
ప్రపంచ మంతా కరోనాతో పోరాడుతుంటే ఏపీలో మాత్రం రాజకీయాలు వెడేక్కిపోతున్నారు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న వైసీపీ బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. ఇటీవలే సీఎం జగన్మోహన్ మొదటి ఏడాది పాలన పూర్తయింది. ప్రజా సంక్షేమ పథకాలతో జగన్ సర్కార్ ప్రజల్లోకి తీసుకెళుతోంది. మరోవైపు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తమను ఇబ్బందులకు గురిచేసిన నేతలపై ఇప్పుడు జగన్ సర్కార్ తమ అస్త్రాలను వదులుతోంది. దీంతో ఏపీలో వైసీపీ వర్సస్ టీడీపీ రాజకీయాలు నడుస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇదిలా ఉంటే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ త్వరలోనే పాదయాత్ర చేయనున్నారనే వార్త ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
సుజనా చౌదరిని కలిసిన వారిలో వైసీపీ నేతలు?
2019ఎన్నికల తర్వాత జనసేన పార్టీ ఇంతకముందున్న దూకుడు తగ్గించినట్లు కన్పిస్తుంది. ఆ ఎన్నికల్లో జనసేన పార్టీ దారుణంగా ఓటమిపాలవడాన్ని పవన్ కల్యాణ్ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. 2014లో పవన్ కల్యాణ్ టీడీపీ-బీజేపీ కూటమికి గట్టి మద్దతు ఇచ్చారు. ఆయన మద్దతుతో ఆ కూటమి అధికారంలో వచ్చింది. టీడీపీ హయాంలోనూ పవన్ కల్యాణ్ జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేశారు. అయితే అనుహ్యంగా 2019లో పవన్ కల్యాణ్ టీడీపీ-బీజేపీ కూటమికి దూరంగా జరిగి వామపక్ష పార్టీలతో కలిసి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో జనసేన కూటమి కేవలం ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. అనంతరం జరిగిన పరిణాల నేపథ్యంలో పవన్ కల్యాణ్ కేంద్రంలో ఉన్న బీజేపీకి దగ్గరయ్యారు. ఈమేరకు ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని 2024 ఎన్నికలకు వెళ్లనున్నట్లు ప్రకటించారు.
ఇదిలా ఉంటే తనకు ఆర్థికంగా సమస్యలు ఉన్నాయంటూ ఇటీవల సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. వరుసగా మూడు సినిమాలకు కమిటయ్యారు. ఇప్పటికే దిల్ రాజు నిర్మాణంలో ‘వకీల్ సాబ్’ చిత్రం చివరిదశకు చేరుకుంది. లాక్డౌన్ కారణంగా ఈ చిత్రం నిలిచిపోయింది. అంతేకాకుండా క్రిష్, హరీష్ శంకర్ దర్శకత్వంలో మూవీ చేయనున్నాడు. ఈ మూడు చిత్రాల తర్వాత పవన్ తర్వాత పవన్ సినిమాలకు బ్రేక్ తీసుకుంటాడని ప్రచారం జరుగుతోంది. ఏపీ కరోనా విపత్కర పరిస్థితుల నుంచి కోలుకుగానే బీజేపీ డైరెక్షన్లో పవన్ పాదయాత్ర చేయనున్నారని ఏపీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బీజేపీ పక్కా స్కెచ్ రెడీ చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
2024లో జరిగే ఎన్నికలే టార్గెట్ గా బీజేపీ ఇప్పటి నుంచి పావులు కదిపేందుకు మొగ్గుచూపుతోంది. పవన్ కల్యాణ్ తో పాదయాత్ర చేయిస్తే అది బీజేపీ-జనసేన కూటమికి కలిసొస్తుందని బీజేపీ అధిష్టానం భావిస్తుంది. పవన్ పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తే ప్రజల్లోకి వెళితే పరిస్థితి అనుకూలంగా మారే అవకాశం ఉందని నేతలు భావిస్తున్నారు. కొంతకాలంగా పవన్ దూకుడు తగ్గించడంతో జనసేన కార్యకర్తలు కూడా కొంత నిరుత్సాహంతో ఉన్నారు. ఒకవేళ పవన్ పాదయాత్ర ద్వారా జనాల్లోకి వెళితే జనసేన కార్యకర్తల్లోనూ తిరిగి ఉత్సాహం నెలకొనే అవకాశం ఉంది.
పాదయాత్ర ద్వారా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టి ప్రజలకు చేరువ కావాలని బీజేపీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఈమేరకు పవన్ కల్యాణ్ కూడా పాదయాత్రకు సై అన్నట్లు సమాచారం. కేంద్రంలోని బీజేపీ ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళుతుందనే ప్రచారం నేపథ్యంలో పవన్ ను ముందస్తు పాదయాత్రకు సిద్ధం చేస్తుందని చర్చ నడుస్తోంది. పవన్ నిజంగా పాదయాత్ర చేపడితే మాత్రం ఏపీ రాజకీయాలు మరింత హీటెక్కడం ఖాయంగా కన్పిస్తుంది.. మున్ముందు ఏపీ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాల్సిందే..!