AP Government Employees: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు జగన్ సర్కార్ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో ఈ రెండు వర్గాల్లో 99 శాతం మంది ఒకే అభిప్రాయంతో ఉండడం విశేషం. ముఖ్యంగా జిపిఎస్ అంశంలో జగన్ ప్రభుత్వ తీరుపై రగిలిపోతున్నారు. సిపిఎస్ రద్దు హామీ విషయంలో జగన్ మడత పేచీ వేయడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిపిఎస్ అమలు విషయంలో ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు. ఇది ముమ్మాటికి ఉద్యోగులను వంచించడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జిపిఎస్ నకు సంబంధించి అసెంబ్లీలో బిల్లు కూడా ప్రవేశపెట్టారు. దీంతో ఉద్యోగులకు న్యాయం జరుగుతుందని చెప్పుకొస్తున్నారు. కానీ ఈ బిల్లులో ఉన్న రిటైర్మెంట్ అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ పథకం ప్రయోజనం పొందాలంటే ఎంత సర్వీస్ ఉండాలన్న అంశంపై బిల్లులో స్పష్టంగా పేర్కొన్నారు. 33 ఏళ్ల అర్హత సర్వీసు ఉంటేనే జిపిఎస్ పథకం కింద గ్యారెంటీ పెన్షన్ ప్రయోజనాలు అందుతాయని బిల్లులో పొందుపరిచారు. ఇప్పుడు 33 ఏళ్ల సర్వీస్ నిబంధన ఉద్యోగుల్లో కాక రేపుతోంది. ఒకవేళ 33 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే ఉద్యోగి వయస్సు 62 ఏళ్లు వస్తే ఇంటికి పంపియడమే జిపిఎస్ ముఖ్య ఉద్దేశ్యం.అటువంటి సమయంలో గ్యారెంటీ పెన్షన్ పథకం ఎలా అమలవుతుందన్నదే ఉద్యోగుల ప్రశ్న.
ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన జిపిఎస్ బిల్లు వెనుక కుట్ర కోణం ఉందని ఉద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలు. సాధారణంగా సర్వీసుతో పదవీ విరమణకు సంబంధం లేదు. కానీ కొత్తగా ప్రజా ప్రయోజనాల మేరకు ఉద్యోగులను పదవి విరమణ చేయించడం అనే కాన్సెప్ట్ మాత్రం ఉద్యోగుల చరిత్రలోనే వినలేదు. ఇప్పుడు ఈ జిపిఎస్ నకు సంబంధించి పింఛన్ రూల్స్ లో ఈ నిబంధన చేర్చడంపై ఉద్యోగుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ బలవంతంగా రిటైర్మెంట్ చేయిస్తే.. అప్పటికి 33 ఏళ్ల సర్వీసు పూర్తికాని వారి పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీంతో ఉద్యోగుల్లో ఒక రకమైన ఆందోళన నెలకొంది.
అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని నాడు విపక్ష నేతగా జగన్ చెప్పుకొచ్చారు. ఏరా అధికారంలోకి వచ్చిన తర్వాత సిపిఎస్ రద్దు విషయం మర్చిపోయారు. తనకు తెలియకుండానే హామీ ఇచ్చానని.. పొరపాటు జరిగి పోయిందని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. సిపిఎస్ రద్దు అనేది సాధ్యం కాని పనిగా తేల్చేశారు. ఆ బాధ నుంచి తీరుకోక ముందే.. ఇప్పుడు జిపిఎస్ తో తమపై కుట్ర చేస్తున్నారని.. తమ పరిస్థితి పొయ్యి నుంచి పెనంలో పడినట్లు అయ్యిందని ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో గట్టిగా గుణపాఠం చెప్పాలని భావిస్తున్నారు.