Pawan Kalyan Next CM In AP: వచ్చే ఎన్నికల్లో పవన్ ఏపీకి సీఎం కాబోతున్నారా? కేంద్ర రాజకీయాల్లో సైతం క్రియాశీలక పాత్ర పోషించబోతున్నారా? రాజ్యాధికారాన్ని చెరువలో ఉన్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జాతక నిపుణులు కూడా ఇదే స్థాయిలో విశ్లేషణలు చేస్తున్నారు. చాలా మందికి జాతకాలపై నమ్మకం ఉండదు. కొందరు మాత్రం తమ జీవితంలో ఎదురయ్యే పరిణామాలను జాతకాల ద్వారా ముందే తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. జాతకం అనేది నమ్మకంపైనే ఆధారపడుతుంటుంది. అయితే జాతక నిపుణులు చెప్పిన చాలావరకూ రాజకీయాల్లో నిజమయ్యాయి. కొన్నిసార్లు ఫెయిలయ్యాయి కూడా. కానీ ఇప్పటికీ ఎక్కువ మంది నాయకులు జాతకాలనే నమ్ముతుంటారు. జాతకంలో లోపాలు ఉంటే సరిదిద్దుకుంటారు. జాతక పూజలు చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఏపీలో జాతక నిపుణులు అంతా ఒకటే మాట చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్ అమాత్య పదవిని అందుకుంటారు అని గంటాపథంగా చెబుతున్నారు. అయితే ముఖ్యమంత్రా, మంత్రా అన్నది మాత్రం తేల్చలేకపోతున్నారు. రాజ్యాధికారానికి చేరువలో మాత్రం ఉన్నారని చెబుతుండడంతో జన సైనికులు సంబరాలు చేసుకుంటున్నారు.

అయితే ఇప్పుడు ఏపీలో ఉన్న సిట్యువేషన్ కూడా జాతక నిపుణులు చెప్పిన దానికి చాలా దగ్గరగా ఉంది. అధికార పక్షం ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. సాక్షాత్ కేబినెట్ మంత్రులే ప్రభుత్వానిపై వ్యతిరేకత ఉందని ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. మూడున్నరేళ్లలో ప్రజలకు ఏమీ చేయకుండా మరోసారి వారి వద్దకు వెళ్తే తిరస్కరణ తప్పదని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఈసారి ఎదురీదక తప్పదన్న నిర్ణయానికి వచ్చేశారు. అటు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా ఏమంత ఆశాజనకంగా లేదు. చంద్రబాబుకు పార్టీ శ్రేణుల నుంచి ఆదరణ, సపోర్టు కరువవుతోంది. అందుకే ఆయన పవన్ వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. నువ్వే దిక్కు అంటూ కాళ్ల భేరానికి వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్ తో కలిసి నడిచేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు.

అటు కేంద్రంలో ఉన్న బీజేపీ సైతం పవన్ ను వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఎన్నికలు సమీపిస్తుండడంతో పవన్ ను మరింత మచ్చిక చేసుకొని.. ఆయన చరిష్మతో ఏపీలో బలోపేతం కావాలని చూస్తోంది.దేశంలో మిగతా రాష్ట్రాల్లో మోదీ మేనియా పనిచేసినా ఏపీలో మాత్రం వర్కవుట్ కాలేదు. అందుకే ఇక్కడ కఠిన నిర్ణయాల దిశగా బీజేపీ ఆలోచన చేస్తోంది. అవసరమైతే పవన్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో దించాలని యోచిస్తున్నట్టు సమాచారం. బీజేపీలో ముఖ్యమంత్రి స్థానాన్ని ముందుగా అనౌన్స్ చేసే చాన్స్ లేదు. ఒక వేళ సీఎం కాకుంటే కేంద్ర మంత్రి పదవితో పాటు కీలక పోర్టుఫొలియో ఇవ్వడానికి వెనుకడుగు వేయరు. అయితే అటు టీడీపీతో కలిసి నడిచినా కింగ్ మేకరయ్యే అవకాశముంది. కర్ణాటక తరహాలో సీఎం పదవి వరించినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇన్ని లెక్కల నడుమ జాతక నిపుణులు పవన్ విషయంలో వ్యక్తం చేస్తున్న భవిష్యత్ నిజమయ్యే అవకాశముందని మాత్రం జన సైనికులు బలంగా నమ్ముతున్నారు.