YCP Leaders: వైసీపీ నేతలకు భయం పట్టుకుంది. వచ్చే ఎన్నికల తర్వాత చుక్కలు కనిపించడం ఖాయమని స్పష్టమవుతోంది. పవన్ తాజా హెచ్చరికలతో భయం వెంటాడుతోంది. పవన్ మూడో విడత వారాహి యాత్రలో చేసిన ప్రకటనతో ముచ్చెమటలు పడుతున్నాయి. నన్ను తిట్టే వైసిపి నేతలు ఆలోచించుకోవాలని.. ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని కాపాడాలని మీరే నా వద్దకు వస్తారంటూ పవన్ స్పష్టం చేయడంతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రాష్ట్రంలో రాబోయేది జనసేన- టిడిపి ప్రభుత్వమేనంటూ పవన్ తేల్చి చెప్పడంతో వైసీపీ శ్రేణుల్లో అంతర్మధనం ప్రారంభమైంది.
జనసేన ఆవిర్భావం నుంచి పవన్ ను వైసీపీ నేతలు టార్గెట్ చేశారు. పూర్వాశ్రమంలో ప్రజారాజ్యం పార్టీలో పని చేసిన నేతలే ఎక్కువగా పవన్ ను టార్గెట్ చేసుకున్నారు. ఈ జాబితాలో పేర్ని నాని, కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్ లాంటి నేతలు ఉన్నారు.అటు మంత్రి రోజా,అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ లాంటివారు వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. పవన్ అంటే ఫెయిల్యూర్ నాయకుడు, రెండు చోట్ల ఓడిపోయాడు, ప్యాకేజీలు తీసుకున్నాడు వంటి సూటి పోటి మాటలతో ఇబ్బంది పెట్టేవారు. పోసాని కృష్ణ మురళి లాంటి వారు ఏకంగా పవన్ కుటుంబ సభ్యులపై తిట్ల దండకానికి దిగేవారు.
పవన్ విధానపరమైన అంశాలపై మాట్లాడినా.. వైసీపీ నేతలు మాత్రం పవన్ పై వ్యక్తిగత దాడికి దిగేవారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన వైసిపి ప్రజా ప్రతినిధులు స్థాయికి మించి మాట్లాడేవారు. అయితే పవన్ దీటుగా స్పందించినా.. వ్యక్తిగత విమర్శలకు మాత్రం దూరంగా ఉండేవారు. తనపై ఆరోపణలు చేసే క్రమంలో.. వ్యక్తిగత దాడి వద్దు అంటూ కోరేవారు. అయినా సరేవైసీపీ నేతలు పెడచెవిన పెట్టేవారు. వ్యవస్థలపై దాడి, వ్యక్తులపై దాడి పవన్ ను ఎంతగానో కలిచి వేసింది. రజనీకాంత్ లాంటిస్టార్ ఇమేజ్ ఉన్నవ్యక్తిని సైతం వైసీపీ నేతలు విడిచిపెట్టలేదు. సినీ రంగాన్ని సైతం టార్గెట్ చేసుకున్నారు. అందుకే పవన్ ఈ స్థాయిలో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికైనా మార్పు తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. లేకుంటే కాపాడాలని తననే కోరుకుంటారని గుర్తు చేస్తున్నారు. మొత్తానికైతే వైసిపి నేతలను పవన్ ముందుగానే అలెర్ట్ చేస్తున్నారు. అయితే ఈ పాటికే కొంతమంది వైసీపీ నేతలు పవన్ వద్ద పశ్చాత్తాప పడ్డారా? అన్న అనుమానాలు మిగతా నేతల్లో వ్యక్తమవుతున్నాయి. పవన్ నోటి నుంచి ఈ తరహా మాటలు రావడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది.