Posani Krishna Murali: పోసాని కృష్ణమురళి పరిశ్రమలో సపరేట్ ఇమేజ్ కలిగి ఉన్నారు. రచయితగా, నటుడిగా ఆయన రాణించారు. పలు హిట్ చిత్రాలకు పోసాని రైటర్ గా పని చేశారు. స్టార్ డైలాగ్ రైటర్ అని చెప్పొచ్చు. పోసాని డైలాగ్స్ చాలా బోల్డ్ గా ఉంటాయి. సమాజంలో ఉన్న లోపాలను కొంచెం పచ్చిగా చెప్పే ప్రయత్నం చేసిన రైటర్ పోసాని. తాళి, పెళ్లి చేసుకుందాం చిత్రాల్లో పోసాని డైలాగ్స్ దిమ్మతిరిగేలా ఉంటాయి. పెళ్లి చేసుకుందాం మూవీలో క్యారెక్టర్ లేని ఆడవాళ్ళ మీద పోసాని సెటైర్లు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ రోజుల్లో ఆ తరహా డైలాగ్స్ రాస్తే… స్త్రీ ఉద్యమాలు కూడా రావొచ్చు.

ఇక నటుడిగా ఆయన భిన్నమైన పాత్రలు చేశారు. ఆయన దర్శకత్వం వహించిన నటించిన మెంటల్ కృష్ణ న్యూఏజ్ ఫ్యామిలీ అండ్ సోషల్ డ్రామాగా నిలిచింది. నైటీ వేసుకొని పోసాని నటించడం ఒక సంచలనం. ఈ మూవీలో కూడా ఆడవాళ్ళపై సమాజంలో ఉన్న అపవాదులు వ్యంగ్యంగా విమర్శించే ప్రయత్నం చేశారు. పోసాని దర్శకుడిగా తెరకెక్కించిన పొలిటికల్ డ్రామా ఆపరేషన్ దుర్యోధన సూపర్ హిట్. ఆ సినిమాతో సమకాలీన రాజకీయాలను ఆయన ఏకిపారేశారు.
నటుడిగా బిజీ అయ్యాక పోసాని… రైటింగ్,డైరెక్షన్ పై ఫోకస్ తగ్గించేశారు. ఆయన సినిమాలన్నీ దాదాపు సోషల్ సెటైర్సే. ఆయన మార్క్ మూవీస్, డైలాగ్స్ మూవీ లవర్స్ బాగా మిస్ అవుతున్నారు. సినిమాలు సొంతగా నిర్మించి పోసాని ఆర్థికంగా నష్టపోయారు. ఒక దశలో ఇల్లు కూడా అమ్ముకున్నారు. ఆ దెబ్బతో డైరెక్షన్, నిర్మాణం వదిలేశారు. సేఫ్ గా నటుడిగా కొనసాగుతున్నారు.

ఆఫ్ స్క్రీన్ లో కూడా పోసాని మేనరిజం చాలా భిన్నంగా ఉంటుంది. మాట్లాడుతూ చొక్కా పైకి లాక్కోవడం ఆయన స్టైల్. అలాగే ‘ఐ లవ్ యూ’ రాజా అని ఆయన చెప్పే ఒక డైలాగ్ బాగా ఫేమస్. ఈ డైలాగ్ ఎలా పుట్టింది. దీని వెనుక నేపథ్యం ఏమిటో తెలుసుకోవాలనే ఆత్రుత చాలా మందికి ఉంది. ఒక సందర్భంలో పోసాని ఈ విషయంపై స్పందించారు. గతంలో పోసాని పిల్లల డాన్స్ రియాలిటీ షో జడ్జిగా పాల్గొన్నారట. చిన్న పిల్లలు కాబట్టి బాగా చేసినా, చేయకున్నా వారిని ఎంకరేజ్ చేయాలి. సున్నితంగా చెప్పాలి. అలా ఒక పిల్లాడి పెర్ఫార్మన్స్ గురించి మాట్లాడుతూ… ‘ఐ లవ్ యూ రాజా’ అని పోసాని అన్నారట. దానికి ప్రతిగా పిల్లాడు ‘థాంక్ యూ రాజా’ అన్నాడట. అప్పటి నుండి ఆ డైలాగ్ బాగా ఫేమస్ అయ్యిందట. సినిమాల్లో దర్శకులు నాకు ఆ డైలాగ్ పెడుతూ ఫేమస్ చేశారని చెప్పుకొచ్చాడు.