Pawan Kalyan Varahi Yatra: పవన్ సడన్ గా రూట్ మార్చారు. వారాహి మూడో విడత యాత్రను అనూహ్యంగా విశాఖ జిల్లాలో ప్రారంభించనున్నారు. ఈనెల 10 నుంచి యాత్ర ప్రారంభం కానుంది. ఇప్పటికే సన్నాహక సమావేశాన్ని సైతం పూర్తి చేశారు. యాత్ర షెడ్యూల్ ప్రకటించే పనిలో బిజీగా ఉన్నారు. అయితే మూడో విడత వారాహి యాత్ర రాయలసీమలో ప్రారంభమవుతుందని అంతా భావించారు. కానీ పవన్ మాత్రం విశాఖ వైపే మొగ్గు చూపారు. అయితే దీని వెనుక వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది.
విశాఖ జిల్లాలో చేపట్టబోయే యాత్ర తొమ్మిది రోజులు పాటు సాగనుంది. అటు తరువాత విజయనగరం, శ్రీకాకుళం తో ఉత్తరాంధ్రలో యాత్రను సక్సెస్ ఫుల్ గా ముగించాలని పవన్ భావిస్తున్నారు. ఆది నుంచి పవన్ ఫోకస్ అంతా ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర మీదే ఉంది. 34 సీట్లు ఉన్న ఉభయగోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా వైసిపికి గెలవనివ్వనని పవన్ ప్రతినబూనారు. ఇప్పుడు ఉత్తరాంధ్రలో సైతం 34 సీట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా పట్టు బిగించడం ద్వారా అధికార వైసీపీకి ఝలక్ ఇవ్వాలని పవన్ భావిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు పొంది ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించాలన్నది పవన్ అభిమతం. పొత్తులు ఉన్నా లేకపోయినా ఉభయగోదావరి తో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో 68 నియోజకవర్గాల్లో మెజారిటీ సీట్లు దక్కించుకోవాలన్నదే పవన్ లక్ష్యం. అందులో భాగంగానే వారాహి యాత్రకు పై ప్రాంతాలకు ప్రాధాన్యమించినట్లు తెలుస్తోంది. కనీసం 40 నియోజకవర్గాల్లో గెలుపొందితే.. కింగ్ మేకర్ గా మారవచ్చని పవన్ భావిస్తున్నారు. అందుకే వారాహి యాత్రలో ప్రత్యేక పిలుపు ఇవ్వనున్నారు.