Operation Sindoor: ప్రస్తుతం ఉగ్ర దేశం సాగిస్తున్న దమనకాండను భారత్ అత్యంత సమర్థవంతంగా తిప్పి కొట్టిందీ అంటే దానికి ప్రధాన కారణం త్రివిధ దళాలు అత్యంత బలంగా ఉండడమే.. అందువల్లే దాయాది దేశం మనపై కన్నెత్తి చూడాలంటేనే భయపడుతోంది. అయితే ఇంతటితోనే భారతదేశం ఆగడం లేదు. త్రివిధ దళాలతో పాటు.. నిత్యం మనదేశ భద్రతకు సంబంధించి పది ఉపగ్రహాలను సైతం లైన్లో పెట్టింది. ఇస్రో ఆ పని చేస్తోంది. నిత్యం దేశభద్రతలో ఈ 10 ఉపగ్రహాలు నిమగ్నమై ఉన్నాయి.. ఇవి మన దేశ ప్రజల రక్షణ కోసం.. మన దేశానికి సంబంధించిన కీలకమైన ప్రయోజనాల కోసం నిరంతరం పనిచేస్తుంటాయి. శత్రుదేశంతో నిత్యం ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పది ఉపగ్రహాలు చేస్తున్న పనిని ఇస్రో చైర్మన్ నారాయణన్ వెల్లడించారు. మణిపూర్ రాష్ట్రంలోని ఇంపాల్ ప్రాంతంలో జరిగిన సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఐదవ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు.. ఈ సందర్భంగా దేశ భద్రతకు సంబంధించి కీలకమైన విషయాలను వెల్లడించారు.. ముఖ్యంగా 10 ఉపగ్రహాలు మన దేశానికి సంబంధించి భద్రతను ఏ విధంగా పటిష్టం చేస్తున్నాయి, రక్షణను ఏ విధంగా పెంపొందిస్తున్నాయి అనే విషయాలను స్పష్టంగా వెల్లడించారు.
అందువల్లే ఉపయోగిస్తున్నాం
“మన దేశం చుట్టూ శత్రువులే ఉన్నారు. ఆ శత్రువులు ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకోసమో.. 10 గ్రహాలను లైన్లో పెట్టాం. అవి ప్రతిరోజు మన దేశాన్ని పరిరక్షిస్తూనే ఉంటాయి. నిత్యం 7వేల కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరాన్ని అవి పర్యవేక్షిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా మనదేశంలో ఉత్తరభాగాన్ని అవి ఒక కంట కనిపెట్టుకొని ఉంటాయి. అయితే ఈ ప్రక్రియ మొత్తం శాటిలైట్, డ్రోన్ ద్వారా చేపట్టాలి కాబట్టి.. అందువల్లే 10 ఉపగ్రహాలను ఉపయోగిస్తున్నామని” నారాయణన్ వ్యాఖ్యానించారు..”శత్రు దేశాలతో నిత్యం ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. అవి ఎప్పుడు ఏం అలుపు తీసుకుంటాయో అర్థం కావడం లేదు. అలాంటప్పుడు మనల్ని మనం రక్షించుకోవడం అత్యంత అవసరం.. కొద్దిరోజులుగా అంతర్జాతీయ సరిహద్దులు.. దేశీయ సరిహద్దుల్లో ఎలాంటి ఘటనలు జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా రాత్రిపూట శత్రు దేశాలు దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.. కాల్పులకు కూడా తెగబడుతున్నాయి. ఇలాంటప్పుడు మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంతేకాదు దేశ రక్షణను కూడా అంతే నిష్టతో చేపట్టాలి. అలాంటప్పుడు కేవలం దళాలు మాత్రమే కాకుండా.. సాంకేతిక పరిజ్ఞాన సహకారం కూడా తీసుకోవాలి. అందువల్ల ఈ పది ఉపగ్రహాలను ఉపయోగించుకుంటున్నాం. ఉపగ్రహాలు నిత్యం దేశంలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు చేరవేరుస్తుంటాయి. అదే కాదు దేశంలో ఏ మూలన ఏదైనా తేడా కనిపిస్తే వెంటనే సంబంధిత విభాగాలకు సమాచారం వెళుతుంది. తర్వాత వెంటనే చర్యలు మొదలవుతాయి. శత్రు దేశాలను చుట్టు పెట్టుకొని మనం మనుగడ కొనసాగిస్తున్నామంటే దానికి ప్రధాన కారణం ఇలాంటి సాంకేతిక వ్యవస్థలేనని.. వచ్చే కాలంలో మరిన్ని అత్యాధునిక ఉపగ్రహాలను అందుబాటులోకి తీసుకొస్తాం. దీనివల్ల దేశభద్రతను మరింత పటిష్టం చేస్తామని” నారాయణన్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే భారతదేశం అంతరిక్ష ప్రయోగాలు చేసే అభివృద్ధి చెందిన దేశాల కంటే పై స్థాయిలో ఉంది. అమెరికా, చైనా తర్వాత అత్యధిక అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్న దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. చివరికి జాబిల్లిపై నీటి జాడలు ఉన్నాయని, అక్కడక్కడ హీలియం నిల్వలు కూడా ఉన్నాయని ఇస్రో మాత్రమే చెప్పగలిగింది. ఇక ఇస్రో పది ఉపగ్రహాలు పాకిస్థాన్లోని కీలక ప్రాంతాలను మనకు తెలిసేలా చేశాయి. అందువల్లే ఈ దాడులు సాధ్యమయ్యాయని ప్రచారం జరుగుతోంది.