Pawan Kalyan: ఏపీలో పొత్తులపై ఫుల్ క్లారిటీ వస్తోంది. తెలుగుదేశం పార్టీతో కలిసి నడుస్తామని పవన్ ప్రకటించారు. బిజెపి కలిసి వస్తే కలుపు కెళ్తామని చెప్పుకొచ్చారు. అటు బిజెపి లేని టిడిపి, జనసేన కూటమితో తాము కలిసి వస్తామని వామపక్షాలు చెబుతున్నాయి. అటు బిజెపి పవన్ తీరును నిశితంగా గమనిస్తోంది. ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉండి టిడిపి తో పొత్తు ప్రకటన చేయడంపై అగ్ర నాయకత్వం ఆరా తీస్తోంది. ఇటువంటి తరుణంలో బిజెపి ఎటువంటి స్టాండ్ తీసుకుంటుందో చూడాలి.
తాజాగా పవన్ వారాహి యాత్రలో ఫుల్ క్లారిటీతో మాట్లాడారు. వచ్చేది జనసేన, టిడిపి ప్రభుత్వమేనని తేల్చి చెప్పారు. మొన్నటి వరకు ఎన్డీఏ ప్రభుత్వం అంటూ సంభోదించారు. ఇప్పుడు మాత్రం రెండు పార్టీల కూటమిని మాత్రమే ప్రస్తావిస్తున్నారు. బిజెపితో వెళ్లడం వల్ల ఓట్లు వచ్చినా.. ఎంతమంది అసెంబ్లీకి వెళ్ళగలమని ప్రశ్నించడం ద్వారా పవన్ డిఫెన్స్ లో పడేశారు. ఏపీలో బలం పెంచుకునేందుకే బిజెపి పవన్ తో స్నేహం చేసింది. ఎన్డీఏలో చేర్చుకొని ఇటీవల ప్రత్యేక ఆహ్వానాన్ని పవన్ కు పంపించింది. కానీ ఆ స్థాయిలో పవన్ తో కలిసి పనిచేసిన సందర్భాలు లేవు. అటు పవన్ తెలుగుదేశం పార్టీతో దగ్గరవుతున్నా.. తాము మాత్రం జనసేనతోనే కొనసాగుతామని బిజెపి చెప్పుకొచ్చింది. చంద్రబాబు అరెస్టు తర్వాత సీన్ మారింది. పొత్తు ప్రకటన చేసి.. ఢిల్లీ వెళ్లి బిజెపి అగ్ర నేతలను కలుస్తానని పవన్ చెప్పుకొచ్చారు. కానీ తాజాగా వారాహి యాత్రలో బిజెపి ప్రస్తావన తీసుకురావడం లేదు. తమ రెండు పార్టీలు మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని పవన్ ప్రకటించడంతో.. బిజెపి మాట ఏమిటని ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
పవన్ బిజెపి అగ్రనేతలను ఆశ్రయించారా? వారి నుంచి ఆశించినంత సానుకూలత రాలేదా? అందుకే వారాహి యాత్రలో రూటు మార్చారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ మధ్యన ఢిల్లీ వెళ్లి చంద్రబాబు అమిత్ షాను కలిశారు. కానీ పొత్తుల ప్రతిపాదన ఏదీ కార్యరూపం దాల్చలేదు. అటు తరువాత చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. బిజెపి అగ్ర నేతల నుంచి ఉలుకూ పలుకూ లేదు. బిజెపి అగ్రనేతల అనుమతితోనే జగన్ చంద్రబాబును అరెస్టు చేయించారన్న ప్రచారం ఉంది. వామపక్షాల నేతల సైతం ఇదే అనుమానం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. బిజెపిని వదులుకుంటే తాము కూటమిలోకి చేరుతామని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వామపక్షాలు సాయం చేయడం వల్లే టిడిపి రెండు స్థానాలను కైవసం చేసుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఒకవేళ బిజెపి నుంచి సానుకూలత రాకపోతే.. వామపక్షాలు జనసేన, టిడిపి కూటమిల వైపు చూసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
బిజెపి అగ్ర నేతలు ఎటూ తేల్చకపోవడంతో ఏపీ నాయకులు ఆందోళనతో ఉన్నారు. ఒకవైపు ఎన్డీఏలో ఉంటూ పవన్ టిడిపి తో పొత్తు ప్రకటన చేశారు. అటు బిజెపి అగ్ర నేతలు నోరు మెదపడం లేదు. జనసేన, టిడిపి లతో కలిసి నడుద్దామా? లేకుంటే ఒంటరిగా పోదామా? అన్నదానిపై క్లారిటీ ఇవ్వడం లేదు. అటు ఏపీ బీజేపీలో సైతం ఒంటరి పోరుకు కొందరు మొగ్గు చూపుతున్నారు. మెజారిటీ క్యాడర్ మాత్రం పొత్తును కోరుకుంటోంది. కానీ బిజెపి అగ్రనాయకత్వం నుంచి ఎటువంటి స్పష్టత లేదు. దీంతో పొత్తులపై అనిశ్చితి కొనసాగుతోంది.