Munugode By Election: మునుగోడు ఉప ఎన్నిక ఇప్పుడు అన్ని పార్టీలకు కీలకం. బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీ ప్రకటించిన కేసీఆర్ కు, 2023 ఎన్నికల్లో అధికారంలోకి రావాలని భావిస్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి, దశాబ్దం పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం తేవాలని పాటుపడుతున్న రేవంత్ రెడ్డికి ఈ ఉప ఎన్నిక అత్యంత కీలకం. అందుకే కీలక నేతలందరూ ఈ నియోజకవర్గంలోనే మోహరించారు. సోమవారం మంచి రోజు కావడంతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ వేశారు. ఆయన వెంట బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ జాతీయ పరిశీలకులు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ ఉన్నారు. అయితే మొదట్లో చెప్పినట్టు అన్ని పార్టీలకు ఈ మునుగోడు ఉప ఎన్నిక కీలకం కావడంతో ఎలాగైనా గెలవాలి అనే తలంపుతో చెమటోడ్చుతున్నారు.

కులాలే లక్ష్యంగా
మునుగోడులో బీసీ ఓటర్లే అధికంగా ఉన్నారు. 2018 లో జరిగిన ఎన్నికల్లో వీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి జై కొట్టడంతో ఆయన తన సమీప టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పై గెలుపొందారు. అయితే ఈసారి కూడా తనను బీసీ ఓటర్లు ఆదరిస్తారని రాజగోపాల్ రెడ్డి నమ్ముతున్నారు. ఒకసారి మునుగోడు నియోజకవర్గాన్ని పరిశీలిస్తే..
మొత్తం ఓటర్లు: 2 లక్షల 27 వేల 101 మంది ఉన్నారు. వీరిలో బీసీలు: 1,50,400 (66.2%), ఎస్సీలు: 35,411 (15.6%), ఓసీలు: 20, 290(8.9%), ఎస్టీలు: 13, 000 (5.7%), మైనారిటీలు: 8000 (3.5%) ఉన్నారు. ఇక బీసీల్లో కులాలవారీగా పరిశీలిస్తే.. గౌడ: 38000 (16.7%), గొల్ల, కురుమ: 35,000 (15.4%), ముదిరాజ్: 34500 (15.2%), పద్మశాలి: 19,000 (8.4%), వడ్డెర: 8300 (3.6%), విశ్వబ్రాహ్మణ: 7,800 (3.4%), కుమ్మరి: 7800 (3.4%) మంది ఓటర్లు ఉన్నారు. ఇక ఎస్సీల్లో మాదిగ: 25,000 (11.0%), మాల: 10,411 (4.6%), ఓసీల్లో రెడ్డి: 7,701 (3.3%), కమ్మ: 4,880 (2.1%),
వెలమ: 2, 360 (1.0%), వైశ్య: 3,760 (1.6%) ఓటర్లు ఉన్నారు. ఇక ఇతరులు: 1,589 (0.9%) మంది ఉన్నారు.
బీసీలు ఎటు మొగ్గితే..
మునుగోడు నియోజకవర్గం లో బీసీలు ఎటు మొగ్గితే ఆ పార్టీ అభ్యర్థే విజయం సాధిస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైపు బీసీ ఓటర్లు మొగ్గడంతో ఆయన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పై గెలుపొందారు. ఇక బీసీ ఓటర్లలో అధిక శాతం గౌడ కులస్తులే ఉన్నారు. అయితే మొన్న గౌడ కులంలోని కొన్ని సంఘాలు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వద్దకు వెళ్లి మునుగోడు లో తమ మద్దతు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే అని తేల్చి చెప్పారు. ఇందుకు కౌంటర్ గా గౌడ కులంలోని కొన్ని సంఘాలు తమ మద్దతు రాజగోపాల్ రెడ్డి కే ఇస్తామని ప్రకటించాయి. తమకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని మద్దతు ఇవ్వాలని ఆ సంఘాలు ప్రశ్నించాయి. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఓడిపోయిన తర్వాత నియోజకవర్గ ముఖమే చూడలేదని ఆ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఇక రాజకీయ పార్టీల నాయకులు కులాల సభ్యులను మచ్చిక చేసుకొనేందుకు రకరకాల ప్రలోభాలకు తెర తీస్తున్నాయి. మునుగోడులో యాదవ ఓటర్లు కూడా ఎక్కువగా ఉండటంతో వారిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు గొర్రెల పంపిణీ పథకానికి టిఆర్ఎస్ నాయకులు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం గొర్రెలు ఎక్కడ కూడా లభ్యం కాకపోవడంతో జీవాలకు బదులుగా నగదు ఇస్తున్నారు. అది కూడా యుద్ధప్రాతిపదికన చేపడుతున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే దళిత బంధు కోసం వచ్చిన నగదును గొర్రెల పంపిణీ పథకానికి వినియోగిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. టిఆర్ఎస్ పార్టీ ఎత్తులు ఇలా ఉంటే..

బిజెపి ఏకంగా కుల భవనాలు నిర్మిస్తామని ఆఫర్ ఇస్తున్నది. కేవలం మాటలే కాకుండా బాండ్ పేపర్ పై రాసిస్తోంది. మీరు స్థలం చూసుకోండి మిగతా తతంగం మొత్తం మేము జరిపిస్తామని చెబుతోంది. నియోజవర్గంలోని మండలాల పరిధిలో ఇప్పటికే స్థల సేకరణ కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. కాగా గౌడ కులం, ముదిరాజు కులం లో ఉన్న ప్రజా ప్రతినిధులను టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పోటాపోటీగా కొనుగోలు చేస్తున్నాయి. ఆఫర్ల మీద ఆఫర్లు వస్తుండటంతో ఆ నాయకులు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాత్రికి రాత్రే పార్టీ కండువాలు మార్చుతున్నారు. స్థాయిని బట్టి ఒక్కో ఎంపిటిసి కి ఐదు నుంచి పది లక్షల దాకా ఇస్తున్నట్టు వినికిడి. ఇక సర్పంచ్, జడ్పిటిసి లాంటి వాళ్లకైతే పాతిక నుంచి 30 లక్షల దాకా ఇస్తున్నట్టు తెలుస్తోంది. కులమే గీటురాయిగా రకరకాల ప్రలోభాలకు తెరతీస్తున్న పార్టీలు.. మునుముందు రోజుల్లో ఎంతకైనా బరితెగిస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇన్నాళ్లూ తమను ఎవరూ పట్టించుకోలేదని.. ఇప్పుడు అంది వచ్చిన అవకాశాలను ఎందుకు వదులుకోవాలని కుల సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకున్నట్టు.. ఈ ఉప ఎన్నిక పుణ్యమా అని నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నామని చెబుతున్నారు.