
నటీనటులుః సునీల్, సుక్రాంత్, వైశాలి రాజ్, హిమజ, యుగ్ రామ్, శశిత, నీలిమ, తదితరులు
నిర్మాణంః ఎస్.ఎస్. ఫిల్మ్స్, శ్రీపాద క్రియేషన్స్, షేడ్ స్టూడియోస్
సంగీతంః మధు పొన్నాస్
దర్శకత్వంః బాలరాజు
రిలీజ్ః 19-08-2021
హీరోగా నిలబడేందుకు సునీల్ చాలా ప్రయత్నాలే చేశాడు. కానీ.. సక్సెస్ వరించలేదు. దీంతో.. వెనక్కు వచ్చేశాడు. అరవింద సమేత, అలవైకుంఠపురములో వంటి చిత్రాల్లో చిన్న పాత్రలు చేశాడు. చాలా గ్యాప్ తర్వాత మరోసారి సునీల్ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం ‘కనబడుటలేదు’. మరి, ఈ సినిమా సునీల్ కు ఎలాంటి బ్రేక్ ఇచ్చింది? ఎంత వరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది? అన్నది చూద్దాం.
కథః రామకృష్ణ (సునీల్) డిటెక్టివ్ గా పనిచేస్తుంటాడు. విశాఖ పట్నానికి చెందిన సూర్య (సుక్రాంత్) అనే వ్యక్తి కనిపించకుండా పోవడంతో.. అతని కేసు టేకప్ చేస్తాడు. అయితే.. ఈ క్రమంలోనే ఓ జంట వైజాగ్ చేరుకుంటుంది. భార్యాభర్తలిద్దరూ (యుగ్ రామ్, వైశాలిరాజ్) వచ్చింది ఎందుకంటే.. సూర్యను చంపడానికి! సూర్యను వీళ్లెందుకు చంపాలనుకుంటున్నారు? అతనికి వీళ్లకు సంబంధమేంటీ? అసలు సూర్య ఏమయ్యాడు? డిటెక్టివ్ రామకృష్ణ సూర్యను కనిపెట్టాడా? అన్నది మిగిలిన కథ.
విశ్లేషణః క్రైమ్ థ్రిల్లర్ అనేది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ జోనర్. సరైన కథ ఎంచుకొని, ప్రేక్షకుడి ఊహకు అందకుండా నడిపిస్తే చాలు.. గ్యారంటీగా బొమ్మ హిట్టు అందుకుంటుంది. ‘కనబడుటలేదు’ చిత్రానికి మంచి కథే దొరికింది. కానీ.. దాన్ని నడిపించిన తీరు ఆకట్టుకోలేకపోయింది. హత్య ఎప్పుడైనా ఆధిపత్యం కోసం జరుగుతుంది.. తీవ్రమైన ఆవేదనతో జరుగుతుంది. ఈ చిత్రంలో రెండో కారణంతో సూర్యను చంపడానికి వస్తారు భార్యాభర్తలు. అయితే.. హత్య చేయాలంటే దానికి తగిన కారణాన్ని చూపించాలి. ప్రేక్షకుడు దాన్ని అంగీకరించగలగాలి. కానీ.. ఇక్కడ అది లోపించినట్టుగా అనిపిస్తుంది. క్రైమ్ చుట్టూ పాత్రలను బాగానే అల్లుకున్నప్పటికీ.. వాటిని కథలో సరిగా లీనం చేయలేకపోయాడు దర్శకుడు. కథను మొదలు పెట్టడం.. కొన్ని ట్విస్టులను చూపించడంలో పర్వాలేదనిపించినప్పటికీ.. కథ ముందుకు సాగుతున్నకొద్దీ.. పట్టాలు తప్పినట్టుగా అనిపిస్తుంది. ఈ క్రైమ్ కు కామెడీని జత చేయడం కూడా సరిగా పొసగలేదు. ఈ రెండింటినీ మేళవించడంలో దర్శకుడు తడబడినట్టుగా కనిపిస్తుంది.
పెర్ఫార్మెన్స్ః ఈ చిత్రానికి సునీల్ తోనే హైప్ వచ్చింది. దాన్ని చిత్రంలోనూ చూపించాడు. తనదైన నటనతో సినిమాను మోసుకెళ్లాడు. అయితే.. దర్శకుడి నుంచి సరైన సహకారం లభించలేదు. మిగిలిన పాత్రధారులు వైశాలి రాజ్, సుక్రాంత్, హిమజ కూడా చక్కగా నటించారు. ఇక, సినిమాకు మరో బలం సంగీతం, కెమెరా. ఈ రెండు విభాగాలు చక్కగా పనిచేశాయి. దర్శకుడు కథపై ఇంకా దృష్టి పెడితే బాగుండేది అన్న ఫీలింగ్ కలుగుతుంది. చాలా చోట్ల రొటీన్ సన్నివేశాలు చూసినట్టుగా అనిపిస్తుంది.
బలాలుః సునీల్, వైశాలి రాజ్, కొన్ని ట్విస్టులు
బలహీనతలుః కథనం, రొటీన్ సన్నివేశాలు, కుదరని ఎమోషన్స్
లాస్ట్ లైన్ః విజయావకాశాలు ‘కనబడుటలేదు’
రేటింగ్ః 2/5