Uttarandhra Politics: ఉత్తరాంధ్రలో ఈసారి సీఎం జగన్ కొత్త వ్యూహానికి తెర లేపారా? భారీగా అభ్యర్థులను మార్చనున్నారా? కొందరు సిట్టింగులకు మొండి చేయి చూపునున్నారా ? ఆ జాబితాలో కీలక నేతల సైతం ఉన్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాలకు గాను.. దాదాపు సగం నియోజకవర్గాల్లో కొత్తవారిని బరిలో దించుతారని ప్రచారం జరుగుతోంది. కొద్దిరోజుల కిందట పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులతో జరిగిన వర్క్ షాప్ లో జగన్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. కొందర్ని తప్పించడం ఖాయమని తేల్చి చెప్పారు. దీంతో రకరకాల ప్రచారాలు ప్రారంభమయ్యాయి.
ముఖ్యంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు ముఖం చాటేశారు. ఇంకొందరు స్థానిక పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకోలేకపోతున్నారు. సొంత పార్టీ శ్రేణుల నుంచే వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. నేతల మధ్య ఆధిపత్య కోరుకున్న నియోజకవర్గాల సైతం ఉన్నాయి. ఇటువంటి చోట్ల అభ్యర్థుల మార్పు అనివార్యమని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులు మారుతారని టాక్ నడుస్తోంది.
ఇచ్చాపురం నియోజకవర్గం లో గత ఎన్నికల్లో పిరియా సాయిరాజ్ పోటీ చేశారు. ఓటమి చవి చూశారు. ప్రస్తుతం ఆయన భార్య పిరియా విజయ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఉన్నారు. ఆమె అభ్యర్థి అవుతారని అంతా భావించారు. కానీ అక్కడ రాష్ట్రస్థాయిలో కార్పొరేషన్ పదవి దక్కించుకున్న మరో నాయకుడికి టికెట్ కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతిని తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. ఆమె తీరుపై నియోజకవర్గంలోని ఐదు మండలాల నాయకులు వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఆమె మార్పు అనివార్యంగా తెలుస్తోంది. ఆమదాలవలస నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తమ్మినేని సీతారాంకు సైతం ఈసారి టిక్కెట్ లేనట్టు తెలుస్తోంది. ఆయనపై 70 శాతం వరకు వైసీపీలో వ్యతిరేకత ఉందని హై కమాండ్ కు నివేదికలు అందాయి. ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ ను సైతం తప్పించనున్నట్లు తెలుస్తోంది. అక్కడ విజయనగరం జిల్లాకు చెందిన ఓ నేత పోటీకి దిగుతారని టాక్ నడుస్తోంది. రాజాం నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే కంబాల జోగులను తప్పించి.. ఓ డాక్టర్ను తెరపైకి తెచ్చినట్లు సమాచారం.
విజయనగరం జిల్లాకు సంబంధించి శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావును తప్పించనున్నట్లు తెలుస్తోంది. అక్కడ ప్రత్యామ్నాయ నేతగా ఇందుకూరి రఘురాజు ఉన్నారు. బొబ్బిలి నియోజకవర్గం ఎమ్మెల్యే శంబంగి చిన్న వెంకట అప్పలనాయుడును సైతం తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. అక్కడ ప్రత్యామ్నాయ నేతను అన్వేషిస్తున్నట్లు సమాచారం.
అటు విశాఖ జిల్లాలో సైతం భారీగా మార్పులు ఉంటాయని సమాచారం. ఇప్పటికే విశాఖ తూర్పు నియోజకవర్గానికి ఎంపీ ఎంవీఎస్ సత్యనారాయణను ఇన్చార్జిగా నియమించారు. గాజువాక నుంచి తిప్పల నాగిరెడ్డిని తప్పిస్తారని సమాచారం. ఎలమంచిలి నుంచి కన్నబాబు సైతం తప్పించి వేరొకరికి అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. భీమిలి నుంచి అవంతి శ్రీనివాసరావు పై విపరీతమైన వ్యతిరేకత ఉన్న దృష్ట్యా.. అక్కడ ప్రత్యామ్నాయ నేత కోసం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. పాయకరావుపేట నియోజకవర్గం నుంచి బాబురావు తప్పించి.. చెంగల వెంకట్రావుకు టికెట్ కన్ఫర్మ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికైతే ఉత్తరాంధ్రలో అభ్యర్థుల మార్పు విషయంలో జగన్ పెద్ద సాహసానికే దిగినట్లు పరిస్థితులు తెలియజేస్తున్నాయి. ఇంత పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చితే మూల్యం చెల్లించుకోక తప్పదని వైసీపీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.