
మహారాష్ట్రలోని పాల్ఘర్ లో ఏప్రిల్ 17 న దొంగతనం జరిగిందనే అనుమానంతో గ్రామస్తులు ముగ్గురు వ్యక్తులను కొట్టి చంపిన సంఘటనకు సంబంధించి కేంద్ర హోంశాఖ మహారాష్ట్ర ప్రభుత్వం నుండి నివేదిక కోరింది. కాసాలోని పాల్ఘర్ పోలీస్ స్టేషన్ యొక్క ఇద్దరు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు ఎస్పీ గౌరవ్ సింగ్ తెలిపారు. ఈ ఘటనపై 110 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది, వారిలో 101 మందిని ఏప్రిల్ 30 వరకు పోలీసు కస్టడీకి పంపారు మరియు 9 మంది మైనర్లను బాల్య ఆశ్రయ గృహాలకు పంపించారు.
అసలేమి జరిగింది…?
ఏప్రిల్ 17 రాత్రి 9.30 నుండి 10గంటల మధ్యలో ఒక వ్యానులో ముంబయి నుండి సూరత్ కి బయల్దేరిన సుశీల్ గిరి మహారాజ్ (35), నీలేష్ తెల్గేన్ (35), చికానే మహారాజ్ కల్పవ్రిక్షిగిరి (70) అనే ముగ్గురి వ్యక్తుల్ని పాల్ఘర్ గ్రామ ప్రజలు ఆపి విచక్షణ రహితంగా కొట్టి చంపారు. ఆ ముగ్గురిలో ఇద్దరు సాధువులు కాగా మూడో వ్యక్తి డ్రైవర్. అయితే అంతకంటే ముందే ఆ గ్రామంలోకి పిల్లల్ని కిడ్నాప్ చేసి, అవయవాలు అమ్ముకునే వారు వస్తున్నారనే వార్త వైరల్ అయింది. దింతో ఆ గ్రామస్థులు మెలకువగా ఉండి సూరత్ లో అంత్యక్రియలకు వెళ్తున్న వ్యానిని ఆపి అనుమానంతో దాడి చేశారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకి చేరుకొని వారిని రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. గ్రామస్థులందరు ఒక్కసారిగా దాడి చేయడంతో ఒక వ్యక్తి అక్కడే ప్రాణాలు కోల్పోగా ఇద్దరు సమీప ఆసుపత్రిలో ప్రాణాలు విడిచారు.ఆ ముగ్గురి పై దాడి చేసిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ కావడంతో.. కేంద్ర హోమ్ శాఖ నివేదిక ఇవ్వాలని ఉద్ధవ్ ప్రభుత్వన్ని కోరింది.