Delhi Services Bill: ఢిల్లీలో ప్రభుత్వ అధికారాలకు కోత పెడుతూ.. లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు ఆ అధికారాలు కట్టబెడుతూ కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు ఆమోదం లభించింది. మూడు రోజుల క్రితం లోక్‌సభ ఆమోదం తెలుపగా, తాజాగా ఆగస్టు 7న రాజ్యసభలోనూ బిల్ పాస్ అయింది. ఇక చట్టబద్ధతే తర్వాయి. రాజ్యసభలో బిల్లు పాస్‌కాకుండా చేసి, ఎన్డీయేకు షాక్ ఇవ్వాలనుకున్న ఇండియా కూటమికే షాక్ తగిలింది. బిల్లుకు అనుకూలంగా 131 ఓట్లు రాగా, వ్యతిరేకంగా కేవలం 102 ఓట్లు వచ్చాయి.
బలం లేకపోయినా…
వాస్తవంగా రాజ్యసభలో విపక్ష ఇండియా కూటమే బలంగా ఉంది. అయినా కేంద్రం మొండి ధైర్యంతో ఢిల్లీ సర్వీసెస్ బిల్లును ప్లామెంట్‌లో ప్రవేశపెట్టింది. లోక్‌సభలో సులభంగా బిల్లు ఆమోదం పొందింది. సోమవారం రాజ్యసభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ఢిల్లీ సర్వీసెస్ బిల్లు పెట్టారు. దీంతో పొద్దుపోయే వరకూ సభ నిర్వహించారు. మొదట ఈ బిల్లుకు మూజువాణి ఓటుతో ఆమోదం లభించింది. అయితే మరోసారి ఓటింగ్ నిర్వహించాలని ఇండియా కూటమి పార్టీలు పట్టుపట్టాయి. దీంతో రాజ్యసభ చైర్మన్ మరోమారు ఓటింగ్ నిర్వహించారు.
సాంకేతిక సమస్యతో స్లిప్పులతో ఓటింగ్..
రెండోసారి ఓటింగ్ నిర్వహిస్తుండగా, సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో రెండోసారి ఓటింగ్ ప్రక్రియ ఆలస్యమైంది. రాత్రి 10 గంటల వరకు సాంకేతిక సమస్య పరిష్కారం కాకపోవడంతో స్లిప్పుల ద్వారా ఓటింగ్ నిర్వహించారు. ఇందులో బిల్లుకు అనుకూలంగా 131 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 102 ఓట్లు వచ్చాయి. దీంతో బిల్లు ఆమోదం పొందినట్లు రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు.
బలం లేకపోయినా..
వాస్తవంగా రాజ్యసభలో ఎన్డీఏ పక్షానికి బలం లేదు. మొత్తం 242 మంది ఉన్న రాజ్యసభలో ఎన్టీఏకు 104 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. దీంతో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు రాజ్యసభలో పాస్ కావడం కష్టమని అంతా భావించారు. కానీ, తటస్థంగా ఉన్న వైసీపీ, బీజేడీ, బీఎస్పీ, టీడీపీ పార్టీలు బిల్లుకు అనుకూలంగా రాజ్యసభలో ఓటు వేశాయి. దీంతో బిల్లు సులభంగా పాస్ అయింది. ఇదిలా ఉంటే.. తెలంగాణలోని అధికార పార్టీ బీఆర్‌ఎస్ ఏ కూటమిలో లేకపోయినా బిల్లుకు వ్యతిరేకంగానే ఓటు వేసింది. అయినా విపక్షాలు బిల్లు ఆమోదాన్ని అడ్డుకోలేకపోయాయి.
నువ్వా నేనా అన్నట్లు సాగిన రాజ్యసభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు పాస్‌కావడంతో రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించేందుకు కేంద్రం ప్రక్రియ ప్రారంభించింది. త్వరలో ఢిల్లీ ప్రభుత్వ అధికారాలకు కత్తెర పడనుంది.