Jagan YCP MLAs: ఏపీలో తన పరపతి తగ్గిపోవడానికి ఎమ్మెల్యేలే కారణమని జగన్ భావిస్తున్నారా? వారు బాగా పనిచేయకపోవడం వల్లే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ఆగ్రహంగా ఉన్నారా? సొంత పార్టీ శాసనసభ్యులను వర్గ శత్రువులుగా చూస్తున్నారా? ప్రజాప్రతినిధుల కంటే ఐ ప్యాక్ బృందంలోని వంద మంది మాటకే విలువనిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలన్నింటికీ బలం చేకూరుస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కనీసం 50 మంది సిట్టింగ్ లను పక్కన పెడతారన్న ప్రచారం.. అధికార పార్టీలో కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ నెల 14న పార్టీ ఎమ్మెల్యేలు,మంత్రులతో జగన్ సమావేశమవుతారు. ఆ 50 మంది లిస్టును చదువుతారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేలపై ప్రతిసారి కారాలు, మిరియాలు నూరుతూ వస్తున్న జగన్.. ఈసారి గట్టి హెచ్చరికలు పంపే చాన్స్ ఉందన్న టాక్ నడుస్తోంది.

అయితే పార్టీ వర్గాలకు మాత్రం జగన్ వ్యవహార శైలి మింగుడుపడడం లేదు. దీనికి అనేక కారణాలను వారు విశ్లేషిస్తున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను జగన్ ఎప్పుడూ అభిమానంగా చూడలేదు. వర్గ శత్రువులుగానే ట్రీట్ చేస్తూ వచ్చారు. కనీస విధులు, నిధులు లేకుండా చేశారు. పాలనలో సైతం వారి పాత్రను, నిడివిని పూర్తిగా నిర్వీర్యం చేశారు. చివరకు వృద్ధాప్య పింఛన్ అందించే బాధ్యత వలంటీరుకు అప్పగించి ఏ పనీ లేకుండా చేశారు. నవరత్నాలతో తన వద్ద మాత్రమే పని ఉంచుకొని ఎమ్మెల్యేలను నిమిత్తమాత్రులుగా చేశారు. ఇప్పుడు అదే ఎమ్మెల్యేల వల్లే తన పరపతి తగ్గిపోయిందని జగన్ బాధపడుతున్నారు. ప్రభుత్వం, పార్టీ నిర్ధేశించిన కార్యక్రమాలు సవ్యంగా చేయకపోవడం వల్లే ప్రజల నుంచి వ్యతిరేకత ప్రారంభమైందని ఎమ్మెల్యేలను బాధ్యులు చేస్తున్నారు.
గత ఉగాది నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేలతో సమావేశమైన జగన్ చాలా అవమానకరంగా మాట్లాడారు. క్లాస్ రూమ్ లో స్టూడెంట్స్ మాదిరిగా పేర్లు చదివి మరీ మీరు వెనుకబడి ఉన్నారని ప్రకటించారు. పనితీరు మార్చుకోవాలని.. గడపగడపకూ వెళ్లాలని నిర్దేశించారు. అయినా ఎమ్మెల్యేలు మారు మాట్లాడలేని దుస్థితి. ఇటువంటి తరుణంలో ఈ నెల 14న మరోసారి సమావేశమవుతుండడంతో గతసారి వెనుకబడిన జాబితాలో ఉన్న ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అయితే ఇప్పటికే 50 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని.. వారికి జగన్ షాక్ ఇవ్వబోతున్నారని మీడియాకు లీకులిచ్చారు. దీంతో ఎమ్మెల్యేల్లో ఒకరకమైన అభద్రతా భావం నెలకొంది.
గత ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. వారంతా నా ప్రభంజనంతో మాత్రమే గెలుపొందారని.. నన్ను చూసి వారికి ఓటు వేశారని జగన్ భావిస్తున్నారు. అందుకే ఎమ్మెల్యేలను నమ్మడం లేదు.,. విలువ ఇవ్వడం లేదు. తనకున్న 151 మంది ఎమ్మెల్యేల కంటే ఐ ప్యాక్ బ`ందంలోని 100 మంది సభ్యులనే జగన్ ఎక్కువగా నమ్ముతున్నారు. వారే తనను గెలిపిస్తారని భావిస్తున్నారు. వారు చెప్పినట్టే నడుచుకుంటున్నారు. వారి సమావేశానికి ఎవర్ని పిలవమంటే వారినే పిలుస్తున్నారు. మొత్తానికైతే జగన్ 50 మంది ఎమ్మెల్యేలకు ఝలక్ ఇవ్వనున్నారని తెలియడం పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.