Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ కుండబద్దలు కొట్టారు. కొద్దిరోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు పంపుతున్న ‘పొత్తు ప్రేమ సందేశాల’పై కుండబద్దలు కొట్టారు. పొత్తుల విషయంలో ఎవరి మైండ్ గేమ్ లో పావులు కావొద్దని డిసైడ్ అయ్యారు. జనసేన స్వలాభం కోసం వచ్చిన గుంపు కాదని స్పష్టం చేశారు. పొత్తులపై అందరికీ ఆమోదయోగ్యమైన ఆలోచనతోనే ముందుకు వెళ్దామని సూచించారు. ముందుగా పార్టీ సంస్థాగత నిర్మాణానికి తొలి ప్రాధాన్యమన్నారు. పార్టీ కార్యనిర్వాహక సభ్యులతో టెలీ కాన్ఫరెన్స్ లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తన శ్రేణులకు వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తం కావాలని దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా రైతాంగం సమస్యలపై ప్రణాళికాబద్ధమైన పోరాటం చేస్తామన్నారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో పవన్ కీలక సూచనలు చేశారు. చంద్రబాబు వలలో పడవద్దని.. టీడీపీతో పొత్తు ఉండదని దాదాపు స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ మాటలిప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
పలు పార్టీలు మనతో పొత్తులు కోరుకున్నప్పటికీ మనం మాత్రం ముందుగా సంస్థాగత నిర్మాణంపై పూర్తిస్థాయిలో దృష్టి సారిద్దామని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పార్టీ కార్యనిర్వాహక సమావేశంలో స్పష్టం చేశారు.ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్నామని, ఈ వ్యవహారంలో అంతా ఒకటే మాట మీద ఉందామన్నారు. ఎవరు ఏం మాట్లాడినా.. మైండ్ గేములు ఆడినా మనం మాత్రం పావులు కావద్దని నిర్దేశించారు. సంస్థాగత నిర్మాణం మీద దృష్టి సారిద్దామని చెప్పారు. తన ఒక్కడి నిర్ణయం మీద ముందుకు వెళ్లనని, పూర్తి ప్రజాస్వామ్యబద్దంగా అందరికీ ఆమోదయోగ్యమైన ఆలోచనే ముందుకు తీసుకువెళ్తానన్నారు. అప్పటి వరకు ఎవరేం మాట్లాడినా సంయమనంతోనే ఉండాలని పార్టీ నాయకత్వానికి సూచించారు. కరోనా మూడో వేవ్ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జనసేన పార్టీ కార్యనిర్వాహక సభ్యుల సమావేశం నిర్వహించారు. పార్టీ పి.ఏ.సి. ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఇందులో పాల్గొన్నారు. పి.ఏ.సి సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల చైర్మన్లు, రాష్ట్ర కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “క్షేత్ర స్థాయిలో జనసేన పార్టీ రోజు రోజుకీ బలం పుంజుకుంటోంది. అయితే పార్టీ నిర్మాణం అనేది కష్టసాధ్యమైన పని. సంస్థాగత నిర్మాణం లేదు అంటూ ప్రతి ఒక్కరు తేలిగ్గా చెప్పేస్తున్నారు. ఆ మాట మాట్లాడే వారు ఎవరూ పార్టీని స్థాపించలేదు. చిన్నపాటి సంస్థను నడిపించలేని వ్యక్తులే అలాంటి మాటలు అంటూ ఉంటారు. జనసేన పార్టీ అంటే స్వలాభం కోసం, స్వప్రయోజనం కోసం వచ్చిన గుంపు కాదు. ఒక కట్టుదిట్టమైన ఆలోచనా విధానంతో వ్యక్తిగత అజెండాలు లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించకుండా, డబ్బు కోసం కాకుండా కేవలం ప్రజల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం నిలబడేలాగా పార్టీని ముందుకు తీసుకువెళ్లడం ఎంతో కష్టసాధ్యమైన విషయం. అలాంటిది ఇన్ని సంవత్సరాలు ఈ విధంగా ముందుకు తీసుకువెళ్లగలుగుతున్నామంటే సామాన్య విషయం కాదు. ఈ రోజు ఏ మూలకు వెళ్లినా ఒక జనసేన జెండా రెపరెపలాడుతుంది. దేశ భవిష్యత్తుకి యువతే నావికులని చెబుతారు. అలాంటి యువత మనవెంట బలంగా ఉన్నప్పుడు ఆ బలాన్ని మనం చూడగలగాలి. సంస్థాగతంగా, రాజకీయంగా మలచుకోవడానికి కొంత సమయం తీసుకుంటుంది. పార్టీ స్థాపించిన ఏడేళ్ల తర్వాత యువత ఈ రోజుకి నాయకుల స్థాయికి రాగలిగే పరిస్థితిలో ఉన్నారు. ఆ యువత మీ వెంట నిలబడతామన్న ధైర్యం నింపితే ఈ రోజుకి రాష్ట్రవ్యాప్తంగా 676 మండలాలకుగాను 403 మండలాల్లో అధ్యక్షులను నియమించుకున్నాం. అలా వేయగలిగామంటే యువత, జనసైనికులు, వీర మహిళలే మన బలం. ఈ బలాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తూ ఈ ఏడాది లోపే సంపూర్ణంగా 175 నియోజకవర్గాల్లో బూత్ కమిటీలు నిర్మాణం చేసుకుందాం.
* ఆవిర్భావ దినోత్సవ నిర్వహణకు కమిటీ
గత సంవత్సరం కోవిడ్ పరిస్థితుల వల్ల పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోలేకపోయాం. ఆ సభను ఘనంగా జరుపుకోవాలన్నది నా ఆకాంక్ష. దాని కోసం అయిదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తాం. ఆవిర్భావ సభను ముందుకు ఎలా తీసుకువెళ్లాలో దిశానిర్దేశం చేస్తే ఆ విధంగా ముందుకు తీసుకువెళ్దాం. ఆ ఆవిర్భావ సభలో 2024 ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తం కావాలి అనే అంశాలను ఒక ఆలోచనతో ముందుకు తీసుకువెళ్దాం.
* ప్రజా సమస్యల పోరు
ఏడాది పొడుగునా రైతుల కోసం పార్టీ శ్రేణులు వివిధ స్థాయిల్లో చేసిన పోరాటానికి పేరుపేరునా ధన్యవాదాలు. వరి, మిర్చి రైతులకు, తుపానుల వల్ల పంటను కోల్పోయిన రైతులకు అండగా నిలబడి ప్రభుత్వం నుంచి వారికి జరిగిన నష్టానికి పరిహారం ఎలా ఇప్పించాలి.. అందుకు ఏం చేయాలి అనే దాని మీద పార్టీ వద్ద ఒక బలమైన ప్రణాళిక ఉంది. ఈ నెలలో రైతాంగం కోసం చేసే పోరాటాన్ని ధర్నాల రూపంలో ముందుకు తీసుకువెళ్దామని భావించాం. కోవిడ్ వల్ల దాన్ని ముందుకు తీసుకువెళ్లలేకపోయాం. ఆ పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో ఆలోచన చేద్దాం.
జాబ్ క్యాలెండర్, ఇతర సమస్యల మీద ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలోకి ఎలా తీసుకువెళ్దాం, ఏ విధంగా పోరాడాలి అనే అంశంపై సంక్రాంతి తరవాత ఒక సమావేశం నిర్వహించుకుని ముందుకు వెళ్దాం. అందరి సలహాలు సూచనల మేరకు మరో కాన్ఫరెన్స్ కాల్ ద్వారా జిల్లాల పర్యటనలు, ప్రతి నియోజకవర్గం ప్రజలను కలిసేలా ప్రణాళిక సిద్ధం చేద్దాం.
* క్రియాశీలక సభ్యుల కోసం రూ.కోటి నిధి
పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని ఎంతో ఉత్సాహంతో ముందుకు తీసుకువెళ్లారు. క్రియాశీలక సభ్యులకు ప్రమాద బీమా కల్పిస్తున్నాం. బీమాకు సంబంధించి సభ్యులకు ఇబ్బంది కలుగకుండా రూ.కోటి పార్టీకి అందచేశాను. పార్టీ క్రియాశీలక సభ్యులకు నావంతుగా నేను ఎప్పుడూ అండగా ఉంటాను. మార్చి నెలలో నిర్వహించే సభ్యత్వ నమోదును మరింత ముందుకు తీసుకువెళ్లాలి. భారత దేశంలో మరే రాజకీయ పార్టీ క్రియాశీలక సభ్యుల్ని ఈ విధంగా కాపాడుకున్నది లేదు. క్రియాశీలక సభ్యత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళ్దాం. ఎన్నికల తర్వాత పార్టీ బలోపేతం కోసం బలమైన మద్దతు తెలుపుతూ పార్టీని ముందుకు తీసుకువెళ్తూ మీరిచ్చిన మద్దతుకు పేరు పేరునా ధన్యవాదాలు” అన్నారు.
* జనసేన పార్టీ ప్రత్యామ్నాయ శక్తి: నాదెండ్ల మనోహర్ గారు
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “జనసేన పార్టీకి క్షేత్రస్థాయిలో ఆదరణ పెరుగుతోంది. అధికార పక్షానికి ప్రత్యామ్నాయ శక్తిగా ప్రజలు మనల్ని చూస్తున్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే శక్తి మన నాయకుడికే ఉందని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. గత ఏడాది కోవిడ్ పరిస్థితుల్లో కూడా పార్టీపరంగా దాదాపు 60 కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాం. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాం. దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా రాష్ట్ర రహదారుల దుస్థితిపై డిజిటల్ క్యాంపైన్ చేసి రాష్ట్ర ప్రభుత్వంలో చురుకు పుట్టించాం. అదే విధంగా విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ అంశంలో నిర్వహించిన సభ, డిజిటల్ క్యాంపెయిన్, దీక్ష మన నిబద్ధతను ప్రజలకు తెలిపాయి. క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమంకు రాష్ట్రవ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. దాదాపు లక్షకు పైగా సభ్యత్వాలు నమోదయ్యాయి. ఈ కార్యక్రమం ద్వారా 23 కుటుంబాలను పార్టీపరంగా ఆర్థికంగా ఆదుకోగలిగాం. ఈ ఏడాది కూడా మార్చి 1 నుంచి 14 తేదీ వరకు 175 నియోజకవర్గాల్లో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతాం. అమరావతి రైతులకు అండగా జనసేన పార్టీ పోరాటం చేస్తుంది. మాజీ ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య గారి స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా జనసేన పార్టీ తరపున త్వరలోనే ప్రత్యేక కార్యక్రమం చేపడతాం. గత ఏడాది కష్టపడినట్లే మరో రెండేళ్లు మనం చిత్తశుద్ధితో శ్రమిస్తే పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని” అన్నారు.పార్టీ ప్రధాన కార్యదర్శులు శ్రీ టి.శివశంకర్, శ్రీ సత్య బొలిశెట్టి, శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి, శ్రీ పెదపూడి విజయ్ కుమార్, శ్రీమతి పాలవలస యశస్వి మాట్లాడుతూ “రాష్ట్రంలో రహదారుల దుస్థితిపై జనసేన పార్టీ స్పందించిన తీరు సామాన్యుడికి చేరింది. గ్రామ స్థాయిలో వైసీపీకి మనమే ప్రత్యామ్నాయమని నమ్ముతున్నారు. ప్రత్యేక హోదా సాధనలో కానీ, స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణను ఆపడంలో కానీ, నిరుద్యోగ సమస్యలను తీర్చడంలో కానీ అధికార, ప్రతిపక్షాలు పూర్తిగా విఫలమయ్యాయని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. రాష్ట్రంలో అవినీతిరహిత పార్టీ ఏదైనా ఉంది అంటే అది జనసేన మాత్రమే అని ప్రజలు చెబుతున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఏదైనా సమస్య తీసుకెళ్తే దానికి పరిష్కారం దొరుకుతుందని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతాన్ని ఓర్వలేని కొన్ని రాజకీయ పార్టీలు దురుద్దేశంతో మైండ్ గేమ్ ఆడుతున్నాయ”ని తెలిపారు. పి.ఏ.సి. సభ్యులు శ్రీ కోన తాతారావు. శ్రీ ముత్తా శశిధర్, శ్రీ పితాని బాలకృష్ణ, శ్రీ పంతం నానాజీలు మాట్లాడుతూ “2021లో జనసేన పార్టీ ప్రజాపక్షం వహిస్తూ చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం అయ్యాయి. నిబద్ధతతో, చిత్తశుద్ధితో పోరాటాలు చేయడం వల్లే ప్రజాదరణ దక్కుతోంది” అన్నారు. జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్, శ్రీ కొటికలపూడి గోవిందరావు, శ్రీ పోతిన వెంకట మహేశ్, శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ, శ్రీ షేక్ రియాజ్, శ్రీ చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, శ్రీ టి.సి.వరుణ్, డా.పసుపులేటి హరిప్రసాద్, పార్టీ మత్స్యకార వికాస విభాగం ఛైర్మన్ శ్రీ బొమ్మిడి నాయకర్ క్షేత్ర స్థాయిలో పార్టీ కార్యక్రమాలను, రాజకీయ పోరాటాలను వివరించారు. ఈ సమావేశంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ అర్హం ఖాన్, పార్టీ కోశాధికారి శ్రీ ఎ.వి.రత్నం తదితరులు పాల్గొన్నారు.
-16 మంది సభ్యులతో జనసేన ఐ.టి.విభాగం
జనసేన ఐ.టి. విభాగానికి 16 మందితో కూడిన కమిటీ నియామకానికి పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆమోదం తెలిపారు. ఈ విభాగానికి చైర్మన్ గా శ్రీ మిరియాల శ్రీనివాస్ గారిని ఇప్పటికే నియమించిన సంగతి విదితమే. ఈ కమిటీ శ్రీ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పార్టీ ఐ.టి. కార్యకలాపాలను నిర్వర్తిస్తుంది. త్వరలో జిల్లా విభాగాల నియామకం కూడా పూర్తవుతుంది.
ఊరబండి ప్రసాద్
ఉయ్యాల శ్రీనివాస్
చవ్వాకుల లీలా కోటేష్ బాబు
మద్దెల సాయి మేఘన
పిండి సురేష్
గరిమెళ్ళ కృష్ణ
గేదెల సతీష్ కుమార్
నల్లబల్లి వెంకట కృష్ణమోహన్ రావు
అడపా వాసు
వడ్లాని కిరణ్
పసుపులేటి సంజీవ్
మోసూరు గంగాధర్
పోలేపల్లి సుధీర్ నాయుడు
రావూరి తులసి
గంగిపాముల భాస్కర్
అనుగంటి వేణు