Mulayam Singh Yadav Passed Away: సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ సోమవారం కన్నుమూశారు. గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతూ చేరారు. ఆ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు. 82 ఏళ్ళు.

ఆరోగ్యం క్షీణించడంతో..
ములాయం సింగ్ యాదవ్ మూత్రనాళ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు. గత నెల 22 నుంచి గురు గ్రామ్ లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వరుసగా చాలా రోజులు వెంటిలేటర్ పై ఉన్న ములాయం సింగ్ యాదవ్ కు డాక్టర్ యతిన్ మెహతా చికిత్స అందించారు.
ఆరోగ్య పరిస్థితి విషించడంతో ఆయన కన్నుమూశారు. వాస్తవానికి అక్టోబర్ రెండవ తేదీనే ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో వైద్యులు ఆయనను ఐసీయూలో చేర్పించారు. అప్పటి నుంచి సోమవారం ఉదయం దాకా లైఫ్ సపోర్ట్ సిస్టం లో ఉన్నారు. శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బంది పడ్డారు. ఇందుకోసం వైద్యులు రకరకాల ఔషధాలు ఆయనకు ఇచ్చినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. డాక్టర్ యతిన్ మెహతా తెలిపిన వివరాల ప్రకారం అక్టోబర్ రెండవ తేదీ నుంచి లైఫ్ సపోర్ట్ సిస్టం అంటే వెంటిలేటర్ పై ఉన్నారు. శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది పడ్డారు. దీంతోపాటు ఆయన కిడ్నీ కూడా సక్రమంగా పనిచేయడం లేదు. దీంతో ఎలాగైనా ఆయనను బతికించాలని మేదాంత ఆసుపత్రి వైద్యులు ఆక్సిజన్ ను మరింత లేబుల్ చేశారు. దాదాపు మూడు గంటల పాటు 24 మంది వైద్యులు తీవ్రంగా శ్రమించారు. కానీ అతని పరిస్థితి అంతకంతకు విషమించడం మొదలుపెట్టింది. చివరకు దేహంలోని అన్ని అవయవాలు విఫలమయ్యాయి. దీంతో ఆయన కన్నుమూశారు. ములాయం సింగ్ యాదవ్ మరణ వార్తను సమాజ్వాది పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ట్వీట్ ద్వారా ధ్రువీకరించారు.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో చెరగని ముద్ర
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ములాయం సింగ్ యాదవ్ చెరగని ముద్ర వేశారు. 1939 నవంబర్ 22 లో యాదవుల కుటుంబంలో జన్మించిన ములాయం.. మూడుసార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. కేంద్రంలో రక్షణ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. లోక్ సభలో మెయిన్ పూరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. అంతకుముందు అజంఘడ్, సంభాల్ నియోజకవర్గాల పార్లమెంటు సభ్యుడిగా కూడా పనిచేశారు. ములాయం సింగ్ యాదవ్ మొదటిసారిగా 1989లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. 1990లో నవంబర్లో వీపీ సింగ్ జాతీయ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ములాయం సింగ్ యాదవ్ చంద్రశేఖర్ నాయకత్వంలోని జనతా దళ్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు.

జాతీయస్థాయిలో చంద్రశేఖర్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న కాంగ్రెస్.. 1991 ఏప్రిల్ లో ములాయం సింగ్ ప్రభుత్వానికి కూడా తన మద్దతును ఉపసంహరించుకుంది. దీంతో యాదవ్ ప్రభుత్వం పడిపోయింది. 1991లో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. ఇందులో ములాయం సింగ్ పార్టీ ఓడిపోయి, బిజెపి అధికారాన్ని దక్కించుకుంది. ఇక కొంతకాలంగా పార్టీపై అఖిలేష్ యాదవ్ పెత్తనం పెరగడంతో ములాయం సైలెంట్ అయిపోయారు. మొన్న జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయారు. ఫలితంగానే యాదవులంతా తమ ఓట్లను బిజెపికి వేయడంతో యోగి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాగా ములాయం మరణాన్ని సమాజ్ వాది పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణంతో రాష్ట్రమంతా శోకసంద్రంలో మునిగిపోయింది.