Pawan Kalyan- Munugode By Election: మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు అన్ని పార్టీలకు ప్రతిష్ఠాత్మకమే. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గామార్చి దేశాన్ని ఏలాలని కలలు గంటున్న కేసీఆర్ కు… తెలంగాణలో పాగా వేయాలనుకుంటున్న బీజేపీకి… తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా.. పుట్టెడు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి …ఇలా అన్ని పార్టీలకు ఈ ఉప ఎన్నికలు చావో రేవోలాంటివి. అయితే గెలుపునకు ఏ చిన్న అవకాశాన్ని పార్టీలు జారవిడుచుకునే పొజిషన్లో లేవు. ఇప్పటికే బీఆర్ఎస్ తన మందీ మార్భలాన్ని మునుగోడులో మోహరించింది. గ్రామాలు, వార్డులను యూనిట్ గా తీసుకొని బీఆర్ఎస్ కీలక నేతలకు బాధ్యతలు అప్పగించింది. అటు బీజేపీ కూడా సర్వశక్తులను ఒడ్డుతోంది. ఇప్పటికే ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ శ్రేణులు పది వేల మంది మునుగోడులో ఎంటరయ్యారు. జాతీయ అగ్రనేతలు సైతం మునుగోడులో ప్రచారం చేయనున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ కూడా పట్టుబిగుస్తోంది. సిట్టింగ్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. రాహూల్ జోడో యాత్రను ప్రచారానికి వినియోగించుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. అటు తెలుగుదేశం పార్టీ కూడా కేండిడేట్ ను నిలబెట్టేందుకు నిర్ణయించింది. కానీ దీనిపై స్ఫష్టత లేదు.

అయితే తెలంగాణలో పార్టీలు శక్తియుక్తులు చాలవన్నట్టు ఇప్పుడు ఇతర పార్టీల నేతలపై ఆధారపడుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నట్టు ప్రచారం గుప్పుమంటోంది. అయితే ఆయన ఏ పార్టీకి ప్రచారం చేస్తారన్నదానిపై స్పష్టత లేదు. తెలుగు నాట రాజకీయాలకతీతంగా పవన్ అభిమానులు ఉన్నారు. అటు మెగా ఫ్యాన్స్ కూడా గణనీయంగా ఉన్నారు. గెలుపోటములను డిసైడ్ చేసే సంఖ్యలో వీరు ఉండడంతో పవన్ కోసం అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం పవన్ జనసేన ఏపీలో మాత్రమే యాక్టివ్ గా ఉంది. తెలంగాణలో మాత్రం పార్టీ అభిమానులున్నా ఏపీతో పోల్చుకుంటే మాత్రం కార్యక్రమాల నిర్వహణ అంతంతమాత్రమే.
ప్రస్తుతం ఏపీలో బీజేపీతో మిత్రపక్షంగా జనసేన కొనసాగుతోంది. గత ఎన్నికల్లో ఓటమి తరువాత బీజేపీతో పవన్ జత కట్టారు. ఐక్యతగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. అయితే తొలినాళ్లలో ఇరు పార్టీల మధ్య మంచి సంబంధాలే ఉన్నా తరువాత బెడిసికొట్టాయి. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నిరసన కార్యక్రమాల్లో కూడా ఆ రెండు పార్టీలు వేర్వేరుగానే కొనసాగాయి. అటు తిరుపతి, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీచేయగా.. జనసేన విరుద్ధంగా స్పందించింది. తిరుపతిలో సపోర్టు చేయగా.. ఆత్మకూరులో మాత్రం నూట్రల్ గా ఉండిపోయింది. అయితే మిత్రపక్షంగా ఉన్నా పవన్ ఉప ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు మునుగోడులో కూడా పవన్ ప్రచారానికి వచ్చే చాన్సే లేదని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అయితే ఏపీలో పరిస్థితి వేరు.. తెలంగాణలో వేరు. మునుగోడులో పోరు హోరాహోరీగా ఉన్న నేపథ్యంలో పవన్ ప్రచారం చేస్తే అడ్వాంటేజ్ గా ఉంటుందని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. కానీ పవన్ మనసులో ఏముందో తెలియదు.

అటు టీఆర్ఎస్ తో కూడా పవన్ కు మంచి సంబంధాలే ఉన్నాయి. టీఆర్ఎస్ గవర్నమెంట్ చేపట్టిన చాలా కార్యక్రమాలను పవన్ మెచ్చుకుంటూ వచ్చారు. అటు కేటీఆర్ తో కూడా పవన్ మంచి సంబంధాలే కొనసాగిస్తున్నారు. పవన్ లాంటి నాయకుడు ఏపీకి అవసరమని కూడా కేటీఆర్ చెప్పుకొచ్చిన సందర్భాలున్నాయి. అయితే కేటీఆర్ మునుగోడు ప్రచారానికి పవన్ ను పిలిచే ధైర్యం మాత్రం చేయలేరు. ఎందుకంటే ఏపీలో పవన్ బీజేపీతో కలిసి నడుస్తున్నారు. అయితే బీజేపీకి మద్దతుగా ప్రచారం చేయకుండా రావడానికి కొంత కట్టడి అయితే చేయవచ్చు. అయితే ఎట్టి పరిస్థితుల్లో పవన్ మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వచ్చే చాన్సే లేదని జనసేన వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ అగ్రనేతలు మాత్రంతమ పార్టీ తరుపున వపన్ ప్రచారానికి వస్తారని నమ్మకంగా అయితే ఉన్నారు. అదే విషయాన్ని అంతర్గత సమావేశాల్లో చెబుతున్నారు.