ABN RK Kotha Paluku: ప్రస్తుత పరిస్థితుల్లో ఒక పేపర్ నడపడం చాలా కష్టంతో కూడుకున్న పని. అందులో మూతపడ్డ ఒక పేపర్ ను తిరిగి ప్రారంభించి 20 ఏళ్ల పాటు మల్టీ ఎడిషన్లతో నడిపించడం అంటే మామూలు విషయం కాదు. బహుశా భారతదేశ మీడియా చరిత్రలో ఇటువంటి సంఘటన ఎక్కడా జరిగి ఉండకపోవచ్చు. కానీ అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన చేసిన ఘనత ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి వేమూరి రాధాకృష్ణ కు దక్కుతుంది. ఆంధ్రజ్యోతి పున: ప్రారంభించి అక్టోబర్ 15 నాటికి 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా రాధాకృష్ణ ప్రతి ఆదివారం తాను రాసే కొత్త పలుకులో తన స్వీయానుభవాలు రాస్కొచ్చారు. తాను పత్రిక ప్రారంభించినప్పుడు ఎదుర్కొన్న సవాళ్ళను, వచ్చిన రాజకీయ ఒత్తిళ్ళను చెప్పుకుంటూ పోయారు. కానీ ఇదే సందర్భంగా ఏపీలో తాను జగన్ కు లొంగిపోతే 300 కోట్ల దాకా వచ్చేవని బాంబు పేల్చారు.” ఈ మూడున్నర సంవత్సరాలలో ఏం జరిగిందో, జరుగుతున్నదో చూస్తున్నాం కదా? జగన్ తో రాజీ పడేందుకు సిద్ధంగా ఉంటే ఈ మూడున్నర సంవత్సరాలలో “ఈనాడు”, “సాక్షి” తరహా లోనే ఆంధ్రజ్యోతికి కూడా 300 కోట్ల ఆదాయం వచ్చి ఉండేది. అంత పెద్ద మొత్తం కోల్పోవడానికి సిద్ధపడ్డాం. కానీ పాత్రికేయాన్ని అమ్ముకో దలుచుకోలేదు” అని రాసుకొచ్చారు. ఆర్కే రాసింది నిజమే అనుకుందాం. ప్రభుత్వాలతో రాజీపడి ఉంటే ఆదాయం ఆయన చెప్పినట్టు ఇబ్బడి ముబ్బడిగా వచ్చి ఉండేది అనుకుందాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి, ఈనాడు సంస్థలు భారీగా ఆదాయాన్ని సమకూర్చుకున్నాయనే కదా సాక్షి విమర్శ చేస్తుంది. దీనికి ఇంతవరకు రాధాకృష్ణ కౌంటర్ ఇవ్వలేదు. ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నేరుగా టార్గెట్ చేస్తున్నారు.

స్వయంగా రాసుకున్న మాటలే
మూతపడిన పత్రికను ఒక ఉద్యోగి తిరిగి తెరిచి, ధైర్యంగా నిలిచి, 20 సంవత్సరాలుగా స్థిరంగా నిలబడటం అంటే మామూలు విషయం కాదు. ఈనాడు వంటి పత్రికను తట్టుకొని నిలబడి, మధ్యలో వచ్చిన సాక్షిని తట్టుకుని, కంటూ ఒక లైన్ క్రియేట్ చేసుకుని, అవసరం ఉన్నప్పుడు నిజంగా తలవంచకుండా నిలబడిన తీరును కచ్చితంగా అభినందించాల్సిందే. కాకపోతే ఇదే వ్యాసంలో మాకు ఏ రాజకీయ కోణాలు లేవనే ఆర్కే మాటల్ని ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. ప్రారంభ సంచిక లోనే చంద్రగ్రహణం అనే శీర్షికతో మేము వార్త ప్రచురించాం అని రాధాకృష్ణ చెప్పుకోవచ్చు.. కానీ చంద్రబాబుతో ఆయనకున్న సానిహిత్యం ఇవాల్టికి జర్నలిజం సర్కిల్లో అందరికీ తెలుసు. వాస్తవానికి 300 కోట్లకు నేను లొంగలేదు అని ఆర్కే చెబుతున్నారంటే.. పరోక్షంగా రామోజీరావు హేళన చేస్తున్నట్టే లెక్క! జగన్, రామోజీరావు కలవడం అసత్యం కాదు. చాలా సంవత్సరాలు జగన్ మీద రామోజీ ఏమీ రాయనివ్వలేదు.. విసరనివ్వలేదు.. ఇప్పుడు ఎక్కడ తేడా వచ్చిందో గాని.. ఈనాడు శరభ శరభ అంటూ జగన్ మీదికి చర్నాకోలు పట్టుకొని నడివీధిలో పోతరాజు మాదిరి మీది మీదికి వస్తోంది. ఇదే సమయంలో కేసీఆర్, రాధా కృష్ణ ప్రాణ స్నేహితులు. ఎప్పుడు, ఎక్కడ బెడిసి కొట్టిందో గాని.. ఆయన చానల్ ను కెసిఆర్ నిషేధిస్తాడు. ప్రభుత్వపరంగా ప్రకటనలు ఇవ్వడు.. జూబ్లీహిల్స్ లో ఆఫీస్ కాలిపోతే అందరికన్నా ముందే వెళ్లి ఆర్కే ను అలముకుంటాడు. వేల గజాల భూమి ఉచితంగా ఇస్తానంటాడు.

అక్కడెక్కడో బస్సు ప్రమాదంలో 53 మంది మరణిస్తే అటువైపు కన్నెత్తి కూడా చూడని కేసీఆర్.. ఇక్కడ ఈ ఆఫీస్ కాలిపోతే మాత్రం నానా హైరానా పడ్డాడు. కెసిఆర్, బంధం మిస్టరీ ఏమిటో ఎవరికీ అర్థం కాదు. వాళ్లకైనా సరిగ్గా అర్థం అవుతుందా అనేది కూడా డౌటే. ఇక ఆర్కే చెప్పినట్టు తమకు ఏ పొలిటికల్ వాసనలు లేవనేది పూర్తి అబద్ధం. ఒకవేళ గనుక అదే నిజమైతే రాహుల్ గాంధీని ఎందుకు కలిసినట్టు? చంద్రబాబు వార్తలకు ఎందుకు ప్రయారిటీ ఇస్తున్నట్టు? సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తో ఉన్న సంబంధం ఏంటి? షర్మిల పాదయాత్రకు దక్కుతున్న ప్రాధాన్యం, జగన్ వార్తలకు ఎందుకు దక్కదు? తుమ్మల నాగేశ్వరరావు ఏం చేసినా తాటికాయంత అక్షరాలతో వార్తలు ఎందుకు అచ్చేస్తున్నట్టు? ఎర్రబెల్లి పై ఎందుకు ఈగ వాలనియ్యవరు? ఇవన్నీ బుర్రను తొలిచేసే ప్రశ్నలే! అలాగని సమాధానం లేని గొట్టు ప్రశ్నలు కావు. అర్థం చేసుకున్న వాళ్లకు అర్థం చేసుకున్నంత! ఇన్ని సుద్దులు చెప్పిన రాధాకృష్ణ.. కోవిడ్ సమయంలో ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా బయటకు తొలగించింది వాస్తవం కాదా?! ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా మూడేళ్లపాటు ఉద్యోగులకు నరకం చూపింది నిజం కాదా? కోవిడ్ వల్ల ఎంతో మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతే సంస్థ తరఫున చిల్లిగవ్వయినా ఇచ్చారా? ఇవాల్టికి పొద్దున లేస్తే మోడీని విమర్శించే రాధాకృష్ణ.. తన సంస్థలో కోవిడ్ కు బలైన ఉద్యోగులను ఆదుకున్నది ఆ మోడీ ప్రభుత్వమే. అన్నింటికీ మించి మోదీ మీద అవాకులు చవాకులు పేలే ఆ పత్రిక “ఎర్ర” ఎడిటర్ కు ఇంతకీ ఈ విషయం తెలుసో తెలియదో!?