Telangana BJP: వ్యూహాత్మకమైన తప్పిదాలతో తెలంగాణలో బీజేపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న పరిస్థితి.. ప్రస్తుతం బీజేపీలో కనిపిస్తోంది. క్రమశిక్షణకు మారుపేరు అయిన పార్టీలో ఇప్పుడు అదే కొరవడుతోంది. మూడు నెలల క్రితం వరకు అధికార బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం అనిపించిన పార్టీ కాస్త ఇప్పుడు పాత బీజేపీలా చల్లబడిపోయింది. ఈ క్రమంలో పార్టీకి ఊపు తెచ్చే ప్రయత్నాలను అధిష్టానం మొదలు పెట్టింది.
రంగంలోకి విస్తారక్‌లు..
ప్రతీ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు.. విస్తారక్‌ల పేరుతో ఆ రాష్ట్రానికి సంబంధం లేదని వందల మందిని పోలింగ్ బూత్‌ల దగ్గర ప్రచారానికి పంపుతుంది. అలా అహ్మదాబాద్ నుంచి 600 మందిని తెలంగాణకు పంపించారు. తమకు కేటాయించిన పోలింగ్ బూత్‌ల పరిధిలో పని చేయడం ప్రారంభించారు. ఈ విస్తారక్‌లు 35 ఏళ్ల లోపు వారే. పార్టీ పట్ల నిబద్దతగా ఉంటారు. ప్రతీ పోలింగ్ బూత్ పరిధిలో నేతల్ని వెంటబెట్టుకుని వెళ్లి ఓటర్లను కలుస్తారు. వారి ఫీడ్ బ్యాక్ పూర్తిస్థాయిలో తీసుకుంటారు. వీలైనంతగా ప్రచారం చేస్తారు. చివరికి నివేదికల్ని హైకమాండ్‌కు సమర్పిస్తారు. వీరు ఎక్కడ తిరుగుతారో అక్కడి పరిస్థితిని వివరిస్తారు.
నేతల తీరు, ప్రభుత్వాల పనితీరుపై సర్వే..
విస్తారక్‌లు ప్రచారంతోపాటు నేతల పనితీరును.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పని తీరు గురించి తెలుసుకుంటారు. ఓ రకంగా సర్వే చేస్తారన్నమాట. బీజేపీ తెలంగాణలో గెలవాలంటే ఏం చేయాలన్నదానిపై ఈ 600 మంది ఫీడ్ బ్యాక్ తీసుకుని.. హైకమాండ్ కు సమర్పిస్తారు. ఈ నివేదిక ఆధారంగా వారు తదుపరి వ్యూహాలు అమలు చేసే అవకాశాలు ఉంటాయి.
నష్టాని పూడుస్తారా..
అయితే తెలంగాణలో ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని.. ఎంత మందిని తీసుకొచ్చి ప్రచారం చేసినా ఏం ప్రయోజనమన్న నిరాశ బీజేపీ నేతల్లోనే కనిపిస్తోంది. మరోవైపు అధిష్టానం మాత్రం తెలంగాణను బీజేపీ ఖాతాలో వేసుకోవాలనుకుంటోంది. ఇందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేయాలని భావిస్తోంది. వారం రోజుల్లో అన్నీ సర్దుకునేలా అధిష్టానం పావులు కదుపుతోంది. మార్పులు, చేర్పుల తర్వాత పార్టీ మునుపటి దూకుడు ప్రదర్శిస్తుందని జాతీయ నాయకులు పేర్కొంటున్నారు. మరి చూడాలి బీజేపీలో మార్పు ఎలా ఉంటుందో..!!