Pawan Kalyan: ప్రతిఒక్కరికీ బాల్యంలో ఏదో ఇంట్రెస్టింగ్ పరిణామం ఎదురవుతుంటుంది. అది జీవితాంతం నెమరువేసుకునేందుకు దోహదపడుతుంది. అది ఏ స్థాయిలో ఉన్నా.. ఎంతటి వారికైనా సహజం. అటువంటిదే పవన్ కళ్యాణ్ జీవితంలో ఎదురైంది. ప్రస్తుతం వారాహి యాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. అన్నవరం నుంచి ప్రారంభమైన యాత్ర ఉత్సాహభరిత వాతావరణంలో సాగుతోంది. నరసాపురంలో భారీ బహిరంగ సభలో ప్రసంగించిటన పవన్ అధికార వైసీపీపై విరుచుకు పడ్డారు. వైసీపీ విముక్త గోదావరి జిల్లాల కోసం తాను తాపత్రయపడుతున్నట్టు తెలిపారు.
నరసాపురంలోకి కడప పులివెందుల బ్యాచ్ లు ఎంటరయ్యాయని చెప్పారు. ప్రశాంతతకు తీరని భంగం కలిగిస్తున్నాయని ఆరోపించారు. చేపల సాగు పేరిట భూకబ్జాలు, అవినీతికి తెరతీస్తున్నాయని విమర్శించారు. వారిని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. జనసేన అధికారంలోకి వస్తే ఆ బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీకి స్థానం లేకుండా చేయడమే జనసేన లక్ష్యమన్నారు. ఆ బాధ్యత జనసేన తీసుకుంటుందని.. మధ్యలో వదిలేసే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
తనపై ఎవరికి ఏ అభిప్రాయాలున్నా తనకు అవసరమన్నారు. తాను మాత్రం 25 సంవత్సరాల పాటు రాష్ట్రానికి గొడ్డు చాకిరీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు పవన్ స్పష్టం చేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తన వద్ద మాస్టర్ ప్లాన్ ఉందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జగన్ పోవాలన్నారు. ఇందుకు తనవంతు కృషిచేస్తున్నట్టు చెప్పారు. వైసీపీ ఏలుబడిలో ఏ వర్గానికీ ప్రయోజనం లేదన్నారు. కాపుల కోసం చేసినదేమిటి అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో మార్పు తధ్యమని స్పష్టం చేశారు.
నరసాపురంతో తనకు, తన కుటుంబానికి ఎంతో ఆత్మీయ సంబంధం ఉందని గుర్తుచేశారు. బాల్యంలో నరసాపురంలో గడిపిన విషయాన్ని ప్రస్తావించారు. నాటి గురుతులను, బాల్యాన్ని గుర్తుచేసుకున్నారు. నరసాపురం బస్టాండ్ లో తాను తప్పిపోయిన విషయాన్ని ప్రస్తావించారు. బస్సు కోసమో, జట్కా బండి కోసమో తల్లిదండ్రులతో కలిసి నరసాపురం బస్టాండ్ లో వెయిట్ చేసే సమయంలో తాను తప్పిపోయానని.. అప్పటికి తన వయసు ఐదేళ్లు ఉంటుందని పవన్ చెప్పుకొచ్చారు. దురదృష్టవశాత్తూ ఆ రోజు దొరికానని.. లేకుంటే ఇక్కడే తిరుగాడి ఉండేవాడనని నవ్వుతూ వ్యాఖ్యానించారు. అటు సభికులు సైతం ఆసక్తిగా తిలకించారు.