
2020 ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల నామినేషన్ లలో నెలకొన్న హింస, దౌర్జన్యాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. అభ్యర్థులతో నామినేషన్లు దాఖలు చేయించే సమయంలో దాడులు చేయడం, వాటిని ఎదుర్కొని నామినేషన్ ఇచ్చినా బలవంతంగా ఉపసంహరింప చేయడం వంటి కుట్ర పూరిత క్రియల వల్ల ప్రజాస్వామ్యం అపహాస్యం అయిందని పవన్ ఫైర్ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్యాన్ని అధికార పార్టీ ఖూనీ చేసిన తీరుపై కేంద్ర హోమ్ శాఖకు, కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేస్తున్నామని పవన్ తెలిపారు.
పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే..
“ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో మనల్ని అడ్డుకొని దౌర్జన్యాలు చేస్తే మౌనంగా ఉంటే సార్వత్రిక ఎన్నికల సమయంలో మరింత పేట్రేగిపోతారు. కాబట్టి ధైర్యంగా నిలబడదాం. మీ పరిధిలో నామినేషన్ వేసేందుకు ఎదురైన ఇబ్బందులను, ఎదుర్కొన్న దాడులను వివరంగా తెలియచేయండి. పలు చోట్ల మన అభ్యర్థులపై దాడికి దిగడం, నామినేషన్ వేశాక బలవంతంగా విత్ డ్రా చేయించడం లాంటివి నా దృష్టికి వచ్చాయి. రాయలసీమలో జనసేన అభ్యర్థులు, నాయకులపై దాడులు చేస్తుంటే రక్షించాల్సిన పోలీసులు, నామినేషన్ దశలో ఇబ్బందులు పాలుజేసి అడ్డుకొన్న అధికారుల వివరాలు కూడా సమగ్రంగా తెలియచేయండి. స్థానిక ఎన్నికల్లో చోటు చేసుకున్న హింస, దౌర్జన్యాలు సంఘటనల వారీగా, మీపై దాడులు చేసి ఇబ్బందిపెడుతున్నా రక్షించని అధికారులు, నామినేషన్ దశలో ఆర్.ఓ.ల వ్యవహార శైలిపై వివరాలు పార్టీ కేంద్ర కార్యాలయానికి సత్వరమే పంపించండి. వీటిని క్రోడీకరించి స్వయంగా కేంద్ర హోమ్ శాఖకు అందచేస్తాను. అలాగే కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు వెళ్తా..” అని పవన్ అన్నారు.