Pan card fraud : పాన్ కార్డ్ అప్‌డేట్ చేయమని మీకు మెసేజ్ వచ్చినట్లయితే, జాగ్రత్తగా ఉండండి! ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని కొత్త ఫిషింగ్ స్కామ్ (PAN కార్డ్ స్కామ్) అమలు చేస్తుంది. పాన్ కార్డ్ చాలా ముఖ్యమైనది. కానీ స్కామర్లు దీన్ని ఆసరాగా తీసుకొని స్కాములు కూడా చేస్తున్నారు. స్కామర్లు తరచుగా వ్యక్తులను ట్రాప్ చేసి వారి పాన్ కార్డ్ వివరాలను పొందడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఈ IPPB ఇలాంటివి కేవలం నకిలీ మాత్రమే అని వాటిని నమ్మద్దు అని తెలిపింది. తెలియని లింక్‌పై క్లిక్ చేయడం లేదా వ్యక్తిగత వివరాలను పంచుకోవడం మానుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు అధికారులు.
పాన్ కార్డ్ స్కామ్ ఎలా జరుగుతోంది?
మోసగాళ్లు ఫేక్ మెసేజ్‌లు పంపి కస్టమర్లను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మీ పాన్ కార్డును వెంటనే అప్‌డేట్ చేయకపోతే, మీ బ్యాంక్ ఖాతా బ్లాక్ అవుతుందని భయపెడతారు. దాని కోసం ఓ నకిలీ లింక్ సెండ్ చేస్తారు. ఇక దానిపై క్లిక్ చేసిన తర్వాత వినియోగదారు నుంచి వ్యక్తిగత వివరాలు అడిగుతారు. ఈ లింక్ ద్వారా మోసగాళ్లు యూజర్ బ్యాంక్ అకౌంట్ నంబర్, పాస్‌వర్డ్, పాన్ కార్డ్ వివరాలను దొంగిలించడానికి ప్రయత్నిస్తారు.
చాలా సార్లు ఈ నకిలీ వెబ్‌సైట్‌లు నిజమైన బ్యాంక్ లేదా ప్రభుత్వ వెబ్‌సైట్‌ల వలె కనిపిస్తాయి. దీని కారణంగా ప్రజలు సులభంగా మోసపోతున్నారు. పాన్ కార్డ్ స్కామ్‌ను ఎలా నివారించాలి అనే సందేహం మీలో ఇంకా ఉండవచ్చు. అయితే అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దు. పాన్ అప్‌డేట్ చేయడానికి ఏదైనా లింక్ మీకు తెలియని నంబర్ లేదా ఇమెయిల్ నుంచి పంపిస్తే దాన్ని ఓపెన్ చేయకండి. మీరు అలాంటి ఏదైనా అప్‌డేట్ గురించి తెలుసుకోవాలనుకుంటే, IPPB కస్టమర్ కేర్ లేదా సమీపంలోని బ్రాంచ్‌ను నేరుగా సంప్రదించండి.
బలమైన పాస్‌వర్డ్‌లు: బ్యాంకింగ్ సేవల కోసం బలమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించాలి. వాటిని మారుస్తూనే ఉండాలి. ఎవరు గెస్ చేయని విధంగా పెట్టాలి. మరీ ముఖ్యంగా పబ్లిక్ Wi-Fiని అసలు ఉపయోగించవద్దు. పబ్లిక్ Wi-Fiకి లాగిన్ చేయడం వలన మీ ఫోన్ ను హ్యాకర్లు యాక్సెస్ చేయవచ్చు.
బ్యాంక్ స్టేట్‌మెంట్‌లపై నిఘా: మీకు ఏవైనా తెలియని లావాదేవీలు కనిపిస్తే, వెంటనే బ్యాంక్‌కి తెలియజేయండి. డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్నాయి. అయితే వాటిని జాగ్రత్తగా నివారించవచ్చు. PAN కార్డ్ స్కామ్ అనేది ప్రజలను మోసం చేయడానికి ఒక కొత్త మార్గం, కానీ మీరు తెలుసుకుంటే, మీరు ఈ మోసగాళ్ల బారి నుంచి తప్పించుకోవచ్చు. బ్యాంకులు లేదా ప్రభుత్వ సంస్థలు ఫోన్, SMS లేదా ఇమెయిల్ ద్వారా మీ వ్యక్తిగత వివరాలను ఎప్పుడూ అడగరని గుర్తుంచుకోండి. ఎవరైనా ఇలా చేస్తే మోసం చేస్తున్నారని, అది స్కామ్ కావచ్చు అని వెంటనే అనుమానించాలి.