Pawan Kalyan: పవన్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. తనది వ్యక్తిగత ప్రయోజనం కాదని.. వ్యవస్థ ప్రయోజనం అని తేల్చి చెప్పారు. సొంత పార్టీ శ్రేణులకు గట్టి హెచ్చరికలు పంపారు.తన బలాన్ని, బలగాన్ని అంచనా వేసి.. అందుకు అనుగుణంగానే మాట్లాడారు.పార్టీ శ్రేణులకు చేయాల్సిన పనులను గుర్తు చేస్తూ.. పార్టీకి విఘాతం కలిగించే అంశాలను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. పార్టీ ఆవిర్భావం, తన లక్ష్యాలు, పార్టీ విధానాలు వంటి వాటిపై పూర్తి స్పష్టతతో మాట్లాడారు.
తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తును ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండు పార్టీల మధ్య సమన్వయం సైతం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో చాలాచోట్ల రగడ చోటు చేసుకుంది. ఇదే అదునుగా వైసిపి సోషల్ మీడియా రెచ్చిపోయింది. తెలుగుదేశం, జనసేన మధ్య అగాధం ఏర్పడేలా ప్రచారం ప్రారంభించింది. మధ్యలో కులాల ప్రస్తావన తీసుకొచ్చింది. దీంతో జనసేన నాయకత్వం అప్రమత్తమయ్యింది. పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే జనసేన లోని ప్రోవైసిపీ నేతలు నోరు మాత్రం అదుపులోకి రావడం లేదు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సీరియస్ గా మాట్లాడారు. కోట్ల మంది ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఈ పొత్తుకు తూట్లు పొడిస్తే జనసేనకో, పవన్ కళ్యాణ్ కు తూట్లు పొడిచినట్లు కాదని… ఏపీ ప్రజలకు తూట్లు పొడిచినట్లేనని పవన్ తేల్చి చెప్పడం విశేషం. అటువంటి చర్యలను తాను సమర్థించనని కూడా తేల్చి చెప్పారు. అవివేకం, అజ్ఞానంతో ఈ పొత్తు నిర్ణయం తీసుకోలేదన్న విషయాన్ని గ్రహించాలని గట్టిగానే చెప్పారు.
ఇదే సమావేశంలో పవన్ ప్రధాని మోదీ, బిజెపి అధ్యక్షుడు నడ్డా, అమిత్ షా, చంద్రబాబుల ప్రస్తావన తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నలుగురు నాయకులు అర్థం చేసుకున్న మాదిరిగా కూడా.. పార్టీ శ్రేణులు అర్థం చేసుకోవడం లేదని పవన్ ఆవేదన వ్యక్తం చేయడం విశేషం. నా నిర్ణయాలను వ్యతిరేకించేవారు వైసీపీలోకి వెళ్ళవచ్చు అని కూడా తేల్చి చెప్పారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టులు పెట్టవద్దని కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంలో మాట్లాడేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని మాట్లాడాలని సూచించారు. పొత్తు అంటే 70 శాతం అనుకూలమని.. 30% వ్యతిరేకం అనేది సాధారణమేనని పవన్ లైట్ తీసుకున్నారు.
కులాల మధ్య కుంపటి పెట్టి వైసిపి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని పవన్ అనుమానం వ్యక్తం చేశారు. తనపై ఒకే కుల ముద్ర వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని.. వైసీపీ ప్రయోగించే కులం ట్రాప్ లో పడవద్దు అని పార్టీ శ్రేణులకు సూచించారు. వైసిపి విముక్త ఏపీయే మన లక్ష్యం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఎన్నికల సంగ్రామానికి సిద్ధపడినట్లే. తన మనసులో ఉన్న మాటను పార్టీ శ్రేణులకు నిక్కచ్చిగా చెప్పారు. దాపరికం లేకుండా కొన్ని విషయాలపై స్పష్టతనిచ్చారు. దీంతో పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ఉత్సాహం కనిపిస్తోంది. పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయడంతో పాటు.. పార్టీలో క్రమశిక్షణ చర్యలు ఏ స్థాయిలో ఉంటాయో పవన్ సంకేతాలు ఇచ్చారు.