Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఫుల్ బిజీగా ఉన్నారు. జనసేన నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. కీలక చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమీపిస్తున్న వేళ ముందుగా జనసేన అంతర్గత విషయాలపై ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడ జనసేన బలంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానికి అనుగుణంగా తెలుగుదేశం పార్టీతో సీట్ల సర్దుబాటు చేసుకోవడానికి కసరత్తు చేస్తున్నారు. గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నేతలతో వరుసగా సమావేశం అవుతున్నారు. ముఖ్యంగా పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులను పిలిపించి మాట్లాడుతున్నారు. వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు.
ముఖ్యంగా జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాలు, పొత్తులో భాగంగా ఆశిస్తున్న స్థానాల్లో టిడిపి, జనసేన బలాబలాల పై కూడా పవన్ ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ చర్చలు మరో రెండు రోజులపాటు జరగనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉభయగోదావరి, విశాఖ, కృష్ణ, గుంటూరు, తిరుపతి, అనంతపురం జిల్లాల నేతలతో పవన్ కీలక చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. జిల్లాల్లో ఏయే నియోజకవర్గాల్లో జనసేనకు బలం ఉంది? అక్కడ టిడిపి పరిస్థితి ఏంటి? జనసేనకు టికెట్ ఇస్తే రెండు పార్టీలు సమన్వయం సాధించే అవకాశం ఉందా? నేతల పనితీరు ఎలా ఉంది? అన్న అంశాలను పవన్ ఆరా తీసినట్లు తెలుస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా 28 అసెంబ్లీ స్థానాలను పొత్తులో భాగంగా జనసేన కు తెలుగుదేశం పార్టీ ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో బలమైన నియోజకవర్గం ఎంపిక చేసే పనిలో పడ్డారు. దాదాపు అన్ని జిల్లాల్లో జనసేన ప్రాతినిధ్యం ఉండేలా చూసుకోవాలని భావిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి పదవిపై లోకేష్ చేసిన వ్యాఖ్యలపై సీనియర్ నాయకుడు హరి రామ జోగయ్య స్పందించిన సంగతి తెలిసిందే. అటు లోకేష్ తో పాటు ఇటు హరి రామ జోగయ్య కామెంట్స్ పై సైతం పవన్ చర్చించినట్లు సమాచారం. అయితే పొత్తుకు ఎటువంటి విఘాతం కలిగించకుండా.. జనసేన నేతలు సంయమనం పాటించాలని పవన్ సూచించినట్లు సమాచారం. ఈ కీలక భేటీలో జనసేన ఆశావాహులను సైతం గుర్తించినట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థులను ఎంపిక చేసి.. ఆ జాబితాను చంద్రబాబుకు అందించనున్నట్లు తెలుస్తోంది.