ధ నౌక గద్దర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. తొలి, మలివిడత తెలంగాణ ఉద్యమ సమయంలో పల్లె పల్లెనా ఆయన పాటతో తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి కలిగించిన ఉద్యమకారుడు గద్దర్. తెలంగాణ సాధనలో.. గద్దర్ పాత్ర ఎప్పటికీ మరువలేనిది. ఆదివారం ఆయన గుండెపోటుతో హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గద్దర్ మరణ వార్తతో యావత్ తెలంగాణ సమాజం విషాదంలో మునిగిపోయింది. ఇక గద్దర్, జన సేనాని పవన్ కళ్యాణ్ మద్య గొప్ప అనుబంధం ఉంది. పవన్ కళ్యాణ్ తన తమ్ముడు అని.. తన కష్టసుఖాల్లో పాల్పంచుకుంటాడని, ఆర్థికంగా సాయం చేశాడని గద్దర్ పలు సందర్భాల్లో తెలిపారు. గద్దర్ మరణవార్త విని హైదరాబాద్‌కు వచ్చిన పవన్.. భావోద్వేగానికి లోనయ్యారు. గద్దర్ తనయుడిని పట్టుకుని విలపించారు. ఈ క్రమంలో తాజాగా గద్దర్‌కి నివాళులర్పిస్తూ ఆయన గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అన్యాయంపై తిరగబడ్డ పాట…
ఈ వీడియోలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ‘బీటలు వారిన ఎండలో.. సమ్మెట కొట్టే కూలీకి గొడుగు గద్దర్.. తాండాల బండల్లో చలిపులిని ఎదిరించే నెగడు గద్దర్. పీడిత జనుల పాట గద్దర్.. అణగారిన ఆర్తుల ఆసరా గద్దర్.. అడవిలో ఆకు చెప్పిన కథ గద్దర్. కోయిల పాడిన కావ్యం గద్దర్. గుండెకి గొంతొస్తే.. బాధకి భాష వస్తే.. అది గద్దర్. అన్నింటినీ మించి నా అన్న గద్దర్. అన్నా.. నువ్వు గాయపడ్డ పాటవి.. కానీ ప్రజల గాయాలకు కట్టుబడ్డ పాటవి. అన్యాయంపై తిరగబడ్డ పాటవి.. ఇదివరకు నువు ధ్వనించే పాటవి.. ఇప్పుడు కొన్ని లక్షల గొంతుల్లో ప్రతిధ్వనించే పాటవి.. తీరం చేరిన ప్రజా యుద్దనౌకకి.. జోహార్.. జోహార్.. జోహార్’ అంటూ పవన్ గద్దర్ గొప్పదనాన్ని అభివర్ణించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
శ్రీశ్రీ తర్వాత గద్దరే..
ఆదివారం గద్దర్ మరణ వార్త విన్న పవన్ కళ్యాణ్ హుటాహుటిన హైదరాబాద్‌కి వచ్చిన ఆయన పార్థీవ దేహం వద్ద కన్నీరు పెట్టుకున్నారు. గద్దరు కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా తనతో గద్దర్‌కు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తనకు చిన్నప్పటి నుంచి గద్దర్ స్ఫూర్తిగా కలిగించాడని.. శ్రీశ్రీ తర్వాత గద్దర్ అన్న ప్రభావమే తనపై ఎక్కువగా చూపించిందని తెలిపారు. గతంలో పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ తన తమ్ముడు అని.. పోరాట స్ఫూర్తి ఉన్నవాడని.. ఏ కష్టం వచ్చినా తన వద్దకు వెళ్లేవాడినని.. పలు సందర్భాల్లో ఆర్థికంగా ఆదుకున్నాడని చెబుతూ ఉండేవారు గద్దర్.
‘గుండెకు గొంతు వస్తే, బాధకు బాష వస్తే గద్దర్.. అన్నిటికీ మించి నా అన్న గద్దర్’’ అంటూ పవన్ ఎమోషనల్‌గా వీడియో పునరుద్ఘాటించారు.