Karnataka: ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టుంది కర్నాటకలో ఉచిత బస్సు ప్రయాణ హామీ దుస్థితి. ఒక్క ఉచిత బస్సు ప్రయాణం హామీతో ఆగలేదు. ఆ ప్రభావం చాలా రకాల వ్యాపారాలపై పడుతోంది. ప్రైవేటు వాహనాలకు గిరాకీ పడిపోయింది. అటువైపుగా మహిళలు చూడడం లేదు. ఆటో కార్మికులు ఉపాధి లేకుండా పోతోంది. చిన్నపాటి పనికైనా బస్సునే ఆశ్రయిస్తున్నారు. చివరకు మార్కెట్ కు సైతం నడిచి వెళ్లడం లేదు. బస్సులపైనే వెళుతున్నారు. చివరకు ఈ సమస్య ఎంతలా వచ్చిందంటే మహిళలు ఇంట్లో ఉండడం లేదు. డ్యూటీలు, వ్యాపారాలు చేసుకునే పురుషులు ఠంచనుగా ఇంటికి వచ్చేయాల్సి వస్తోంది. పిల్లల బాధ్యతలను చూసుకోవాల్సి వస్తోంది.
అయితే ముఖ్యంగా బెంగళూరు వంటి నగరాల్లో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోంది. గతంలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునేవారు ఇంటికి సకాలంలో వెళ్లేవారు కాదు. స్నేహితులు, సన్నిహితులతో ఎంజాయ్ చేసిన తరువాతే వెళ్లేవారు. కానీ ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణమనేసరికి వేగంగా ఇంటికి వెళ్లాల్సి వస్తోంది. మహిళలు వివిధ పనుల పేరిట బయటకు వస్తుండడంతో పిల్లల బాగోగులు చూసేందుకు ఇంటికి వెళ్లడం అనివార్యంగా మారుతోంది. దీంతో బార్లు, రెస్టారెంట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. లక్షలకు లక్షలు ఖర్చుపెట్టి బార్ల అనుమతి పొందిన నిర్వాహకులకు నష్టం తప్పడం లేదు. అయితే ఈ నష్టాన్ని ఎలా భర్తీ చేసుకుందానుకున్న కొన్ని బార్ల నిర్వాహకులు కొత్త ఆలోచన చేశారు. మహిళలకు మందు ఫ్రీ అని ప్రకటనలు చేశారు.
ఈ ప్రకటన వర్కవుట్ అవుతున్నట్టు తెలుస్తోంది. మందు అలవాటు ఉన్నవారు తమ పార్టనర్ ను తీసుకెళ్తే ఉచితంగా పొందవచ్చని ఆలోచన చేస్తున్నారు. కనీసం తాను మంచింగ్ కు ఖర్చుచేసినా మందు ఫ్రీగా దక్కుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే సాఫ్ట్ వేర్ రంగంలో డెవలప్ మెంట్ అయిన సిటీగా ఉన్న బెంగళూరులో పార్టీ కల్చర్ కూడా అధికం. ఈ తరుణంలో మందు ఫ్రీ అన్న ప్రకటన అమ్మాయిలను ఆలోచింపజేస్తోంది. ఎక్కువగా ఆకర్షిస్తోంది. ఇప్పటికే రెండు మూడు బార్లు ఈ ప్రకటన ఇచ్చాయి. అక్కడ వర్కవుట్ అవ్వడంతో మిగతా బార్ల యాజమాన్యాలు కూడా అదే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.