Pawan Kalyan: పవన్ ఏ అంశమైనా అనర్గళంగా మాట్లాడగలరు. లోతుగా విశ్లేషించగలరు. అటు ఎదుటి వారిపై కామెంట్స్ చేసినప్పుడు కూడా బ్యాలెన్స్ గా వ్యవహరిస్తారు. ఒక్కోసారి ప్రత్యర్థుల చర్యలు బట్టి తీవ్రస్థాయిలో కూడా స్వరం పెంచి మాట్లాడగలరు. అదే సమయంలో నిశిత పరిశీలన కూడా చేయగలరు. ఇటువంటి అంశాలతోనే మరోసారి ప్రధాని మోదీకి ఆకట్టుకోగలిగారు. వైసీపీ సర్కారు వైఫల్యాలు, మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి చిట్టా పవన్ విప్పేసరికి ప్రధాని మోదీ షాక్ తిన్నారుట. గత మూడున్నరేళ్లుగా జరిగిన విధ్వంసకర పాలన, ప్రభుత్వ వైఫల్యాలను గుక్క తిప్పకుండా పవన్ చెప్పేసరికి ప్రధాని తదేకంగా చూస్తూ ఉండిపోయారట. నాడు ప్రజావేదిక నుంచి నేటి ఇప్పటం ఘటన వరకూ పవన్ జగన్ సర్కారు విధ్వంసాల గురించి చెప్పినట్టు తెలుస్తోంది.

వైసీపీ ప్రజాప్రతినిధులు ఇసుక, లిక్కర్, ఇళ్ల పట్టాల పంపిణీలో చేసిన అవినీతి, వెనుక పోగేసుకున్న వందల కోట్ల రూపాయల విషయం గురించి కూడా చెప్పినట్టు సమాచారం. ప్రధానంగా జగన్ తాను నమ్మిన నలుగురు కీలక నాయకుల ద్వారా ఎటువంటి అవినీతికి పాల్పడుతున్నారో ఆధారాలతో సహా పవన్ ప్రధానికి వివరించారు. విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామక్రిష్ణారెడ్డి, వేంరెడ్డి ప్రభాకరరెడ్డిలను రాష్ట్రంలో నాలుగు ప్రాంతాలనుకట్టబెట్టి విలువైన భూములను కొల్లగొడుతున్నారని తన వద్ద ఉన్న చిట్టాను ప్రధానికి చూపించారు. ఢిల్లీలో కాదు ఏపీలో కూడా లిక్కర్ స్కామ్ లు జరిగినట్టు ప్రధానికి ఫిర్యాదుచేశారు. అప్పటివరకూ ఉన్న మద్యం పాలసీని ప్రీ ప్లాన్ గా మార్చి… నేరుగా తన అస్మదీయులు తయారుచేసే మద్యాన్ని చలామణి చేశారని ప్రధాని దృష్టికి పవన్ తీసుకొచ్చారు.

రాష్ట్రంలో నదులు, కాలువలను సైతం వైసీపీ ప్రజాప్రతినిధులు పంచుకున్న విషయాన్న పవన్ గుర్తుచేశారు. పేదలకు పట్టెడు ఇసుక దొరకడం లేదని.. అంతా అధికార పార్టీ మాఫియా కనుసన్నల్లోనే జరుగుతోందని.. ఇసుక దొరకక లక్షాలాది మంది భవన నిర్మాణ కార్మికులు పడుతున్న బాధలను ప్రధానికి పవన్ వివరించినట్టు సమాచారం. వేల రూపాయలు విలువ చేయని భూమిని లక్షలాది రూపాయలకు కొనుగోలు చేసి పేదల ఇళ్లు పేరిట జరిగిన అవినీతిని పవన్ ప్రస్తావించినట్టు సమాచారం. జగనన్న కాలనీ లేఅవుట్ ల పేరిట 23 వేల ఎకరాలను కొనుగోలు చేసి రూ.70 వేల కోట్లు లూటీ చేశారని ప్రధానికి పవన్ వివరించారు. ఒక్కో అవినీతి గురించి గణాంకాలతో సహా పవన్ చెబుతుండడం చూసి ప్రధాని ఆశ్చర్యపోయారుట. అయితే ఇన్ని నిఘా వర్గాలు, పార్టీ యంత్రాంగం ఉన్నా..వైసీపీ పాలకుల అవినీతి తన వరకూ రాకపోవడంపై ప్రధాని విస్మయం వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే ఈ విషయంలో పవన్ కు గోహెడ్ అంటూ చేయితట్టి ప్రధాని ప్రోత్సహించినట్టు తెలుస్తోంది.