హుజురాబాద్ ఉప ఎన్నికపై (Huzurabad By-Election) పార్టీలు ప్రస్తుతం నిశ్శబ్దం పాటిస్తున్నాయి. నేడే రేపో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని భావిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు పరిస్థితిని గమనిస్తూ అడుగులు వేస్తున్నాయి. ఇన్నాళ్లు ప్రచారంలో (campaign) హోరెత్తించిన పార్టీలు ప్రస్తుతం స్తబ్దుగా మారిపోయాయి. సీఎం కేసీఆర్ ప్రారంభించిన దళితబంధు పథకం తరువాత టీఆర్ఎస్ నేతలంతా ఎవరి ప్రాంతాలకు వారు వెళ్లిపోయారు. ఇప్పటిదాకా నియోజకవర్గ బాధ్యతలు చేపట్టిన హరీశ్ రావు సైతం మకాం మార్చారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకు హైదరాబాద్ నుంచే కార్యకలాపాలు సాగించనున్నట్లు తెలుస్తోంది.
నియోజకవర్గాల ఇన్ చార్జులు కూడా స్థానికంగా ఉండకుండా వెళ్లిపోయారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కూడా ప్రచారం చేయడం లేదు. ఇంతవరకు ప్రచారంలో అన్ని పార్టీలు హోరెత్తించినా ఒక్కసారిగా మూగనోము పాటిస్తున్నాయి. దీనికి కారణం ఇప్పట్లో హుజురాబాద్ ఉప ఎన్నిక ఉండదనే విషయం తెలియడంతో ఇలా చేస్తున్నాయని తెలుస్తోంది. ఇప్పటివరకు ఈటల రాజేందర్ భార్య జమున ప్రచారం చేసినా ఆమె కూడా విశ్రాంతి తీసుకుంటున్నారు.
కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ అభ్యర్థిని ప్రకటించలేదు. టీఆర్ఎస్, బీజేపీకి సమ ఉజ్జీలైన వారిని నియమించాలని చూస్తున్న పార్టీకి అభ్యర్థి కనిపించడం లేదు. అయితే కొండా సురేఖను ప్రకటించాలని చూస్తున్న క్రమంలో ఆమెను అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. దీంతో మాదిగ నేతకు టికెట్ ఇవ్వాలని కోరడంతో పార్టీ ఏమేరకు నిర్ణయం తీసుకుంటుందో తెలియడం లేదు.
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాతే ప్రచారం ముమ్మరం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రచారంలో పార్టీలు ఇంతవరకు ప్రచారం చేసినా అభ్యర్థులు మాత్రం ముందుకు రాలేదు. ఒక్క ఈటల రాజేందర్ తప్ప మిగతా పార్టీల నాయకులు ప్రచారంలో పాల్గొనలేదు. దీంతో హుజురాబాద్ మొత్తం ఇప్పుడు ప్రశాంతంగా మారిపోయింది. మొత్తానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్ కోసమే అన్ని పార్టీలు ఎదురు చూస్తున్నాయని తెలుస్తోంది.