Operation Sindoor: భూతల స్వర్గమైన జమ్ము కాశ్మీర్ లోని పహల్గాం ప్రాంతంలో ఉగ్రదాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో చాలామంది చనిపోయారు. దీని వెనక పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఉన్నట్టు భారత నిఘా వర్గాల ద్వారా తెలిసింది. ఆ తర్వాత భారత సైన్యం అదును చూసి పాకిస్తాన్ మీద ఎటాక్ చేసింది. ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా దాడులు మొదలుపెట్టింది. ఉగ్రవాదుల స్థావరాలను నేలమట్టం చేసింది.
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ మరింత దూకుడుగా దాడులు చేస్తుందని.. పాకిస్తాన్ దేశాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఊహించిన విధంగా పరిణామాలు మారిపోయాయి. అయితే ఆపరేషన్ సిందూర్ కు సంబంధించి ఇప్పుడు ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. భారత్ ఆపరేషన్ సిందూర్ చేపడుతున్నప్పుడు పాకిస్తాన్లో ఉన్న రాజకీయ నాయకులు వణికి పోయారని తెలుస్తోంది. ఈ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. భారత్ ఆపరేషన్ సిందూర్ చేపడుతున్నప్పుడు తమ సైన్యం బంకర్ లోకి వెళ్లిపోవాలని సూచించినట్టు పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జార్దారి పేర్కొన్నారు. ఇటీవల పాకిస్తాన్ దేశంలో జరిగిన ఓ సభలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
పహల్గాం ఘటన జరిగిన తర్వాత పాకిస్తాన్ మీద భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఉగ్రవాదుల స్థానాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసింది. ఈ దాడులలో పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాదుల స్థావరాలు నేల కూలిపోయాయి. వీటి పునరుద్ధరణకు పాకిస్తాన్ ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయడం విశేషం.
ఇక పాకిస్తాన్ లో జరిగిన బహిరంగ సభలో అధ్యక్షుడు జర్దారి కీలక వ్యాఖ్యలు చేశారు. ” ఆపరేషన్ సిందూర్ జరుగుతున్నప్పుడు సైనిక విభాగాన్ని పర్యవేక్షించే కార్యదర్శి నా దగ్గరికి వచ్చారు. యుద్ధం దాదాపుగా మొదలైంది. మీరు ఇక బంకర్ లోకి వెళ్ళాలి” అని నన్ను అప్రమత్తం చేశారని జర్దారి పేర్కొన్నారు. అతడి సలహాను తాను తిరస్కరించినట్టు జర్దారి వెల్లడించారు.