నిన్నటి నుండి రాష్ట్రంలో నడుస్తున్న హాట్ టాపిక్ మూడు రాజధానుల అంశం. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కీలకమైన పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను ఆమోదించడం జరిగింది. ఈ పరిణామాల తరువాత బాబు వేదన వర్ణనాతీతం. ప్రజల కలల రాజధాని అమరావతిని చంపేస్తున్నారని, రాష్ట్రంలోని ప్రజలందరూ ఏకమై దీనిని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. రాజధాని రైతులు సైతం ఈ విషయాన్ని ఖండించారు. భూములిచ్చి అన్నివిధాలుగా మోసపోయాం అని తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజల్లో ఎక్కడా దీనిపై పెద్ద చర్చ లేదని చెప్పాలి. అయ్యో అమరావతి అన్నవారు కానీ, భేష్ మూడు రాజధానులు అని మెచ్చుకున్నవారు కానీ లేరు. అంటే రాజధాని అంశం ప్రజల్లో పెద్ద సెంటిమెంట్ రాజేసేదిగా కనబడడం లేదు.
Also Read: అమరావతి కోసం చంద్రబాబు రాజీనామా?
టీడీపీ మీడియా ఎంత గగ్గోలు పెడుతున్నా ప్రజల్లో చెప్పుకోదగ్గ స్పందన రావడం లేదు. ఐతే భూములిచ్చిన రైతులు మాత్రం ఆవేదన చెందుతున్నారు. చివరి ఆశలు కూడా గల్లంతు అయ్యే సరికి జగన్ సర్కారుపై నిప్పులు కురిపిస్తున్నారు. మరో వైపు చంద్రబాబుని నమ్మి మోసపోయాం అనే ఆవేదన కూడా వారిలో ఉంది. గత ఐదేళ్లలో సంస్థాగతంగా అమరావతిని తీర్చిదిద్ది, మార్పుకు అవకాశం లేకుండా చేసి ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవి. ఏది ఏమైనా అమరావతి ప్రాంత ప్రజలకు గవర్నర్ నిర్ణయం గొడ్డలి పెట్టులా మారింది.
Also Read: బండి సంజయ్ కు మొట్టమొదటి పరీక్ష
ఐతే ఈ విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రేక్షక పాత్ర వహించడం ఆశ్చర్యం వేస్తుంది. పవన్ తీవ్రంగా వ్యతిరేకించిన మూడు రాజధానుల ప్రతిపాదనపై గవర్నర్ ఆమోదం తెలుపగా, ఆయన అసలు స్పందించలేదు. కనీసం ట్విట్టర్ లో నైనా స్వాగతిస్తున్నట్లు లేదా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పలేదు. పవన్ ఇది ఖచ్చితంగా మాట్లాడాల్సిన అంశమే. ఎందుకంటే రాజధాని రైతులలో ఆశలు నింపిన నేతలలో పవన్ కళ్యాణ్ ఒకరు. గతంలోనే చంద్రబాబు ల్యాండ్ పూలింగ్ కి వ్యతిరేకంగా రైతుల పక్షాన పవన్ నిలిచారు. వారిని కలిసి సంఘీభావం తెలిపారు. జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన చేసిన తరువాత కూడా పవన్ రైతుల పక్షాన పోరాడాడు. పలుమార్లు రాజధాని ప్రాంతాలలో పర్యటనలు చేసి వారి గళం గట్టిగా వినిపించాడు. అసలు జగన్ అమరావతిని ఎలా కదిలిస్తాడో అని సవాలు చేసిన పవన్ నేడు మౌనంగా ఉండడం విమర్శలకు దరి తీస్తుంది. పవన్ మౌనానికి కారణం బీజేపీతో పొత్తుపెట్టుకోవడమే. రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షులు సోము వీర్రాజు స్వయంగా బీజేపీకి మరియు కేంద్రానికి రాజధాని విషయంతో సంబంధం లేదని చెప్పాక, పవన్ మాట్లాడితే అది మిత్ర ధర్మాన్ని దెబ్బతీసినట్లు అవుతుంది. అందుకే పవన్ మౌనం వహించారు.