Pawan Kalyan: గుంటూరు జిల్లాపై పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారా? జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులను టార్గెట్ చేసుకున్నారా? వారిద్దర్ని వచ్చే ఎన్నికల్లో చావుదెబ్బ కొట్టాలని స్కెచ్ వేశారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వారి నియోజకవర్గాల్లో త్వరలో పవన్ పర్యటిస్తుండడం అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. పవన్ అంటే నోరు పారేసుకోవడంలో మంత్రి అంబటి ముందు వరుసలో ఉంటారు. పవన్ సిద్ధాంతపరంగా మాట్లాడినా, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపినా అంబటి తెరపైకి వస్తారు. పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తారు. వాడని.. వాడకూడని పదాలతో, మాటలతో విరుచుకుపడతారు. కానీ పవన్ ఎప్పుడు వారికి రియాక్ట్ కాలేదు. అంబటిని రాజకీయంగా చెక్ పెట్టాలన్న వ్యూహంతో ఉన్నారు. అందుకే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లిలో భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆదివారం అక్కడ కౌలురైతు భరోసా యాత్ర నిర్వహిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న 250 మంది కౌలురైతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున పవన్ సాయం అందించనున్నారు. జిల్లా వ్యాప్తంగా బాధిత కుటుంబాలను సత్తెనపల్లి వేదికగా చేసుకొని సాయమందిస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

సత్తెనపల్లి నియోజకవర్గంలో కాపులు అధికం. అందుకే జగన్ రేపల్లె నుంచి అంబటిని సత్తెనపల్లికి మార్చారు. రెండు సార్లు టిక్కెట్ ఇచ్చారు. ఇప్పుడు మంత్రి పదవి కూడా కేటాయించారు. అయితే ఈ సారి అంబటికి నియోజకవర్గంలో చాన్స్ లేదన్న టాక్ నడుస్తోంది. ఆయనకు వేరే నియోజకవర్గానికి షిప్ట్ చేస్తారన్న ప్రచారం ఉంది. అయితే ఆయన ఎక్కడ నుంచి పోటీచేసినా రాజకీయంగా చెక్ చెప్పాలన్న వ్యూహంతో పవన్ అడుగులు వేస్తున్నారు. సత్తెనపల్లి అయినా.. రేపల్లె అయినా ఆయనకు పొలిటికల్ లైఫ్ లేకుండా చేయాలన్న కృతనిశ్చయంతో పవన్ పనిచేస్తున్నారు. జనసేన ఆవిర్భావం నుంచే అంబటి విషం చిమ్ముతున్న తీరును గుర్తుచేస్తున్నారు. ఆయన మాటలు, చేష్టలు, హావభావాలపై పవన్ చాలా సీరియస్ గా ఉన్నారని.. వచ్చే ఎన్నికల్లో చెక్ చెప్పడం ఖాయమని జన సైనికులు చెబుతున్నారు.

మరో మంత్రి జోగి రమేష్ విషయంలో కూడా పవన్ సీరియస్ గా దృష్టిపెట్టారు. పవన్ పై కామెంట్స్ చేయడంలో రమేష్ ముందు ఉన్నారు. అటు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా చాలాసార్లు అభ్యంతరకర, అనుచిత వ్యాఖ్యలు చేశారు. అందుకే వచ్చే ఎన్నికల్లో జోగి రమేష్ ను దెబ్బతీయాలని పవన్ యోచిస్తున్నారు. ఇప్పటికే పెడన నియోజకవర్గ జనసేన నేతలతో సమావేశమై కొంత ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. జోగి రమేష్ తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని వారు పవన్ దృష్టికి తీసుకొచ్చారు. త్వరలో నియోజకవర్గంలో పర్యటిస్తానని.. జోగి రమేష్ కు చుక్కలు చూపిద్దామని పవన్ వారికి భరోసా కల్పించారు. మొత్తానికైతే గుంటూరు జిల్లాలో ఇద్దరు మంత్రులను టార్గెట్ గా చేసుకొని పవన్ రాజకీయాలు మొదలు పెట్టారు. ఇక వారు చుక్కలు చూడడం ఖాయమని జనసైనికులు అభిప్రాయపడుతున్నారు.