Nadendla Manohar- Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్లో మార్పు కోసం జనసైనికులు పరితపిస్తున్నారు. అధికార పార్టీకి మరోసారి అవకాశం ఇస్తే అధోగతిపాలవుతామని నమ్ముతున్నారు. రాజకీయ మార్పులో భాగస్వామ్యం కావాలని, అహర్నిశలు శ్రమిస్తున్న జనసేనానికి అండగా నిలవాలని కంకణం కట్టుకున్నారు. మార్పు కోసం ఒక్కో జనసైనికుడు ఎంతలా పరితపిస్తున్నారన్న దానికి జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ చెప్పిన ఘటనే నిదర్శనం.

జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వస్తున్న సందర్భంలో విమానంలో జరిగిన ఘటన గురించి పార్టీ సమావేశంలో పంచుకున్నారు. ఓ జనసైనికుడు చేసిన పనికి తాను షాక్ అయ్యానని ఆయన చెప్పారు. ఇంతకీ ఆ జనసైనికుడు చేసిన పని ఏంటంటే.. నాదెండ్ల మనోహర్ ని చూసిన వెంటనే రెండు లక్షల రూపాయల చెక్కును జనసేనకు రాసివ్వడమే. ఆ జనసైనికుడి చర్యకు నాదెండ్ల మనోహర్ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారట. విమానంలో ప్రయాణిస్తూ పార్టీ కోసం చెక్కు రాసివ్వడమంటే.. ఆ జనసైనికుడి చిత్తశుద్ధి ఎలాంటిదనేది అర్థమవుతుందని ఆయన అన్నారు.
జనసైనికులు ఏపీలో మార్పు కోసం ఎంతగా పరితపిస్తున్నారో ఆ ఘటన నిదర్శనమని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఎంతటి బలమైన కాంక్ష ఉంటే తప్పా అలా చేయరని ఆయన అన్నారు. ఆ వ్యక్తి పేరు శ్రీనివాసరావు అని చెప్పారు. కనీసం ఫోటో దిగుదామన్నా కూడ ఆయన ఒప్పుకోలేదని తెలిపారు. పార్టీ కోసం చెక్కు ఇస్తున్నానని, ఆ చెక్కును పవన్ కు చేర్చాలని కోరినట్టు ఆయన చెప్పారు. జనసేనను అధికారంలోకి తీసుకు రావాలనే ఆ వ్యక్తి పట్టుదల చూసి ముచ్చటేసిందని అన్నారు.

ఏపీలో అధికార పార్టీ వైఖరితో ప్రజలు విసుగుచెందారని, జనసైనికుల్లాగే ప్రజలు కూడ మార్పు కోరుతున్నారని మనోహర్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో మార్పు తథ్యమని చెప్పారు. ఆ మార్పులో జనసైనికుల భాగస్వామ్యం సింహభాగమని అన్నారు.
ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను విరమించుకోవాలని సూచించారు. 2024 ఎన్నికలే వైసీపీకి చివరి ఎన్నికలని జోస్యం చెప్పారు.