Pawan Janavani: జనసేనాని పవన్ వినూత్న కార్యక్రమాలు ప్రజల్లోకి చొచ్చుకెళుతున్నాయి. పార్టీ ఆవిర్భవించి సుదీర్ఘకాలమే అయినా అధికారం కోసం కాకుండా ప్రజా సమస్యల పరిష్కార వేదికగా జనసేనను మలిచిన తీరు ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వెళుతోంది. వారి అభిమానాన్ని చూరగొంటోంది. సీపీఎస్ రద్దు, తమ సమస్యల పరిష్కారానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేసిన పోరాటానికి తొలిసారి మద్దతు తెలిపింది పవన్ కళ్యాణ్. అప్పటి నుంచే ఆ రెండు వర్గాల్లో ఆలోచన ప్రారంభమైంది. అంతవరకూ పవన్ పై ఉన్న అభిప్రాయం మారిపోయింది. జనసేన గురించి ఆలోచించడం సైతం మొదలు పెట్టారు. మరోవైపు కౌలు రైతు భరోసా యాత్రతో బాధిత కుటుంబాలకు సాయం చేస్తున్నారు. వారిలో భరోసా కల్పిస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వంలో కదలిక తీసుకొచ్చి కౌలురైతు కుటుంబాలకు న్యాయం జరిగేలా చూశారు.

జనసేన ఆవిర్భావం నుంచి పవన్ ప్రజా సమస్యలపైనే ద్రుష్టిసారించారు. అన్ని రాజకీయ పార్టీలు మాదిరిగా పార్టీ బలోపేతం, చేరికలను ప్రోత్సహించలేదు. అందుకే పార్టీకి అంతగా గుర్తింపు లభించింది. క్లీన్ ఇమేజ్ తో ముందుకు వెళ్లగలుగుతున్నారు. తాజాగా ప్రజాసమస్యల పరిష్కరానికి జనవాణి అనే కార్యక్రమాన్ని రూపొందించారు. వివిధ సమస్యలతో బాధపడేవారు నేరుగా అర్జీలు అందిస్తే వాటి పరిష్కార మార్గం చూపడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. ఆదివారం ప్రారంభించిన కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్య స్పందన లభించింది. ప్రధానంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దగాపడిన వికలాంగులు, మైనార్టీలు, దళితులు, నిమ్నవర్గాల నుంచి ఎక్కువ వినతులు వచ్చాయి. ప్రభుత్వంతో దెబ్బతిన్న అన్ని వర్గాలను జనవాణి వేదికపై తేవడంలో జనసేన శ్రేణులు సక్సెస్ అయ్యాయి. ఈ రెండేళ్ల పాటు వినతులపై పోరాటం చేసి ప్రజల అభిమానాన్ని చూరగొనడమే జనసేన ప్రధాన ఉద్దేశ్యంగా తెలుస్తోంది.
Also Read: Save AP: అదొక్కటే ఏపీని కాపాడగలదు: పవన్ కల్యాణ్
క్యూకట్టిన వికలాంగులు
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దగాపడ్డ తొలివర్గం వికలాంగులు. గత ప్రభుత్వం వికలాంగుల సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చేవి. రాయితీ పథకాలు అందించేవి. కానీ వైసీపీ ప్రభుత్వం అన్నింటినీ నవరత్నాలులోనే చూపెడుతోంది. వికలాంగుల సంక్షేమానికి ఖర్చు చేయాల్సిన నిధులను పక్కదారి పట్టించింది. గతంలో ఏడాది పొడవునా వికలాంగులకు రుణాలు, త్రిచక్ర వాహనాలు, రాయితీ పథకాలు అందించే వారు. కానీ ఈ ప్రభుత్వ హయాంలో మాత్రం వికలాంగుల సంక్షేమ శాఖ ఒకటి ఉందా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అందుకే జనసేన నిర్వహించిన జనవాణి కార్యక్రమానికి వికలాంగులు ఎక్కువగా హాజరయ్యారు. చాలామంది వేదిక పైకి వెళ్లలేక కిందే ఉండిపోయారు. వారి ఇబ్బందిని గమనించిన పవన్ కిందకు దిగి మరీ వినతులు స్వీకరించారు. వారి సమస్యలను సావదానంగా విన్నారు. ప్రభుత్వం మెడలు వంచైనా సమస్యలకు పరిష్కారమార్గం చూపిస్తానని హామీ ఇచ్చారు.
భారీగా హాజరైన మైనార్టీలు..
మరో ప్రభుత్వ బాధిత వర్గం మైనార్టీలు కూడా కార్యక్రమానికి భారీగా హాజరయ్యారు. కేంద్ర పెద్దలకు భయపడి తమకు గత ప్రభుత్వాలు కేటాయించిన పథకాలు, రాయితీలు నిలిపివేశారంటూ చాలామంది పవన్ కు ఫిర్యాదు చేశారు. పేద కుటుంబాల్లో పిల్లల వివాహాలకు అందిస్తున్న దుల్హన్ పథకాన్ని నిలిపివేశారని.. మైనార్టీ రుణాలు, నైపుణ్యాభివ్రుద్ధి శిక్షణ వంటివి లేకపోతున్నాయని పవన్ ద్రుష్టికి తీసుకొచ్చారు. దీనిపై పవన్ స్పందించారు. జనసేన ఏ వర్గాన్ని ఓటు బ్యాంకుగా చూడదన్నారు. మీ సమస్యలు నావంటూ భరోసా ఇచ్చారు. చీకట్లో ఉన్న వారిలో వెలుగులు నింపేందుకే జనసేన ఆవిర్భవించిందని గుర్తుచేశారు. సమస్యల పరిష్కారమే అజెండాగా జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని.. అందరికి అండగా ఉంటానన్నారు. దళితులు కూడా ఎక్కవ మంది కార్యక్రమానికి హాజరయ్యారు. గత ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావడానికి దళితుల ఓట్లే కారణం. పార్టీకి గుంపగుత్తిగా దళితుల ఓట్లు పడ్డాయి. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత వారి శాశ్వత సంక్షేమ పథకాలు, రాయితీ రుణాలను సైతం నిలిపివేశారని వారు పవన్ కు విన్నవించారు. అన్నింటీని సావదానంగా విన్న పవన్ తన వంతు ప్రయత్నం చేసి సమస్యలకు పరిష్కారమార్గం చూపుతానన్నారు.

తొలి అర్జీ ఆమె నుంచే..
తొలి అర్జీని సీఎం నివాసం భద్రత పేరిట తాడేపల్లిలో తొలగించిన ఇళ్లలో నివాసముండే వలంటీరును తీసుకున్నారు. ఇళ్లు ఖాళీ చేసే క్రమంలో వలంటీరు కుటుంబసభ్యులు అనుమానాస్పదంగా మరణించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ ఘటన సంచలనమైంది. బాధిత వలంటీరు కన్నీటి గాథను పవన్ తెలుసుకున్నారు. అయితే మొత్తం కార్యక్రమానికి ప్రభుత్వ బాధితులను తీసుకురావడంలో జనసేనాని సక్సెస్ అయ్యారు. కార్యక్రమంలో తొలిరోజే 427 దరఖాస్తులు వచ్చినట్టు జనసేన వర్గాలు తెలిపాయి. ఇదో నిరంతర ప్రక్రియ కావడం, గ్రీవెన్స్ సెల్ గా ప్రజలు భావిస్తున్న తరుణంలో అర్జీల సంఖ్య పెరిగే అవకాశముందని జనసేన నేతలు భావిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసేందుకు చేతిలో దండిగా పని దొరుకుతుందని జన సైనికులు సైతం ఉత్సాహం చూపుతున్నారు.
Also Read:Double engine: రాబోయేది ‘డబుల్ ఇంజిన్’ సర్కారే: మోదీ
[…] […]