
Pawan Kalyan: వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ఫైట్ చేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ తాజాగా మరో వ్యూహాత్మక అడుగు వేయబోతున్నారు. ఏపీలో తనను టార్గెట్ చేస్తున్న వైసీపీ కాపు నేతలపై పోరాటంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో మరో ఎమ్మెల్యే నియోజకవర్గంలో భారీ సభకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను కూడగట్టే ప్రయత్నాల్లో ఉన్న జనసేనాని తాజాగా వైసీపీ కాపు నేతలు టార్గెట్ చేస్తున్నారు. పవన్ మాట్లాడితే చాలు వెంటనే రంగంలోకి దిగి కౌంటర్లు ఇచ్చేస్తున్నారు వైసీపీ కాపు నేతలు. దీంతో జనసేన కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఆయా నేతల్ని వారి సొంత నియోజకవర్గాలకు వెళ్లి మరీ టార్గెట్ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే పార్ట్ 1 పూర్తి చేసిన పవన్.. ఇప్పుడు పార్ట్ 2కు రంగం సిద్ధం చేస్తున్నారు.
టార్గెట్ వైసీపీ కాపులు
ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణŠ కు అధికార వైసీపీలో ఉన్న కొందరు కాపు నేతల నుంచి సమస్యలు తప్పడం లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై విమర్శలు చేయగానే రంగంలోకి దిగుతున్న వీరు.. కౌంటర్లు ఇచ్చేస్తున్నారు. దీంతో తిరిగి జనసేన వారికి ఎన్‌కౌంటర్లు ఇచ్చుకోవాల్సి వస్తోంది. అయితే ఈ డోస్ సరిపోవడం లేదని భావిస్తున్న పవన్ ఈ మధ్య రూటు మార్చేశారు. తనను వ్యక్తిగతంగా పదే పదే టార్గెట్ చేస్తున్న వారిని వారి సొంత నియోజకవర్గాల్లోనే దీటుగా ఎదుర్కోవాలని నిర్ణయించారు. ఈ ప్లాన్‌ను ఇప్పటికే విజయవంతంగా అమలు చేస్తున్నారు.
పార్ట్ 1 పూర్తి..
వైసీపీ కాపు నేతలపై పోరులో భాగంగా జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్.. ముందుగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో చాలాకాలం తర్వాత ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన అంబటి రాంబాబును టార్గెట్ చేశారు. ఇందులో భాగంగా రెండు నెలల క్రితం సత్తెనపల్లిలో భారీ సభ పెట్టి అంబటిపై తీవ్ర విమర్శలు చేసిన పవన్.. అక్కడ జనసేన అభ్యర్థిపైనా క్లారిటీ ఇచ్చేశారు. అలాగే నిత్యం అంబటిని సత్తెనపల్లిలోనే టార్గెట్ చేసేలా జనసేన ప్లాన్ అమలు చేస్తోంది. ఇప్పటికే సంక్రాంతి డ్రా విషయంలో అంబటికి జనసేన నేతలు కోర్టు వరకూ వెళ్లి కేసు నమోదయ్యేలా చేశారు. దీంతోపాటు నిత్యం అంబటిని ఏదో విధంగా టార్గెట్ చేస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లిని వదిలి కృష్ణాజిల్లా అవనిగడ్డకు మారిపోవాలని అంబటి ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
త్వరలో బందరులో పార్ట్ 2..
అంబటిపై వ్యూహం విజయవంతం కావడంతో ఇప్పుడు అదే బాటలో తనను టార్గెట్ చేస్తున్న మరో వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కూడా అయిన బందరు ఎమ్మెల్యే పేర్నినానిపై పవన్ దృష్టిపెట్టారు. జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభను ఇందుకు వేదిక చేసుకుంటున్నారు. మార్చి 14న మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ సభను నిర్వహించడం ద్వారా పేర్ని నానిని పూర్తిస్ధాయిలో టార్గెట్ చేయాలని జనసేనాని భావిస్తున్నారు. అందుకే ఈ సభకు మచిలీపట్నంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాపు జనాభా అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ఒకటైన బందరులో సభ పెట్టడం ద్వారా పేర్నినానితో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఉన్న ఇతర వైసీపీ నేతల్నీ టార్గెట్ చేసేందుకు పవన్∙సిద్ధమవుతున్నారు. బందరులో సభ నిర్వహణ ద్వారా తమ పార్టీలోకి వస్తారని భావిస్తున్న కాపు నేత వంగవీటి రాధాకు ఈ నియోజకవర్గంలో పరిస్ధితుల్ని అనుకూలంగా మార్చాలన్నది కూడా పవన్ వ్యూహంగా భావిస్తున్నారు.

వాళ్ల కోసం బిగ్ స్కెచ్
పవన్‌పై నిత్యం రాజకీయ మాటల దాడులకు దిగుతున్న వైసీపీ కాపు నేతల జాబితాలో ఇంకా మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్, మంత్రులు దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్నాథ్, బొత్స సత్యనారాయణ వంటివారు ఉన్నారు. రాబోయే రోజుల్లో వీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనూ సభలు పెట్టి కాపుల్ని తమవైపు పూర్తిగా తిప్పుకోవాలని పవన్ భావిస్తున్నారు. ఇప్పటికే మంత్రి గుడివాడ అమర్నాథ్.. స్ధానికంగా మారుతున్న పరిస్థితులు, పవన్‌పై విమర్శలతో కాపుల్లో చులకనయ్యారు. దీంతో ఆయన అనకాపల్లి నుంచి యలమంచిలికి నియోజకవర్గం మారేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే బొత్స వంటి వారు కూడా చీపురుపల్లిని వీడి విజయనగరం లేదా నెల్లిమర్ల వెళ్లే ఆలోచన చేస్తున్నారు. కన్నబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ రూరల్లో తానే స్వయంగా బరిలోకి దిగేందుకు పవన్ సిద్ధమవుతున్నారు.
మొత్తంగా వైసీపీ కాపు నేతలే లక్ష్యంగా జనసేనాని తాజాగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తనపై విమర్శలు చేసేవారి ఓటమికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు.