Pawan Kalyan : జనసేన ఉత్తరాంధ్రపై ఫోకస్ పెట్టింది. మూడు జిల్లాల్లో పార్టీ బలోపేతానికి యాక్షన్ ప్లాన్ రూపొందించింది. అందులో భాగంగానే పార్టీ కీలక నేతలు ఉత్తరాంధ్రకు క్యూకడుతున్నారు. మరోవైపు ఇక్కడ బలమైన సామాజికవర్గంగా ఉన్న తూర్పుకాపులతో పవన్ ఇప్పటికే సమావేశమయ్యారు. వారికి దిశా నిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో సామాజికవర్గం ఓట్లు చీలకుండా చూసుకోవాలని.. జనసేనకు సామూహికంగా మద్దతు తెలపాలని కోరారు. అటు నాదేండ్ల మనోహర్ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో పర్యటించి పార్టీ శ్రేణులను సమన్వయపరుస్తున్నారు. తటస్థులు, మేధావులను కలిసి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. కవులు, కళాకారులు, సామాజికవేత్తలను కలిసి మద్దతు కోరారు. అటు ఉత్తరాంధ్రలో 400 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. లక్షలాది మత్స్యకార కుటుంబాలున్నాయి. వారిపై కూడా జనసేన ప్రత్యేకంగా ఫోకస్ పెంచింది. వారి సమస్యలపైనా అధ్యయనం చేసి ఒక నివేదిక సిద్ధం చేసే పనిలో ఉంది. అలాగే ఎస్టీ రిజర్వేషన్ నియోజకవర్గాలపై కూడా దృష్టిపెట్టింది. అక్కడ గిరిసేన కార్యవర్గాలను రూపొందించి గిరిజనులను ఆకట్టుకునే ప్రయత్నాలను మొదలు పెట్టింది.

ఉత్తరాంధ్రలో జనసేనకు ప్రత్యేక ఓటు బ్యాంక్ ఉంది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో చెప్పుకోదగ్గ ఓటు షేర్ ను ఆ పార్టీ సొంతం చేసుకుంది. దీనిని మరింత పెంచుకునేందుకు ఆ పార్టీ పావులు కదుపుతోంది. అందులో భాగంగానే జనవరి 12న పవన్ ఉత్తరాంధ్రలో పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. జనవరి 12న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువభేరీ నిర్వహించనున్నారు. ఉత్తరాంధ్రకు తటస్థ వేదికగా నిలిచే రణస్థలం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఉంది. విజయనగరం పార్లమెంటరీ పరిధిలోకి రణస్థలం వస్తోంది. అందుకే అక్కడ యువభేరీకి పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. ప్రధానంగా యువతను టార్గెట్ చేస్తూ యూత్ ఫెస్టివల్ ను నిర్వహించనుంది. యువ కవులు, కళాకారులు, సామాజికవేత్తలు, వివిధ రంగాల్లో నైపుణ్యం కనబరిచిన వారిని ఒక వేదికపైకి తేవడానికి ప్రయత్నంలో భాగంగానే యువభేరీ నిర్వహిస్తున్నట్టు పార్టీ కీలక నేత నాదేండ్ల మనోహర్ ప్రకటించారు.
పవన్ ఉత్తరాంధ్ర విషయంలో ప్రత్యేక అజెండాతో ముందుకెళుతున్నారు. తీర ప్రాంతం, మైదానం, ఏజెన్సీల సమాహారం ఉత్తరాంధ్ర. అందుకే అటు మత్స్యకారులు, ఇటు ఇతర సంప్రదాయ సామాజికవర్గాలు, గిరిజనులను టార్గెట్ చేసుకుంటున్నారు. ముందుగా గిరిజన ఓటు బ్యాంక్ ను జనసేన వైపు మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ భద్రాద్రి జిల్లా నుంచి పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ వరకూ ఏజెన్సీ విస్తరించి ఉంది. ఏజెన్సీ పొడవునా ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలే ఉన్నాయి. కాంగ్రెస్ హయాంలో ఆ పార్టీకి ఏకపక్షంగా గిరిజనులు మద్దతు పలికేవారు. టీడీపీ ఆవిర్భావం తరువాత ఆ పార్టీ సంచలన విజయాలు నమోదుచేసుకున్నా ఏజెన్సీలో మాత్రం ప్రభావం చూపలేకపోయింది. వైసీపీ ఆవిర్భావం తరువాత ఆ పార్టీకి గిరిజనులు వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు. గత ఎన్నికల్లో సంపూర్ణ విజయం అందించారు. కానీ జగన్ సర్కారు గిరిజనుల కోసం ఎటువంటి పథకాలు ప్రవేశపెట్టలేదు. గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయలేదు. అటు పేరుకే అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కానీ.. అటు పార్టీలో, ప్రభుత్వంలో ఏమంతా క్రియాశీలకంగా లేరు. ప్రస్తుతం గిరిజనులు వైసీపీ సర్కారుకు వ్యతిరేకంగా ఉన్నారు.. అలాగని విపక్షం టీడీపీకి సానుకూలంగా లేరు. అందుకే ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు జనసేన పావులు కదుపుతోంది. ఏకంగా గిరిజనసేన విభాగాన్ని ఏర్పాటుచేయడానికి పవన్ సిద్ధపడుతున్నారు.
ఉత్తరాంధ్రలో 33 నియోజకవర్గాలున్నాయి. వీటిలో మత్స్యకారులు ప్రబాల్యమున్న నియోజకవర్గాలు దాదాపు సగానికిపైగా ఉన్నాయి. గత ఎన్నికల్లో మత్స్యకార సామాజికవర్గంలో జనసేన గౌరవప్రదమైన ఓటు షేరింగ్ పొందగలిగింది. గత మూడున్నరేళ్లుగా మత్స్యకారుల సంక్షేమాన్ని వైసీపీ సర్కారు గాలికొదిలేసింది. అందుకే గట్టిగా ప్రయత్నిస్తే మత్స్యకారులు యూటర్న్ తీసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ జనవరి 12 న యువభేరీ వేదికగా గిరిజనులు, మత్స్యకారుల సంక్షేమానికి జనసేన తీసుకునే నిర్ణయాలు వెల్లడించే అవకాశం ఉంది. మొత్తానికైతే ఉత్తరాంధ్రలో జనసేన పట్టుబిగించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఈ పరిణామాలు అటు అధికార పక్షం వైసీపీకి, ఇటు ప్రధాన విపక్షం టీడీపీకి కలవరపాటుకు గురిచేస్తున్నాయి.