Pakistan: శాంతి భద్రతలు కాపాడలేరు.. ఎన్నికలు సజావుగా నిర్వహించలేరు.. మరేం చేస్తారు?

ప్రజలు ఆరోపిస్తున్నట్టుగానే తన ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందని ఇటీవల ఓ సీనియర్ అధికారి రాజీనామా చేశాడు. బ్యాలెట్ విధానంలో ఎన్నికల నిర్వహించడం వల్ల ఓడిన అభ్యర్థులను బలవంతంగా విజేతలుగా ప్రకటించామని...

Written By: Anabothula Bhaskar, Updated On : February 19, 2024 2:00 pm
Follow us on

Pakistan: “ఎన్నికలు సరిగ్గా నిర్వహించలేరు. శాంతిభద్రతలను కాపాడలేరు.. దేశంలో అభివృద్ధి నిలిచిపోయింది. కనీసం తినేందుకు బుక్కెడు బువ్వ కూడా దొరకడం లేదు.. రోజుకోచోట బాంబుల మోత వినిపిస్తోంది. పర్యాటకంగా ఇతర ప్రాంతాల వారు మన దేశానికి వచ్చే పరిస్థితి లేదు. సరిహద్దుల్లో ఇతర దేశాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. ఇలాంటప్పుడు మీకేం చేతనవుతుంది? మీ వల్ల ఏమవుతుంది?” ఇవీ పాకిస్తాన్ దేశంలో అక్కడి ప్రభుత్వం, సైన్యానికి ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తూ అక్కడి ప్రజల నిరసనబాట పట్టారు. వాస్తవానికి ఎన్నికల ఫలితాలలో ప్రభుత్వం మాట మార్చడం.. ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేసే విధంగా వ్యాఖ్యలు చేయడంతో ప్రజల్లో అనుమానాలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి పలు దృశ్యాలు కనిపించడంతో ఒక్కసారిగా ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ముఖ్యంగా రావల్పిండి ప్రాంతాల్లో ప్రజలు భారీగా రోడ్లమీద చేరుకున్నారు. అక్కడి సైన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ప్రభుత్వం పై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రజలు ఆరోపిస్తున్నట్టుగానే తన ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందని ఇటీవల ఓ సీనియర్ అధికారి రాజీనామా చేశాడు. బ్యాలెట్ విధానంలో ఎన్నికల నిర్వహించడం వల్ల ఓడిన అభ్యర్థులను బలవంతంగా విజేతలుగా ప్రకటించామని ఆయన చెప్పడం పెను దుమారాన్ని రేపుతోంది. పాకిస్తాన్ ఎన్నికల రిగ్గింగ్ పై విచారణ జరిపేందుకు ఎన్నికల సంఘం ఒక అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. అదే కాదు ఈ రిగ్గింగ్ వెనకాల సీఈసీ, సీజే హస్తం ఉందని కొత్త విమర్శలు వినిపిస్తున్నాయి.

పాకిస్తాన్ దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికలు జరిపి కొత్త ప్రభుత్వం ఏర్పడితేనే బాగుంటుందని చాలామంది భావించారు. వారు కోరుకున్నట్టుగానే అక్కడ ఎన్నికలు జరిగాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడితే సమస్యలు పరిష్కారమవుతాయని అనుకుంటే.. కొత్త సమస్యలు తెరపైకి రావడంతో పాకిస్తాన్ మరింత సతమతమవుతోంది. ఎన్నికల్లో 13 మంది అభ్యర్థులు ఓడిపోయినప్పటికీ వారిని విజేతలుగా ప్రకటించామని ఇటీవల రాజీనామా చేసిన అధికారి వెల్లడించారు. ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో కిస్తాన్ దేశంలోని రావల్పిండి ప్రాంతంలో ప్రజలు భారీగా రోడ్లమీదకి వచ్చి నిరసన తెలిపారు. అక్కడ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో.. సోషల్ మీడియాలో ఆంక్షలు మొదలయ్యాయి. ఫేక్ వీడియోలతో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందించే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే పాక్ లో ట్విట్టర్ ఎక్స్ సేవలు నిలిచిపోయినట్టు తెలుస్తోంది. అదే కాదు ఈ అక్రమాల వ్యవహారంలో పాకిస్తాన్ ఎన్నికల సంఘం, చీఫ్ జస్టిస్ ప్రమేయం ఉన్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆరోపణలలో పాకిస్తాన్ ఎన్నికల సంఘం ఖండించింది. ఇక ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి కమిటీ పలు జిల్లాల్లో ఎన్నికల అధికారుల నుంచి వాంగ్మూలాలు సేకరిస్తున్నది. వాటి ఆధారంగా మూడు రోజుల్లో నివేదికను ఎన్నికల సంఘానికి సమర్పిస్తుంది. గత వారం జరిగిన పాకిస్తాన్ ఎన్నికల్లో అత్యధికంగా మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పీటీఐ మద్దతు ఉన్న 93 మంది అభ్యర్థులు విజయం సాధించారు. అయితే మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో బిలావల్ భుట్టో నేతృత్వంలోని పీపీపీ.. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్_ఎన్ .. మరికొన్ని పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. మొదట నవాజ్ షరీఫ్ ప్రధానిగా బాధితులు చేపడతారని వార్తలు వచ్చినప్పటికీ.. గత పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యం జోక్యం చేసుకుంది. నవాజ్ షరీఫ్ సోదరుడు షహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రి పదవి చేపట్టేందుకు సిద్ధమయ్యారు.