Pawan Kalyan: పవన్ తాజా ప్రకటనలతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. జనసేన, టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వైసీపీ నేతల అవినీతిపై విచారణ ప్రారంభిస్తామని పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పవన్ వ్యూహాత్మకంగా విద్యాశాఖ పైనే ఫోకస్ పెడతామని చెప్పడం విశేషం. సంక్షేమ పథకాల మాటున వైసీపీ నేతలు లూటీ చేశారని పవన్ ఆరోపించారు. అమెరికా వెళ్లే పిల్లలకు టోఫెల్ కావాలని.. 3,5 తరగతులకు ఎందుకని పవన్ ప్రశ్నించారు. ఆంగ్లంలో బాగా మాట్లాడేందుకు వేల కోట్ల రూపాయల ఖర్చా అని నిలదీశారు. మీకు అసలు ఇంగ్లీషులో మాట్లాడడమే రాదు.. కానీ పదవులు వచ్చాయి కదా అని ఎద్దేవా చేశారు. విద్యా సంక్షేమ పథకాల మాటున వేలకోట్ల రూపాయలు పక్కదారి పట్టించారని పవన్ సరికొత్త ఆరోపణలు చేయడం విశేషం.
వైసీపీ సర్కార్ హయాంలో విద్యావ్యవస్థను పూర్తిగా దుర్వినియోగం చేశారని పవన్ భావిస్తున్నారు. గతంలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడితే విమర్శించిన వారే.. ఇప్పుడు అదే ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ పెట్టలేదా అని పవన్ ప్రశ్నించారు. అమెరికాలో యూనివర్సిటీలకు వెళ్లే విద్యార్థులకు టోఫెల్ టెస్ట్ అవసరం. కానీ ఏపీలో 3, 5వ తరగతి పిల్లలకు ఈ టెస్ట్ పెట్టడం వెనుక ఏదో జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ స్కాం అన్న రీతిలో పవన్ స్పందించడం విశేషం.
ఇప్పటికే బై జూస్ వంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. బైజుస్ కంటెంట్ ద్వారా ఆన్లైన్ విద్యాబోధన చేస్తున్నట్లు చెబుతోంది. అందులో భాగంగా ట్యాబ్ లను పంపిణీ చేసింది. కానీ ఎక్కడా ఈ ట్యాబుల వినియోగం కనిపించడం లేదు. ఆరేడు వేలకు లభించే ఈ ట్యాబులను 13 వేలకు పైగా డ్రా చేశారన్న అనుమానాలు ఉన్నాయి. అటు ప్రభుత్వం ప్రతి విద్యార్థికి అందిస్తున్న అమ్మ ఒడిలో సైతం భారీగా కోత విధిస్తోంది. ప్రతి విద్యార్థి దగ్గర రెండు వేల రూపాయల చొప్పున కోత చేస్తోంది. వాటిని పాఠశాల అవసరాల కోసం వినియోగిస్తున్నట్లు చెబుతోంది. కానీ ఆ నగదు పాఠశాలలకు సామాగ్రిని అందించే అస్మదీయ కంపెనీలకు వైసీపీ సర్కార్ మళ్లిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
విద్యావ్యవస్థలో ప్రవేశపెట్టిన పథకాలతో ప్రజలకంటే వైసిపి నేతలకే లాభం ఎక్కువ. పేరుకే సంక్షేమ పథకాలు కానీ.. అవి వైసిపి నేతల జేబులు నింపుతున్నాయని విమర్శలు ఉన్నాయి. బ్యాగులు, బూట్లు, పాఠశాల ఫర్నిచర్.. ఇలా అన్ని వస్తువుల సరఫరా బాధ్యతను వైసీపీ నేతల కంపెనీలకే అప్పగిస్తున్నారు. దీంతో ఈ పథకాల ద్వారా ఎక్కువగా లబ్ధి పొందింది వారే. ఇప్పుడు పవన్ సైతం ఆ రకం అనుమానాలతో వైసీపీ నేతల అవినీతిని హెచ్చరిస్తుండడం విశేషం. సాధారణంగా పవన్ వ్యక్తిగత విమర్శలు చేయరు. అటు విధానపరమైన విమర్శల్లో సైతం స్పష్టత ఉంటుంది. విద్యా వ్యవస్థలో లోపాలు, అవినీతిని గుర్తించే పవన్ ఈ రకమైన విమర్శలు చేసి ఉంటారని విశ్లేషణలు వెలువడుతున్నాయి.