Pawan Kalyan Yuvashakti Meeting: భగభగమంటూ యువ, మహిళా శక్తి కదిలింది. ఉగ్రరూపం దాల్చింది. ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. ఇందుకు రణస్థలంలోని యువశక్తి వేదిక అయ్యింది. మూడు పదులు కూడా దాటిని వారు, వీరమహిళలు తాము సైతం అంటూ ముందుకొచ్చారు. యువశక్తి కార్యక్రమంలో స్వచ్ఛందంగా భాగస్థులయ్యారు. పాలకుల నిర్లక్ష్యం, ప్రభుత్వాల ఉదాసీనతతో ఉత్తరాంధ్ర దగాకు గురైందన్న భావనతో ఉన్న యువత, మహిళలు పవన్ తమ గొంతుకగా భావిస్తున్నారు. తమ ఆశలు, ఆకాంక్షలు పవన్ తోనే సాధ్యమని నమ్ముతున్నారు. ఈ ప్రాంతం పట్ల పాలకుల నిర్లక్ష్యం.., వనరుల విధ్వంసం.., అభివృద్ధి రాహిత్యం అనే ముప్పేట దాడిని అడ్డుకోవడం ఒక్క పవన్ తోనే సాధ్యమని భావిస్తున్నారు. బానిసత్వం విడనాడి వెనుకబాటుతనం అన్న అపవాదు నుంచి తమ ప్రాంతాన్ని బయటపడేందుకు పవన్ తమకు గొంతెత్తే అవకాశం ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందుకే యువశక్తిలో తాము సైతం సమిధులుగా మారడానికి డిసైడ్ అయ్యారు.

సాధారణంగా మిగతా రాజకీయ పార్టీలు అధినేతల పర్యటనకు జనసమీకరణ చేస్తాయి. జన సైనికులు మాత్రం అందుకు అతీతం. ఇప్పటివరకూ పవన్ పర్యటనలకు జనాలను సమీకరించే సంస్కృతి జనసేనలో లేదు. ఇప్పుడు యువశక్తి కార్యక్రమంలో కూడా అదే పరంపర కొనసాగుతోంది. అయితే యువత, వీర మహిళలు ఊరూ వాడ ప్రచారం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ఆకాంక్షల కోసం పవన్ పడుతున్న తపనపై అవగాహన కల్పిస్తున్నారు. దీనిపై ప్రజల నుంచి విశేషస్పందన లభిస్తోంది. ప్రజలు స్వచ్ఛందంగా కార్యక్రమానికి హాజరయ్యేలా దోహదం చేస్తోంది.రాజకీయ పార్టీల సమావేశాలంటే కేవలం కీలక నాయకుల ప్రసంగాలు ఉంటాయి. కానీ ఫస్ట్ టైమ్ 100 మంది యువ ప్రతినిధుల అంతరంగాన్ని.. వీర మహిళల అభిప్రాయాలను తెలుసుకునేందుకు పవన్ సిద్ధపడుతుండడంతో పొలిటికల్ సర్కిల్ లో హీట్ ను పెంచుతోంది.

నెల రోజుల కిందట యువశక్తి కార్యక్రమాన్ని పవన్ ప్రకటించినప్పుడు అంతా లైట్ తీసుకున్నారు. అటు ఎల్లో, ఇటు నీలి మీడియా సైతం పెద్దగా పట్టించుకోలేదు. మిగతా రాజకీయ పక్షాలు సైతం షరా మామ్మూలే కదా అని తేలిగ్గా కొట్టిపారేశాయి. కానీ ఇంతింతై వటుటింతై అన్నట్టు యువశక్తి దావనంలా వ్యాపించింది. సైలెంట్ రివల్యూషన్ ప్రారంభమైంది. ముఖ్యంగా మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. పవన్ ఆశయాలు, ఆశలపై గొంతెత్తడం ప్రారంభించారు. గతంలో ఏ పార్టీకి, ఏ నాయకుడికి లేనంతగా పవన్ కు వీర మహిళలు సపోర్టుగా నిలిచారు. దాదాపు యువశక్తి ప్రాంగణంలో భారీ ఫ్లెక్సీలు,పోస్టర్లలో మహిళలు, మహిళా నాయకులవే అధికంగా ఉండడం విశేషం. యువశక్తి నిర్వహణ కమిటీల్లో సైతం మహిళలదే అగ్రస్థానం. ఆహ్వాన కమిటీల నుంచి చివరకు ఆహారం రూపొందించడం వరకూ కీలక భూమిక వారిదే. పవన్ తో పాటు జనసేనను ఓన్ చేసుకోవడం వల్లే కార్యక్రమం ఇంతలా సక్సెస్ కావడానికి కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత రెండు వారాలుగా తమ ఇంట్లో జరిగే కార్యక్రమంగా యువత భావిస్తున్నారు. సభా స్థలి ఏర్పాటు నుంచి ప్రజల్లో అవగాహన కల్పించే వరకూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. అటు మహిళలు, ఇటు యువత జనసేనకు ఆభరణంగా మారారు.