Pawan Kalyan: బ్రో సినిమా వివాదానికి బ్రేక్ పడినట్టేనా? పవన్ పిలుపుతో జనసైనికులు సైలెంట్ అయ్యారా? వైసీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారా? మంత్రి అంబటి సైతం తోక ముడిచారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. పవన్ ఆదేశాలతో జనసేన శ్రేణులు సైలెంట్ అయ్యాయి.
అటు మంత్రి అంబటి రాంబాబు సైతం ఆచూకీ లేకుండా పోయారు. ఢిల్లీ వెళ్లిన ఆయన వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు. దీంతో ఈ వివాదానికి తెరపడినట్టేనని అంతా భావిస్తున్నారు.
గత పది రోజులుగా బ్రో సినిమా వివాదం సినీ, రాజకీయ రంగాలను కుదిపేసింది. సినిమాలో శ్యాం బాబు క్యారెక్టర్ వివాదాస్పదమైంది. తనను ఉద్దేశించి ఆ పాత్రను పెట్టారని మంత్రి అంబటి అనుమానం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే తన క్యారెక్టర్ ను పెట్టారని చిత్ర యూనిట్ పై మండిపడ్డారు. ఏకంగా తెలుగు సినిమా పరిశ్రమకే హెచ్చరికలు జారీ చేశారు. టిడిపి స్పాన్సర్ చేసిన సినిమాగా చెప్పుకొచ్చారు. పవన్ కు భారీ ప్యాకేజీ అందిందని ఆరోపించారు. ఈడికి ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. అందుకే ఢిల్లీ వెళుతున్నట్లు లీకులు ఇచ్చారు. అటు జనసైనికులు కూడా మంత్రి అంబటి పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు.
ఢిల్లీ వెళ్లే ముందు అంబటి మీడియాకు డైరెక్ట్ గా కాకుండా తన సన్నిహితులైన ఒకరిద్దరు జర్నలిస్టుల వద్ద కొన్ని విషయాలను పంచుకున్నారు . బ్రో సినిమా పెట్టుబడులపై విచారణ చేయమని అడగడానికి.. కేంద్ర దర్యాప్తు సంస్థలను ఆశ్రయించనున్నట్లు తెలిపారు. చివరకు బయలుదేరే ముందు కూడా మీడియాతో మాట్లాడారు. బ్రో చిత్ర యూనిట్ పై చర్యలు తప్పవని హెచ్చరికలు పంపారు. కానీ ఢిల్లీ వెళ్లి విజయసాయిరెడ్డిని కలిశారు. వినయ విధేయతలు ప్రదర్శించారు.
అయితే అటు తర్వాత బ్రో సినిమా గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు.కేంద్ర మంత్రి షెకావత్ ను కలిశారు. అనంతరం పోలవరం పై ప్రెస్ మీట్ పెట్టారు. కేంద్రానికి ఎన్ని అడగాలో.. అడిగేసినట్లు మీడియా ప్రతినిధులకు వివరించారు. ఇంతలో వీకెండ్ వచ్చేసింది. కనీసం అంబటి ఢిల్లీలో ఎక్కడున్నారో? ఏం చేస్తున్నారో? ఎవరికీ తెలియడం లేదు. ఈ తరుణంలో పవన్ బ్రో సినిమా వివాదం పై స్పందించారు. ఇకనుంచి ఆ సినిమా గురించి మాట్లాడొద్దని జనసేన ప్రతినిధులకు సూచించారు. దీంతో అంబటి తో పాటు వైసీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నట్టు ఉన్నాయి. అందుకే అంశం గురించి మాట్లాడడం మానేశాయి.