Pawan Kalyan- PM Modi: విశాఖ పర్యటనలో మోదీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో అల్లూరి విగ్రహావిష్కరణలో వైసీపీ సర్కారు వ్యవహరించిన తీరును గుర్తు చేసుకొని అప్రమత్తమయ్యారు. ఏపీ సర్కారు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోందని కేంద్రం వద్ద సమాచారం ఉంది. అందుకే ఇన్నాళ్లూ సరైన సమయం కోసం వేచిచూస్తున్న కేంద్ర పెద్దలు చక్రం తిప్పడం ప్రారంభించారు. నేరుగా పవన్ కళ్యాణ్ తో ప్రధాని సమావేశాన్ని ఏర్పాటుచేసి జగన్ కు ఝలకిచ్చారు. తమకు పవన్ రూపంలో ఒక ప్రత్యామ్నాయం ఒకటుందని.. అతడిని విడిచిపెట్టలేదని.. కలిసి నడుస్తామని సంకేతాలిచ్చారు. తాము కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి ప్రధాని పర్యటన ఏర్పాట్లు చేయడం ఏమిటి? పవన్ తో ప్రధాని కలవడం ఏమిటన్న అంతర్మథనం వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఇంత కష్టపడుతున్నా ప్రధాని కలిసేందుకు తమకు చాన్స్ దక్కకపోవడంపై వారు మండిపడుతున్నారు.

వాస్తవానికి చాలామంది వైసీపీ నాయకులు ప్రధాని మోదీని కలవాలనుకున్నారు. మర్యాదపూర్వకంగా కలిసి ఫోటో దిగుదామని భావించారు. కానీ పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ తో ప్రధాని మోదీ వైసీపీ నేతలెవర్నీ కలిసేందుకు ఇష్టపడలేదని టాక్ నడుస్తోంది. ప్రధాని పర్యటనలో మర్యాదపూర్వకంగా కలవడం వంటివి ఉంటాయి. దీనికి పీఎంవో అనుమతులు అవసరం లేదు. అయితే విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధానిని కలిసి.. వాటిని సోషల్ మీడియా, అనుకూల మీడియా ద్వారా ప్రసారం చేయాలని అధికార పార్టీ నేతలు స్కెచ్ వేశారు. అయితే పవన్ పుణ్యమా అని వారి పాచికలు పారలేదు. నిన్న విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధాని పార్టీ శ్రేణులతో సమావేశం, తరువాత పవన్ భేటీతో ముగించారు. కేవలం సీఎం జగన్, రాష్ట్రపతి హరిచందన్ తోనే సమావేశమయ్యారు. మరే ఇతర నాయకులకు చాన్స్ ఇవ్వలేదు. ప్రధానితో ఫొటో దిగి తెగ హల్ చల్ చేస్తామన్న నాయకులకు ఆశాభంగమే ఎదురైంది.
పవన్ జగన్ నుంచి ఆ నలుగురు కీలక నేతలో పాటు ఇతర ప్రజాప్రతినిధుల వ్యవహార శైలిని ప్రధానికి సంక్షిప్తంగా చెప్పుకొచ్చారు. దీంతో ప్రధాని ఆశ్చర్యపోయినట్టు తెలుస్తోంది. ఆ ఎఫెక్ట్ అపాయింట్మెంట్ పై ప్రభావం చూపింది. తనను కలిసేందుకు ఎవర్నీ అనుమతించవద్దని కూడా ప్రధాని స్పష్టమైన ఆదేశాలిచ్చినట్టు సమాచారం.

ఇప్పటికే ఇవి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలైనా హైజాక్ చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. ఈ సమయంలో వైసీపీ నేతలు కలిస్తే మరింత అడ్వాంటేజ్ ఇచ్చినట్టవుతుందని భావించి.. ముందుగా ఇచ్చిన అపాయింట్మెంట్ లను సైతం క్యాన్సిల్ చేసినట్టు సమాచారం. మొత్తానికైతే ప్రధాని టూర్ లో పవన్ ఎంట్రీతో వైసీపీ నేతలకు చుక్కలు కనిపించాయి. వారు ఏదేదో ఊహించుకొని తోరణాలు, బ్యానర్లు కట్టించారు. కానీ ప్రధాని ఏ ఒక్క వైసీపీ నాయకుడికి తన దరికి చేరనివ్వలేదు. ఇదంతా పవన్ మేనియా అని కూడా వైసీపీ నేతలకు తెలుసు. అందుకే బయటకు కక్కలేక లోలోపల జనసేనాని పై రగిలిపోతున్నారు.