Pawan Kalyan: ఇల్లు అలగ్గానే పండగ కాదు.. పొత్తు పెట్టుకుంటేనే విజయం దక్కదు. సీట్ల సర్దుబాటు, ఓట్ల బదలాయింపు జరిగితేనే పొత్తు లక్ష్యం నెరవేరుతుంది. లేకుంటే అదో విఫల ప్రయత్నంగా మిగులుతుంది. ఇప్పుడు ఏపీలో సైతం పొత్తు పెట్టుకున్న టిడిపి, జనసేనలో విపరీతమైన అసంతృప్తి వ్యక్తం అవుతోంది.ముఖ్యంగా జనసేనలో అధికంగా ఉంది. జనసైనికులు తమ బలాన్ని ఎంతో ఊహిస్తే.. 24 అసెంబ్లీ సీట్లను మాత్రమే కేటాయించడంపై ఆగ్రహంగా ఉన్నారు. జనసేన ద్వారా ప్రజాప్రతినిధులుగా మారుతామనుకున్న నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారి అసంతృప్తిని చల్లారిస్తే కానీ.. ఓట్ల బదలాయింపు జరగదని రెండు పార్టీల నాయకత్వాలు భావిస్తున్నాయి. వాటిని తగ్గించేందుకు రంగంలోకి దిగాయి.
టిడిపి, జనసేన సోషల్ మీడియాలు రంగంలోకి దిగాయి. రెండు పార్టీల్లో అసంతృప్తులను చల్లార్చే పనిని మొదలుపెట్టాయి. చెన్నై వేదికగా కీలక సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. మరోవైపు పొత్తుల్లో భాగంగా 24 అసెంబ్లీ స్థానాలకి జనసేన పరిమితం కావడంపై.. కాపు సామాజిక వర్గంలో అసంతృప్తి ఉంది. దీనిపై వైసీపీ సోషల్ మీడియా సైతం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఓట్ల బదలాయింపు సక్రమంగా జరగదని రెండు పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. అందుకే వీలైనంత త్వరగా అసంతృప్తులను చల్లార్చి… ఓట్ల బదలాయింపు సక్రమంగా జరిగేలా చూడాలని రెండు పార్టీల సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేయడానికి నిర్ణయించాయి.
ముందుగా ఒక స్లోగన్ ను బలంగా పంపుతున్నాయి. గత ఎన్నికల్లో పవన్ ఒకచోట గెలిపించుకొని ఉంటే.. అడిగే స్థితిలో ఉండే వారమని.. నాడు జనసేనకు ఒకటి రెండు సీట్లు వచ్చినా.. ఇప్పుడు మెజారిటీ సీట్లు డిమాండ్ చేసే పొజిషన్లో ఉండే వారమని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న ఆ మధ్యన బుల్లితెర నటుడు, జనసేన అభిమాని హైపర్ ఆది కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. రెండు పార్టీల శ్రేణులు సమన్వయంతో పనిచేసి.. ఓట్ల బదలాయింపు సక్రమంగా చేసుకోవాలని.. ప్రత్యర్థి పార్టీల ట్రాప్ లో పడొద్దని ఆది సూచించారు. ప్రత్యేక వీడియో ఒకటి విడుదల చేశారు. ఇప్పుడు ఏకంగా చెన్నైలో సమావేశం కావడం విశేషం. ఇందులో సీనియర్ జర్నలిస్టులు, టిడిపి యాక్టివిస్టులు ఎక్కువగా పాల్గొన్నారు. మరో వారం రోజులు పాటు ఈ టీం బలంగా పనిచేయనుంది. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేయనుంది. అయితే వీరి ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.