తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ–జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభ బరిలో నిలిచారు. ఆమె తరఫున ప్రచారం చేయడానికి నిన్న పవన్ కల్యాణ్ రంగంలోకి దిగారు. జైత్రయాత్ర పేరిట జరిగిన ఈ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. దీంతో బీజేపీ–జనసేనలో ఫుల్ జోష్ వచ్చింది. అయితే.. ఈ సభలో పవన్ స్పీచ్ కంప్లీట్‌గా వైసీపీ నేతల గుండాయిజాన్ని టార్గెట్ చేస్తూనే మాట్లాడారు. వైసీపీ నేతల గుండాయిజానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రజలను కోరారు.
వైసీపీ ఎంపీ కాలం చేయడం వల్ల ఈ ఉప ఎన్నిక వచ్చిందని.. ముందుగా ఆయన మృతి పట్ల ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు పవన్. తమ పార్టీకి చెందిన దళిత ఎంపీ చనిపోయినా జగన్ ఆయనను పరామర్శించడానికి రాకపోవడం తెలిసిందే. రెండు వందల ఏళ్ల పాటు ఎంతో మంది కష్టపడి.. పోరాటం చేసి మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చారని, కానీ కొంతమంది నాయకులు మాత్రం ఈ స్వతంత్రం తమ అబ్బ సొత్తు అన్నట్లు ప్రవర్తిస్తున్నారని అంటూ ఉపన్యాసాన్ని పరుగులు పెట్టించారు పవన్ కళ్యాణ్.
పులివెందుల గొప్పదనం ప్రజలకు తెలియదని, 19వ శతాబ్దంలోనే పులివెందులలో సరస్వతీ నిలయం అనే లైబ్రరీ ఉండేదని, రాష్ట్రంలో ఎన్నో చోట్ల లైబ్రరీలు లేని సమయంలో నే అక్కడ లైబ్రరీ ఉండేదని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. కానీ.. ఇప్పుడు అదే పులివెందులను రౌడీల అడ్డాగా మార్చారని, పులివెందుల అనే పేరు ఫ్యాక్షన్ రాజకీయాలకు మారుపేరుగా నిలిపారని వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ సీపీ నేతలు మహిళలపై దాడులు చేస్తున్నారని , మానవ హక్కులకు భంగం కలిగిస్తున్నారని ఆరోపించారు. దీనికి తోడు ముస్లింలకు ఇవ్వాల్సిన ఈద్గా స్థలం విషయంలో ఇటీవల అనవసరమైన రాజకీయాలు చేసి, సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం వైసీపీ నేతలు చేశారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ప్రతి వైసీపీ ఎమ్మెల్యే ఓ గూండా లాగా మాట్లాడుతున్నాడని, బెదిరించడం గుండాయిజం చేయడం పరిపాటిగా మారిందని, వారి బెదిరింపులకు పవన్ కల్యాణ్ భయపడడు అని స్పష్టం చేశారు.
బ్రిటిష్ వారిని ఎదిరించిన ఈ నేలలో, రాయలవారు ఏలిన ఈ నేలలో, యువత వైసీపీ గుండాలకు భయపడవలసిన అవసరం లేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆరు నెలలపాటు కత్తిసాము కర్రసాము నేర్చుకున్న వ్యక్తి, 60 ఏళ్ల ముసలమ్మ మీద దాడి చేశాడట అన్న సామెత చెప్పినట్లు, 151 మంది ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలను గెలిపిస్తే, వైసీపీ నాయకులు ఆ బలాన్ని సామాన్యుల మీద ప్రయోగిస్తున్నారని, రేషన్ కార్డులు కట్ చేస్తామని ప్రజలను బెదిరిస్తున్నారని, తిరుపతి కొండపై ఒక కులస్తుల షాప్స్ తీసి వేస్తున్నారని, ఇదేం న్యాయమని పవన్ ప్రశ్నించారు.
ఇటీవల ముఖ్యమంత్రి చిన్నాన్న కూతురు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టిందని గుర్తు చేస్తూ, సొంత చిన్నాన్న హత్య కేసులో నిందితులని పట్టుకోలేని ముఖ్యమంత్రి, సామాన్యులకు ఏమాత్రం న్యాయం చేయగలరు అని పవన్ ప్రశ్నించారు. ఈ మాటలు తాను అన్నవి కాదని, వివేకానంద రెడ్డి కూతురు సునీత అన్న మాటలే అని గుర్తు చేశారు. దోషులు ఎవరో తెలిసి కూడా జగన్ ప్రభుత్వం వారిని పట్టుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రిపై కత్తి దాడి జరిగితే, దాన్ని ఎంతో రాజకీయం చేసిన జగన్ , ఎన్నికల తర్వాత ఆ కేసుని ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. ఈ సంఘటన జరిగి రెండు సంవత్సరాలు అయినప్పటికీ జగన్ ప్రభుత్వంలో ఆ కేసులో పురోగతి లేదంటే రాజకీయాలు ఎంత భ్రష్టు పట్టిపోయాయో అర్థం అవుతోందని చెప్పారు.
అనేక హిందూ దేవాలయాలపై దాడులు జరిగితే వారిని ఈ ప్రభుత్వం పట్టుకోలేక పోయింది పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ యథేచ్ఛగా జరుగుతోందని, ఇదివరకు ఎర్రచందనం స్మగ్లింగ్ కేవలం దుంగల్లో జరిగితే ఇప్పుడు నేరుగా లారీల్లోనే చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం స్మగ్లర్లకు అండగా నిలుస్తోందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో రేషన్ డోర్ డెలివరీ అవుతుందో లేదో తెలియదు కానీ ఎర్రచందనం మాత్రం చైనాకు డోర్ డెలివరీ అవుతోందని అన్నారు. వైసీపీ నేతలు కూల్చే ప్రతీ ఎర్రచందనం దుంగ, ఆ పార్టీ పతనానికి ఒక మెట్టు అవుతుందని వ్యాఖ్యానించారు. యువత ధైర్యంగా నిలబడాలని, జంకకుండా ఓటు వేయాలని, తిరుపతి ఉప ఎన్నికలో రత్నప్రభని గెలిపించాలని పిలుపునిచ్చారు.