Pawan Kalyan Birthday Special: వేల మైళ్ల దూరం ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఈ మార్గంలో అటుపోట్లు తప్పవు. వాటిని అధిగమిస్తేనే ముందుకు సాగుతాం. లేకుంటే ఆటంకం వచ్చిన దగ్గరే ఆగిపోతాం. ఈ విషయాన్ని తత్వవేత్తలో, శాస్త్రవేత్తలో చెప్పాల్సిన అవసరం లేదు. అనుభవపూర్వకంగా అందరికీ అవగాహన ఉంటుంది. అయితే ప్రయాణం.. రోడ్డు మీదనా.. కెరియర్‌లోనా.. జీవితంలోనా లేకపోతే తాను ఎంచుకున్న రంగంలోనా అన్నది ముఖ్యం కాదు. ఎక్కడైనా ముందడుగు వేయడమే లక్ష్యం. ఆ విషయం పవన్ కల్యాణ్‌కు తెలియనిదేం కాదు. ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’ సినిమాతో చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చి అట్టర్ ఫ్లాప్ చూసిన పవన్ .. జీవితంలో అప్పుడే అథఃపాతాళానికి వెళ్లాడు. కానీ నిరాశతో అక్కడే ఉండి ఉంటే ఈ రోజు పవర్ స్టార్, జనసేనాని మన కళ్ల ముందు ఉండేవారు కాదు. శ్రమ.. పట్టుదల.. అకుంఠిత దీక్షతో పవన్ కల్యాణ్ ఈ స్థాయికి ఎదిగారు.

-ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి..
ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా 20 ఏళ్ల క్రితమే రాజకీయ ప్రయాణం మొదలు పెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో పవన్ రాజకీయ ప్రస్థానం మొదలైంది. యువరాజ్యం అధ్యక్షుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభంజనం సృష్టించారు. అప్పటి వరకూ రాజకీయాల్లో తలపండిన నేతలను వణికించాడు. అయితే ఈ ప్రయాణంలో కొంతకాలానికే ఆటంకం ఎదురైంది. ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనమైంది. దీనిని వ్యతిరేకించిన పవన్ తర్వాక కొన్నాళ్లు స్తబ్ధుగా ఉన్నారు.
Also Read: Pawan Kalyan First Movie: హీరో కాకపోతే పవన్ చేద్దామనుకున్న పని అదే!
-రాష్ట్ర విభజన తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి..
రాజకీయ ప్రయాణానికి ఆటంకం ఎదురైందని పవన్ కల్యాణ్ ఆగిపోకుండా.. దానిని అధిగమించేందుకు కొన్నాళ్లూ వేచిచూశారు. ఈ క్రమంలో రాష్ట్ర విభజన జరిగింది. కొత్త రాష్ట్రంలో రాజకీయ ప్రయాణం సాఫీగా సాగుతుందని భావించారు. జనం కోసం రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా జనసేన పార్టీని స్థాపించారు. ఏపీకి దిశానిర్దేశం చేయగల.. ఏపీ ప్రజల బతుకుల్లో మార్పులు చేయగల యువ నేతల్లో పవన్ కల్యాణ్ ఒకరు. ఆంధ్రప్రదేశ రాజకీయ ప్రయాణంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా ధైర్యంగా వాటిని ఎదుర్కొంటూ లక్ష్యం వైపు దూసుకుపోతున్నారు పవన్ కల్యాణ్.
-మెగాస్టార్ తమ్ముడిగా సినిమాల్లోకి..
చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు పవన్ కల్యాణ్. ఎంట్రీ మాత్రమే.. కానీ ఎదిగింది సొంత టాలెంట్‌తోనే ! చిరంజీవి తమ్ముడు కాబట్టి పవన్ కల్యాణ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్‌గా ఉన్నారని చాలా మంది అంటూ ఉంటారు. అదే నిజమైతే నాగబాబు ఎందుకు సూపర్ స్టార్ కాలేకపోయారనేది సింపుల్‌గా అందరికీ వచ్చే ప్రశ్న. నిజం చెప్పాలంటే చిరంజీవి అనే ఇమేజ్ పవన్ కల్యాణ్‌కు బర్డెన్‌గా మారింది. పవన్ మొదటి సినిమా అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి. ఆ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు.. పరిణామాలు ఆయనకే తెలుసు. ఆ సినిమా రిలీజ్ తర్వాత పవన్‌కు యాక్షన్ రాదన్నారు. పనికి రాడన్నారు. సినిమాలు చేస్తామని వచ్చిన అందరూ వెనక్కి తగ్గారు. దీంతో పవన్ కల్యాణ్ పనైపోయిందనుకున్నారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం నిరాశలో నుంచే ఫీనిక్స్‌లా ఆలోచనలను పెంచుకున్నాడు. తన సత్తా చూపాలనుకున్నాడు. తొలి అవకాశం అయితే చిరంజీవి బ్రాండ్‌తో వచ్చింది కానీ ఆ తర్వాత మాత్రం సొంత టాలెంట్ చూపించారు. వైవిధ్యమున్న కథలతో తెర ముందుకు వచ్చారు. తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి లాంటి వాటి సినిమాలతో యువతలో క్రేజ్ తెచ్చుకున్నారు. అది అంతకంతకూ పెరుగుతూ పోయింది. ఆయన ప్రయాణంలో చిరంజీవి బ్రాండ్ వల్ల తొలిఅవకాశం వచ్చింది. కానీ ఆయన నిలదొక్కుకునే వరకూ.. చిరంజీవి ఇమేజ్‌ను మోయాల్సి వచ్చింది. చిరంజీవిపేరు చెడగొట్టకుండా.. తన కెరీర్‌ను బిల్డ్ చేసుకోవడానికి ఆయన ఎంత కష్టపడి ఉంటారో.. జీవితంలో ఎదగలేని వారు ఎవరూ ఊహించలేరు. సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టుకుని టైమ్ పాస్ చేసేవారు అసలు అంచనా వేయలేరు కూడా!

-పార్టీ ప్రకటించి పోటీ చేయకపోవడం..
పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదనే మనస్థత్వం పవన్ కల్యాణ్‌ది. వందలు, వేల పుస్తకాలు చదివి విజ్ఞానం ఆయన సొంతం. సామాజిక స్పృహ ఉన్న నేత. వందలు, వేల పుస్తకాలు చదివారు. రాజకీయంగా సమాజానికి ఏదైనా చేయాలనుకునే స్వభావం ఉన్న నేత. అందుకే సోదరుడు ప్రజారాజ్యం పార్టీ పెడితే అందులో యువరాజ్యం బాధ్యతలు తీసుకున్నారు. విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ పదవులు కోరుకోలేదు. ఎక్కడా పోటీ చేయలేదు. ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం అయిన తర్వాత సైలెంటయ్యారు.
-2014లో పురుడు పోసుకున్న జనసేన..
ప్రజారాజ్యం తర్వాత ఆయనలోని రాజకీయ భావాలు పవన్‌ను కుదురుగా ఉండనీయలేదు. అందుకే జనసేన పార్టీని ప్రారంభించారు. 2014 ఎన్నికలకు ముందు ప్రారంభించి.. తాను అందరి లాంటి రాజకీయ నాయకుడ్ని కాదని.. ఓట్లు చీల్చడం ఇష్టం లేదని చెప్పి పోటీ చేయలేదు. టీడీపీ,బీజేపీ కూటమికి మద్దతిచ్చారు. పోటీ చేయడం ఇష్టం లేకపోతే ఎన్నికలైన తర్వాత పార్టీ ప్రకటన చేసి ప్రజల్లోకి వెళ్లి ఉంటే మంచి ఫలితం వచ్చి ఉండేది. తర్వాతైనా పార్టీ విస్తరణపై దృష్టిపెట్టలేదు. నాలుగేళ్లు టీడీపీ–బీజేపీ ప్రభుత్వంతో సఖ్యతగానే ఉన్న ఆయన చివరి ఏడాది విభేదించారు.
-ఓట్లు సీట్లు రాలేదని నిరాశ పడలేదు..
టీడీపీ, బీజేపీతో విభేదించిన పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల బరిలో నిలిచారు. కానీ ఆయన రెండు చోట్లా ఓడిపోయారు. జనసేన పార్టీకి నికరంగా ఆరు శాతం ఓట్లు ఉన్నట్లుగా 2019 ఎన్నికలతో తేలింది. ప్రజారాజ్యంతో పోలిస్తే ఈ ఓటు శాతం చాలా తక్కువ. అయితే పవన్ కల్యాణ్ పోరాటయోధుడు. ఓట్లు, సీట్లు రాలేదని ఆయన నిరాశపడలేదు. రాజకీయ పోరాటం సాగిస్తున్నారు. పార్టీ కోసం, ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి పవన్ సినిమాలు చేయాల్సి వస్తోంది. అయితే ఆయనపైనా వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం వేధింపులకు పాల్పడింది. ఆర్థికంగా దెబ్బకొట్టే ప్రయత్నం చేసింది. వ్యక్తిగత దూషణలకూ పాల్పడ్డారు.
-అండగా నిలుస్తున్న అభిమానులు..
రాజకీయంగా, వ్యక్తిగతంగా ఏపీ ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కలిగించినా పవన్ మాత్రం గీత దాటలేదు. రాజకీయంగానే తేల్చుకుంటానని.. వైఎస్‌ఆర్‌సీపీ ఓటమే లక్ష్యంగా పని చేస్తానని ప్రకటించారు. అయితే ఆయన వెనుక బలమన అభిమానులు ఉన్నారు. వారు అండగా నిలుస్తున్నారు. కష్టమైనా.. నష్టమైనా తామంతా పవన్ వెనుకే ఉంటామన్న క్లారిటీ వారికి ఉంది.

-బలాలు, బలహీనతల్ని గుర్తించాలి..
తను ఏదైనా జిల్లాకు వెళ్తే వెంట వచ్చే నాలుగైదు వేల మంది.. సీఎం సీఎం అయితే కొన్ని వందల మందిని చూసి .. లేకపోతే పార్టీ యంత్రాగం తీసే డ్రోన్ షాట్లు చూసి.. తనకు తిరుగులేని బలం ఉందని.. అనుకుంటే అంతకు మించి అమాయకత్వం ఉండదు. రాజకీయాల్లో బలాన్ని పొందడం ఎంత గొప్ప విషయమో.. ఆ బలాన్ని అంతే పకడ్బందీగా వాడుకోవడం కూడా అంతే కీలకం. మనది ప్రజాస్వామ్య దేశం. మెజార్టీ రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. ఓ రాజకీయ పార్టీకి ఇరవై శాతం ఓట్లు ఉన్నా చట్టసభల్లో ప్రాతినిద్యం లేకపోతే.. ఆ ఇరవై శాతం ఓట్లు వృథా. అంతే కాదు.. తమను నమ్మి ఓట్లేసిన వారి వాయిస్‌ను వినిపించకుండా చేసినట్లవుతుంది. అదే పది శాతం ఓట్లు ఉన్నా సరే.. పది మంది చట్టసభల్లో ఉంటేం ప్రభావం ఎక్కువగా చూపించవచ్చు. ఇక్కడ పది శాతం ఓట్లనే .. ప్రభావ వంతంగా వాడుకోవడం కీలకం. అదే రాజకీయం. ఇది గుర్తించకపోవడంతో 2019లో ఆయన తీవ్రంగా నష్టపోయారు. ఆయన నష్టం వ్యక్తిగతం. ఆయన భరించగలరు. కానీ ఇప్పుడు ఏపీకే తీవ్ర నష్టం జరిగింది. ఆ నష్టం.. ప్రజల బతుకుల్ని ధ్వంసం చేస్తోంది. రాష్ట్రాన్ని దివాలా తీయిస్తోంది. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ కూడా అంగీకరిస్తున్నారు. అందుకే ఈసారి ఓట్లు చీలనివ్వనని అంటున్నారు.
-యాత్రతో జనంలోకి..
వైసీపీ ముక్త్ ఆంధ్రప్రదేశ్ కోసం రాజకీయ పోరాటం చేస్తున్న జన సేనాని పవన్ కల్యాణ్ దసరా నుంచి యాత్ర ప్రారంభిస్తున్నారు. ఎన్నికల వరకూ ఆయన జనంలోనే ఉంటారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే రాజకీయంగానూ ఆయన సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. 2024 ఎన్నికలు జనసేనకు అత్యంత కీలకం. సొంత రాజకీయ పార్టీ ద్వారా ఇప్పటికే రెండు ఎన్నికలను ఎదుర్కొన్నారు. ఓ ఎన్నికలో అసలు పోటీ చేయలేదు. మరో ఎన్నికల్లో పోటీ చేసి ఘోరపరాజయం పాలయ్యారు. పవన్ కల్యాణ్ ఓటు బ్యాంక్ గణనీయంగాఉంది. కానీ అదంతా ఒక్క చోట లేదు. మెజార్టీల మీద నడిచే రాజకీయంలో ఓట్లను సమీకరించుకోవాలంటే వ్యూహాత్మకంగా ముందుకెళ్లాల్సి ఉంటుంది. పవన్ కల్యాణ్ రాజకీయంగా విశాలమైన దృక్పథంతో ఆలోచించాల్సి ఉంది. ఉన్న బలాన్నే పక్కాగా వాడుకునే ప్రయత్నం చేయాలి. మన వల్ల ఇతరులు లాభపడుతున్నారా అనేదాని కన్నా మనం ఎంత లాభపడుతున్నామన్నది చూసుకోవాలి. ఎందుకంటే.. వచ్చే ఎన్నికల్లో గెలుపోటములు కాదు.. గెలుపే రావాలి. ఉనికిని బలంగా చాటాలి. లేకపోత పవన్ కల్యాణ్.. తాను ఇబ్బంది పడటమే కాదు.. తనను నమ్ముకున్న ఓ వర్గాన్ని కూడా ఇబ్బంది పెట్టిన వారవుతారు. పవన్ కల్యాణ్ ఓటమితో ప్రారంభించి సినిమా రంగంలో అత్యున్నతంగా ఎదిగారు. రాజకీయాల్లోనూ ఆయన ఓటమితో ప్రారంభించారని అనుకోవచ్చు. పవన్ కృషి, పట్టుదల.. రాజకీయాలపై ఆయనకు ఉన్న ఆసక్తి.. సామాజిక బాధ్యత వంటివిచూస్తే.. ఆయన కచ్చితంగా సక్సెస్ అవుతారు. కానీ ఆయన గుర్తించాల్సింది.. రాజకీయాలంటే సినిమా రంగం కాదు. పూర్తి స్థాయిలో ప్రత్యేకం. సినీ రంగంలో సక్సెస్ ఫార్ములా రాజకీయాల్లో వర్కవుట్ కాదు. రాజకీయాల్లో కావాల్సింది ఆలోచన.. ఆవేశం కాదు. ఆ ఆలోచనే విజయాన్ని అందిస్తుంది. ఆంధ్రాలో ‘పవర్’ మార్చే శక్తి ఉన్న పవన్ విశాలంగా ఆలోచిస్తారని.. విజయం సాధిస్తారని ఆశిద్దాం..!
Also Read:Pawan Kalyan Remakes: పవన్ కల్యాణ్ కెరీర్ లో రీమేక్ హిట్స్..
[…] Also Read: Pawan Kalyan Birthday Special: ‘పవర్’ మార్చే పవన్ స్టా… […]
[…] Also Read:Pawan Kalyan Birthday Special: ‘పవర్’ మార్చే పవన్ స్టా… […]