Vangaveeti Radha- Paritala Sriram: ఏపీలో బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి. అయితే ఆ జాబితాలో అగ్రస్థానంలో ఉండేవి వంగవీటి, పరిటాల కుటుంబాలు. రెండు అత్యంత శక్తివంతమైన కుటుంబాలే. అయితే ఆ రెండు కుటుంబాలకు చెందిన యువ నాయకులిద్దరూ ఒకచోట కలవడం ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. వంగవీటి రాధా, పరిటాల శ్రీరామ్ లు ఆదివారం రాజమండ్రిలో కలుసుకున్నారు. రోజంతా కలిసే ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ టీడీపీలో ఉన్నారు. అమరావతి రైతుల పాదయాత్ర రాజమండ్రిలో అడుగుపెడుతున్న తరుణంలో సంఘీభావం తెలిపేందుకు ఇద్దరు నాయకులు వచ్చారు. కానీ వీరి కలయికపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. వంగవీటి రాధా టీడీపీలో ఏమంత కంఫర్టుగా లేరు. ఆయన త్వరలో జనసేనలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలో శ్రీరామ్ కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

గత ఎన్నికల ముందు రాధా వైసీపీని వీడి టీడీపీలో చేరారు. టిక్కెట్ విషయంలో వచ్చిన పేచీతో వైసీపీని దూరం చేసుకున్నారు. ఎంపీ సీటు ఆఫరు ఇచ్చినా.. అప్పట్లో వైసీపీ కీలక నేతలు సముదాయించినా వినలేదు. టీడీపీలో ఎలక్షన్ క్యాంపెయినర్ గా పనిచేశారు. కానీ టీడీపీ ఓటమి చవిచూసింది. అప్పటి నుంచి సైలెంట్ అయ్యారు. టీడీపీలో ఉన్నా అంత యాక్టివ్ గా లేరు. అటు అనంతపురంలో పరిటాల కుటుంబానికి సైతం పరాభవం ఎదురైంది. ప్రస్తుతం అక్కడ అధికార పార్టీ స్పీడుకు తట్టుకోలేకపోతోంది ఆ కుటుంబం. ఈ నేపథ్యంలో పరిటాల కుటుంబం సైతం ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను చూసుకుంటుందన్న ప్రచారం అయితే ఉంది. ఇటువంటి తరుణంలో రాధాతో శ్రీరామ్ భేటీ కావడంతో వారి మధ్య ఎటువంటి చర్చలు జరిగి ఉంటాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

వంగవీటి రాధాక్రిష్ణ జనసేనలో చేరుతారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ రాధాతో చర్చలు సైతం జరిపారు. అటు పవన్ జన్మదిన వేడుకల సమయంలో, వంగావీటి మోహన్ రంగా జయంతి, వర్ధంతి వేడుకల సమయంలో పవన్, రాధాల ఫ్లెక్సీలు విజయవాడలో దర్శనమిచ్చాయి. ఈ నేపథ్యంలో రాధా జనసేనలో చేరిక ఖాయమన్న టాక్ నడుస్తోంది. అటు పరిటాల శ్రీరామ్ సైతం పవన్ వెంట నడిచేందుకు మొగ్గుచూపుతున్నారన్న ప్రచారం ఉంది. దీంతో ఈ ఇద్దరు నేతలు రాజమండ్రిలో కీలక చర్చలు జరిపారని పొలిటికల్ సర్కిల్లో చర్చ అయితే నడుస్తోంది. ఈ ఇద్దరి వ్యవహారం మరికొద్దిరోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశముందని,.. వీరిద్దరూ జనసేన గూటికి చేరడం ఖాయమని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.