APSRTC: ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం, శుభప్రదం అని అధికారులు ప్రకటిస్తుంటారు. వీటి మాట దేవుడెరుగు. అవి ఎప్పుడు వస్తాయో.. ఎప్పుడు రావో తెలియని పరిస్థితి. కాలం చెల్లిన బస్సులు కావడంతో ఎక్కడ మొరాయిస్తాయో తెలియవు. సకాలంలో గమ్యస్థానాలకు చేర్చడం కూడా ప్రశ్నార్థకమే. అంతలా అపవాదు ఉంది ఏపీఎస్ఆర్టీసీపై. దానిని నిజం చేసేలా నెట్టింట్లో ఒక ఫొటో వైరల్ అవుతోంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణికులంతా గొడుగులు వేసుకున్నారు. ఆశ్చర్యకరంగా ఉంది కదూ. కానీ ఇది నిజం. ఆదివారం సాయంత్రం విశాఖ నుంచి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు బయలుదేరిన ఆర్టీసీ ఆల్ట్రాడీలక్స్ బస్సులో ఈ దృశ్యం వెలుగుచూసింది.

గత ఐదు రోజులుగా ఉత్తరాంధ్రకు వర్షాలు కుమ్మేస్తున్నాయి. ఈ బస్సు కొంతదూరం వెళ్లగా వర్షం ప్రారంభమైంది. దీంతో క్యాబిన్ పైకప్పునకు రంధ్రాలు ఉండడంతో వర్షపు నీరు ధారగా బస్సులో పడుతోంది. దీంతో ప్రయాణికులు తమ వెంట తెచ్చుకున్న గొడుగులు వేసుకోవాల్సి వచ్చింది. ప్రయాణికులు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఏపీఎస్ ఆర్టీసీ తీరుపై నెటిజెన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపై వర్షాకాలంలో బస్సుల్లో ప్రయాణం చేయాలంటే మీ వద్ద గొడుగులు ఉంచుకోండి. మరిచిపోకండి…వర్షాకాలంలో బస్సులో గొడుగులు వేసుకునేంతగా ఆర్టీసీ మెంటెయిన్ చేస్తున్నారన్న మాట. గొడుగులు కూడా బ్లూ కలర్ వి ఉంచుకోండి అంటూ సెటైర్లు వేస్తున్నారు. జనసేన అగ్రనేత నాదేండ్ల మనోహర్ కూడా కామెంట్స్ చేశారు. ఫొటోను ట్యాగ్ చేసి ట్విట్ చేశారు. ‘ఆకాశానికి చిల్లు.. ఆర్టీసీ బస్సుకు చిల్లు.. ఈ ప్రభుత్వ పాలనలో సగటు మనిషి బతుకు కూడా చిల్లే’ సెటైర్లు పేల్చారు. అటు టీడీపీ నాయకులు, అభిమానులు కూడా ఫొటోను ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. నెటిజెన్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు.

వాస్తవానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్టీసీలోకొత్త బస్సులుకొనుగోలు చేసిన దాఖలాలు లేవు. సాధారణంగా ఆర్టీసీలో కొత్త బస్సులను ఎక్స్ ప్రెస్ ల కింద సుదూర సర్వీసుల కోసం వినియోగిస్తారు. 5 లక్షల కిలోమీటర్లు తిరిగిన తరువాత కంప్లీట్ సర్వీసింగ్ చేయాలి. కానీ డిపో గ్యారేజీలో విడిపరికరాలు లేవు. వాటిని అమర్చాలంటే నిపుణులైన మెకానిక్ లు లేరు. దీంతో పైపైన మెరుగులు దిద్ది రోడ్లపై విడిచిపెడుతున్నారు. బస్సులు కనీస మరమ్మతులకు నోచుకోవడం లేదు. అటు 13 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులను కాలం చెల్లినవిగా పరిగణిస్తారు. కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 30 నుంచి 40 శాతం వరకూ బస్సులు అవే కోవలోకి వస్తాయి. అటు ఆర్టీసీలో కొత్త నియామకాలు కూడా మందగించాయి. ఒక్కో బస్సుకు డ్రైవర్, కండక్టర్, మెకానిక్ లను కలుపుకొని ఐదుగురు వరకూ ఉండాలి. కానీ ఆ శాతాన్ని తీసుకుంటే ఒక్కరు మాత్రమే ఉన్నారు.