– అడుగుకో గుంత… గజానికో గొయ్యి
•వైసీపీ పాలనలో ఏపీ రహదారుల దుస్థితి
•రోడ్డు బాగు చేయమంటే వేధింపులు… లాఠీ ఛార్జీలు… అరెస్టులు
•పాడైన రోడ్లను #JSPForAP_Roads హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో చూపిద్దాం
•ప్రభుత్వం స్పందించని పక్షంలో గాంధీ జయంతి రోజున శ్రమదానంతో రోడ్లను బాగు చేద్దాం
ఆంధ్రపదేశ్ రాష్ట్రంలోని రహదారుల దుస్థితిని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కళ్లకు కట్టారు. వైసీపీ పాలకుల తీరుపై కడిగిపారేశారు. నిలదీసిన వారిని వేధిస్తారా? అని విమర్శించారు. ఏపీ రోడ్ల దుస్థితిపై పోరుబాట పట్టారు. తాజాగా ఒక వీడియోను విడుదల చేసిన పవన్ ఏపీలోని పరిస్థితులు మారకపోతే శ్రమదానం చేసి రోడ్లను బాగు చేసి ప్రభుత్వానికి బుద్దిచెబుతామని హెచ్చరించారు.
ఒక దేశం కానీ, రాష్ట్రం కానీ, ప్రాంతం కానీ అభివృద్ధి చెందాలంటే అక్కడ రహదారుల వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండాలని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీలో రోడ్ల దుస్థితిపై పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ మాటల్లోనే .. ‘‘నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం వేల కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మిస్తూ, రోడ్ల వ్యవస్థను పటిష్టం చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే.. వైసీపీ పాలనలో ఏపీ రోడ్ల వ్యవస్థ అడుగుకో గుంత… గజానికో గొయ్యిలా ఉంది. ఇవి సరదాకు చేస్తున్న రాజకీయ విమర్శలు కాదు. నివర్ తుపాన్ సమయంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పర్యటించినప్పుడు ప్రత్యక్షంగా దెబ్బ తిన్న రోడ్లను చూశాను. ఆ పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం తిప్పవరపుపాడు గ్రామానికి వెళ్లే దారిలో దాదాపు ఏడెనిమిది కిలోమీటర్ల మేర రోడ్డు చిధ్రమైంది. నిలువెత్తు గోతులతో ఉంది. వెళ్లేదారిలో గుంతలోపడి ఒక ట్రాక్టర్ తిరగబడిపోయింది. ఆ ప్రాంత యువకులతో మాట్లాడితే మా ఊరే కాదు నియోజకవర్గం మొత్తం రోడ్లు ఇలానే ఉన్నాయని చెప్పారు. ట్రాక్టరే కాదు గర్భిణి స్ర్తీ వెళ్లే ఆటో కూడా తిరగబడిపోయిందని చెప్పారు. ప్రజాప్రతినిధులకు చెప్పినా ఏమీ బాగుపడలేదు అని’’ పవన్ ఆవేదన చెందారు.
రోడ్ల గురించి అడిగితే బెదిరింపులకు దిగుతున్నారని పవన్ మండిపడ్డారు. పోలీసులతో లాఠీ ఛార్జీలు చేయించే పరిస్థితులు ఉన్నాయి. ఒక్క నెల్లూరు జిల్లానే కాదు పామర్రు, గుడివాడ వెళ్లినప్పుడు కూడా ఇదే పరిస్థితి కనిపించింది. భీమవరం నుంచి తాడేపల్లిగూడెం వెళ్లే ఆర్ అండ్ బీ రోడ్డు గానీ, అనంతపురం నుంచి తాడిప్రతి వెళ్లే రోడ్డు… ఏ రోడ్డు తీసుకున్న చాలా అధ్వాన్నంగా తయారయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో దాదాపు లక్షా 20వేల కిలోమీటర్లకు పైగా రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లు దెబ్బ తిన్నా బాగు చేయడం లేదన్నారు.
•రోడ్డు గురించి అడిగితే వేధించి ఆత్మహత్యకు ప్రేరేపించారు
రోడ్ల గురించి అడిగితే వేధిస్తారా? అని పవన్ ప్రశ్నించారు. ‘రోడ్ల దుస్థితిపై పార్టీ పి.ఎ.సి. మీటింగులో చర్చించాం. చాలా మంది నాయకులతో మాట్లాడాను. కరోనా వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయేమో… ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామని అనుకున్నాం. చేసిన తప్పులను కరెక్టు చేసుకుంటారు, రోడ్లు వేస్తారేమోనని ఇంతకాలం ఎదురుచూశాం. అయితే పరిస్థితి రానురాను దిగజారిపోతుంది. నోరు తెరచి మాట్లాడినా వారిపై ప్రజాప్రతినిధులు పోలీసుల సాయంతో కేసులు పెట్టించే పరిస్థితి. రోడ్లు బాగోలేదు మీరు ఏదైనా చేయండి అని స్థానిక ప్రజాప్రతినిధిని అడిగినందుకు గిద్దలూరు నియోజకవర్గంలో వెంగయ్యనాయుడు అనే జనసైనికుడు ఆత్మహత్యకు పాల్పడేలా వేధించారు. ఉంగుటూరు నియోజకవర్గంలో నిడమర్రు మండలం అడవికొలను అనే గ్రామంలో రోడ్లు బాగోలేదని జనసైనికులు, ఆ ఊరివాళ్లు నిరసనతో పాదయాత్ర చేపడితే పోలీసులతో లాఠీచార్జి చేయించారు. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయన్నందుకే లాఠీచార్జ్ చేయడం, అక్రమకేసులు పెట్టడం చూసి బలంగా గొంతు వినిపించాలని నిర్ణయం తీసుకున్నాం. ’’ అని పవన్ సంచలన ప్రకటన చేశారు.
•రాష్ట్ర రోడ్లను అందరికీ తెలియచేద్దాం
గుంతలు పడ్డ రోడ్ల మీద ప్రయాణం చేసి రోజు చాలా మంది యాక్సిడెంట్లకు గురవుతున్నారని పవన్ అన్నారు.. ‘‘పిల్లలు, మహిళలు, వృద్ధులు గాయాలపాలై ఆస్పత్రిలో చేరుతున్నారు. మరికొంతమంది చావు దగ్గర వరకు వెళ్లి తిరిగొస్తున్నారు. ఇవన్ని చూసి ఆవేదన కలిగింది. రోడ్ల అధ్వాన్న పరిస్థితిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి తద్వారా ప్రభుత్వం నుంచి స్పందన తీసుకురావాలనే ఉద్దేశంతో సెప్టెంబర్ 2,3,4 తేదీల్లో రోడ్ల దుస్థితిపై #JSPFORAP_ROADS ద్వారా ప్రతి ఒక్క జనసైనికుడు, వీరమహిళ, ఊరు బాగుకోరే ప్రతి ఒక్కరు పాడైన రోడ్ల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయండి. వీటిని చూసైనా ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబర్ 2వ తేదీన మన రోడ్లను మనమే శ్రమదానం చేసి బాగు చేసుకుందాం. రోడ్లను బాగు చేసే శ్రమదానం కార్యక్రమంలో నేను కూడా భాగస్వామిని అవుతాను.’’ అని జనసైనికులకు పిలుపునిచ్చాడు.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Pawan kalyan fires on dilapidated ap roads under ycp rule
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com