Vikram lander: విక్రమ్ బజ్జునే ఉంది..ఇప్పుడు ఇస్రో కిం కర్తవ్యం ఏమిటో?

ఇక 2014లో 67 పి/ చుర్యు మోవ్ గెరాసి మొంకో తోకచుక్క పైకి ఐరోపా అంతరిక్ష సంస్థ.. సౌర శక్తితో నడిచే ఫీలే ల్యాండర్ ను దించింది. అయితే అది పొరపాటున శాశ్వత చీకటి ప్రదేశంలో దిగింది.

Written By: Bhaskar, Updated On : October 2, 2023 10:43 am
Follow us on

Vikram lander: చంద్రయాన్-3 ద్వారా చంద్రుడి దక్షిణ ధృవం మీదకు వెళ్లిన విక్రమ్ ఇంకా లేవడం లేదు. సెప్టెంబర్ 22న అక్కడ సూర్యోదయం అయినప్పటికీ ఇంకా పడుకునే ఉంది. ఇవాల్టికి అక్కడ సూర్యోదయమై దాదాపు పది రోజులవుతోంది. అయినప్పటికీ దానిలో ఎటువంటి కదలిక లేకపోవడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. ప్రయోగం పకడ్బందీగా చేశామని చెబుతున్నప్పటికీ.. చివరి దశలో అక్కడ శీతల వాతావరణం తర్వాత సూర్యోదయం అయితే.. ప్రయోగించిన ల్యాండర్, రోవర్ తిరిగి పని చేసేందుకు కావలసిన శక్తిని అందించే వ్యవస్థలను ఏర్పాటు చేస్తే బాగుండేది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇస్రో తదుపరి అడుగులు ఏమిటి అనేవి ఆసక్తికరంగా మారాయి.

వాస్తవానికి చంద్రయాన్ _3 ద్వారా చందమామపై ల్యాండింగ్ ను సాఫీగా సాగించడం పైనే భారత్ దృష్టి సారించింది. అందుకే రేడియో ఐసోటోపిక్ ధర్మో ఎలక్ట్రిక్ జనరేటర్లు ( ఆర్ టీ జీ) పై దృష్టి సారించలేదు. కానీ, దాని ఆవశ్యకతను గుర్తించింది. వాటి సహకార దిశగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇందుకోసం భాభా అణు పరిశోధన కేంద్రం (బార్క్) తో ఒప్పందం కుదుర్చుకుంది. యోగాత్మకంగా ఐదు వాట్ల ఆర్టిజి ని తయారు చేయాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. అది ఒకవేళ సహకారం అయితే మెటలర్జీ, మెటీరియల్ సైన్స్ రంగంలో భారత ప్రతిభకు తార్కాణంగా నిలుస్తుంది. ఇస్రో ప్రణాళికలు రచిస్తున్న మంగళ్ యాన్_2, శుక్రయాన్ వంటి వ్యోమ నౌకలకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తోంది

ఇక 2014లో 67 పి/ చుర్యు మోవ్ గెరాసి మొంకో తోకచుక్క పైకి ఐరోపా అంతరిక్ష సంస్థ.. సౌర శక్తితో నడిచే ఫీలే ల్యాండర్ ను దించింది. అయితే అది పొరపాటున శాశ్వత చీకటి ప్రదేశంలో దిగింది. దీంతో ఎంతో ప్రయాసకు ఓర్చి రూపొందించిన ఈ వ్యోమ నౌక కొన్ని గంటలు మాత్రమే పనిచేసింది. ఫీలే లో ఆర్ టి జి ని కనుక ఏర్పాటు చేసి ఉంటే చీకటి ప్రదేశంలోనూ అది పనిచేసే ఉండేది. ఆర్టిడి స్ఫూర్తితో అణు శక్తితో నడిచే రాకెట్లనూ అభివృద్ధి చేయడానికి దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ పరిజ్ఞానం పేరు న్యూక్లియర్ థర్మల్ ప్రొపల్షన్. ఇందులో అను విచ్చిత్తి ప్రక్రియ ద్వారా యురేనియం పరమాణువులను విడగొడతారు. ఫలితంగా వెలువడే వేడి, ద్రవ హైడ్రోజన్ ను వాయు రూపంలో మారుస్తుంది. ఆ వాయువు రాకెట్ నాజిల్ గుండా వేగంగా దూసుకెళ్లి త్రస్ట్ ను ఉత్పత్తి చేస్తుంది.

ఆర్టీజీ బరువు, పరిమాణం చాలా తక్కువగా ఉండాలి. చిన్నపాటి వ్యోమ నౌకలోనూ ఇమిడిపోయేలా ఉండాలి. 1964 ఏప్రిల్ 21న అమెరికా ప్రయోగించిన ట్రాన్సిట్_5 బీ ఎన్_3 అనే నేవిగేషన్ ఉపగ్రహం.. ప్రయోగ సమయంలో విఫలమైంది. అది మడగాస్కర్ కు ఉత్తరాన మండిపోయింది. ఈ క్రమంలో అందులోని ఫ్లూటోనియం ఇంధనం వాతావరణం లో పడిపోయింది. పొద్దున్నుల తర్వాత ఆ ప్రాంతంలో స్వల్ప పరిమాణంలో ప్లుటోనియం_238 జాడలు కనిపించాయి. అందువల్ల ఆర్టీసీల్లో ఇంధనాన్ని సురక్షితంగా భద్రపరచాల్సి ఉంటుంది. ప్రమాదం సంభవించినప్పటికీ అది లీక్ కాకుండా చూసుకోవాలి. ఆర్టీసీలో ఎంపిక చేసుకున్న రేడియో ధార్మిక పదార్థాలు బీటా, గామా, న్యూట్రాన్ రేడియోధార్మికతను మరీ ఎక్కువగా విడుదల చేయకూడదు. వాటి వల్ల వ్యోమ నౌకలోని ఇతర పరికరాల పనితీరు ప్రభావితం అవుతుంది. ఆపరికరాలు ప్రభావితమైతే తిరిగి పని చేయడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే అక్కడికి వెళ్లి పరికరాలకు మరమ్మతులు చేయడం దాదాపు అసాధ్యం. అందుకే ప్రయోగ దశలోనే.. ప్రయోగం చేస్తున్నప్పుడే ముందు జాగ్రత్తలు తీసుకుంటే విఫలం కాకుండా ఉంటుంది..