
తెలంగాణ సీఎం కేసీఆర్.. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళతారనే ఊహాగానాలు సాగుతుండడంతో అందుకు తగ్గట్టుగా ప్రతిపక్షాలు సమాయత్తమవుతున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ తోపాటు బీజేపీ కూడా అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఇప్పటినుంచే కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పటికే వివిధ నియోజకవర్గాల నుంచి సమాచారం తెప్పించుకుంటున్నట్లు, ఆయా స్థానాలకు అభ్యర్థుల ఎంపిక దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీ కూడా ఆ దిశగా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.ప్రస్తుతం రాష్ట్రంలో పాదయాత్రలో ఉన్న బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్.. తాను పర్యటించిన నియోజకవర్గాల్లలో నేతల పనితీరు, టికెట్ ఎవరికి ఇవ్వాలనే అంశాలపై ఆరా తీస్తున్నారు.
ఇప్పటివరకు 22 అసెంబ్లీ, 6 లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో సంజయ్ పాదయాత్ర జరిగింది. ఈ క్రమంలోనే పార్టీ తరఫున ఉత్సాహంగా పని చేస్తున్నవారెవరన్న దానిపై ఆయన అంచనాకు వస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం నాలుగు విడతల్లో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుండగా, మొదటి విడత అక్టోబరు 2న ముగియనుంది. పాదయాత్రలో భాగంగా అభ్యర్థుల ఎంపికపైకూడా కసరత్తు చేస్తున్నామనే సంకేతాలు ఇవ్వడం ద్వారా మిగిలిన మూడు విడతల్లో యాత్రకు ఆయా నియోజకవర్గాల్లోని ఆశావహులు, పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పనిచేస్తారనే వ్యూహం కూడా ఇందులో ఉన్నట్టు తెలుస్తోంది.
పైగా అధికార టీఆర్ఎస్ నుంచి కొద్ది మంది మినహా ఎక్కువ మంది సిటింగ్ ఎమ్మెల్యేలే బరిలోకి దిగే అవకాశం ఉందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు టీపీసీసీ చీఫ్ కూడా ముందస్తు ఎన్నికలు వస్తాయన్న అంచనాతో కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. దీంతో ఆ రెండు పార్గీలకు దీటుగా ఎన్నికలకు సమాయత్తం కావాలంటే అభ్యర్థులకు తగినంత సమయం అవసరం అవుతుందని, అందుకు ఇప్పటినుంచే ఎంపిక ప్రక్రియను ప్రారంభించడం మంచిదని భావిస్తున్నారు.
అయితే ముందుగానే అభ్యర్థులను ఎంపిక చేయడం వల్ల నష్ఠం కూడా జరగవచ్చన్న అభిప్రాయాలున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డవారు ఇతర పార్టీల్లోకి వెళ్లే అవకాశాలుంటాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా టికెట్ కోసం నేతల ఎటుంటి పోటీ లేని చోట్ట అభ్యర్థులను ప్రకటించాలని, మిగిలిన చోట్ల సంకేతాలను మాత్రమే ఇవ్వాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం పార్టీ తరఫున సిటింగ్ ఎమ్మెల్యేలున్న గోషామహల్,దుబ్బాకతోపాటు వికారాబాద్, ఆంధోల్, ఎల్లారెడ్డి, హుజూరాబాద్ వంటి నియోజకవర్గాలకు అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మిగిలి నియోజకవర్గాలకు సంజయ్ పాదయాత్ర ద్వారానే అంచనాకు రానున్నట్లు సమాచారం.